close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
9 లక్షల మందికి ఉచిత నీరు

హైదరాబాద్‌లో పథకాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌
డిసెంబరు బిల్లులు కట్టనక్కరలేదని వెల్లడి
సంక్షోభంలోనూ సంక్షేమం కొనసాగిందని ఉద్ఘాటన

ఈనాడు, హైదరాబాద్‌- న్యూస్‌టుడే, బోరబండ: హైదరాబాద్‌ నగరంలో ఒక్కో ఇంటికి నెలకు 20 వేల లీటర్ల వరకు ఉచిత తాగునీటి సరఫరా పథకానికి పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు శ్రీకారం చుట్టారు. జూబ్లీహిల్స్‌లోని దివ్యాంగుల కాలనీలో దీనిని ప్రారంభించారు. కొందరికి ‘జీరో నీటి బిల్లు’లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ పథకంతో పేదలకు రెండురోజుల ముందే సంక్రాంతి వచ్చిందని అన్నారు. హైదరాబాద్‌లో దాదాపు 9 లక్షల కుటుంబాలకు ఉచితంగా తాగునీటిని సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు. త్వరలో అందుబాటులోకి రానున్న కేశవాపురం ప్రాజెక్టుతో 2050 వరకు తాగునీటికి ఢోకా ఉండదని వెల్లడించారు. ఈ పథకం వల్ల నగరంలోని సుమారు 97 శాతం పేద, మధ్య తరగతి కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని, మురికివాడల్లోని ఎంతోమందికి ఊరట లభిస్తుందన్నారు. జనవరిలో జారీ చేసిన డిసెంబరు బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. నెలకు 20 వేల లీటర్లకు మించి వినియోగించిన వారు మాత్రమే ఆ మేరకు బిల్లు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఉచిత సౌకర్యాన్ని పొందాలంటే.. తప్పనిసరిగా మీటర్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మురికివాడల్లో మీటర్లు అవసరం లేదని కేటీఆర్‌ తెలిపారు.

దిల్లీ తర్వాత.. మనమే
ప్రస్తుతం ఇలాంటి పథకం దేశ రాజధాని దిల్లీలో అమలవుతుండగా.. తర్వాతి స్థానంలో హైదరాబాద్‌ నిలుస్తుందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. కరోనా ఆర్థిక సంక్షోభంలోనూ సంక్షేమ పథకాల కొనసాగింపు ఆగిపోలేదన్నారు. తాము ఆరేళ్లుగా ప్రజలపై పన్నుల భారం మోపలేదన్నారు. మంత్రులు మహమూద్‌అలీ, మల్లారెడ్డి, తలసాని ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వివరించారు.ఎంపీ రంజిత్‌రెడ్డి, మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్‌, దానం నాగేందర్‌, కె.పి.వివేకానంద్‌, ముఠా గోపాల్‌, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, మున్సిపల్‌ వ్యవహారాల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ అర్వింద్‌కుమార్‌, జలమండలి ఎం.డి. దానకిషోర్‌, ఈడీ సత్యనారాయణ పాల్గొన్నారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు