close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
చాలీచాలని టీకా నిల్వలు

ఉగాది రోజున ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిలిపివేత!

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొవిడ్‌ టీకాల నిల్వలు రోజురోజుకూ తరిగిపోతున్నాయి. మరో 2 రోజులకు సరిపడా డోసులు మాత్రమే అందుబాటులో ఉండడంతో.. వైద్యవర్గాల్లో ఆందోళన పెరుగుతోంది. ఈ నెల 11 నుంచి 14 వరకూ ‘టీకాల ఉత్సవం’ జరపాలని ప్రధాని మోదీ ఇటీవల పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. టీకాల కొరత ఉందంటూ తెలంగాణ సహా పలు రాష్ట్రాలు కేంద్రం దృష్టికి తీసుకెళ్లాయి. రాష్ట్రానికి ఇప్పటివరకూ 26.78 లక్షల టీకా డోసులు సరఫరా కాగా.. ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు సుమారు 22 లక్షల డోసులు వేసినట్లు వైద్యవర్గాలు తెలిపాయి. మరో 4.78 లక్షల డోసులు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం రోజుకు 1.50 లక్షల నుంచి 1.70 లక్షలకు పైగా టీకాలు వేస్తున్నారు. దీన్ని 2 లక్షలకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ లెక్కన ప్రస్తుతం నిల్వ ఉన్న టీకాలు 2 రోజులకు మాత్రమే సరిపోతాయని అంచనా.
మరో 3 లక్షల టీకాలను పంపనున్న కేంద్రం!
టీకాల కొరతపై శనివారం సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ లేఖ రాసిన విషయం విదితమే. దీనికి కేంద్ర ఉన్నతాధికారులు లిఖితపూర్వక సమాధానం ఇవ్వకపోయినా.. విశ్వసనీయ సమాచారం ప్రకారం రాష్ట్రానికి మరో 3 లక్షల టీకాలను పంపనున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి. వీటిలో 2 లక్షల డోసులు కొవాగ్జిన్‌, మరో 1.09 లక్షల డోసుల కొవిషీల్డ్‌ ఉన్నట్లు అనధికారిక సమాచారం అందినట్లు వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. ఒకవేళ 3 లక్షల డోసులు సరఫరా చేసినా.. ఒకటిన్నర రోజుకు మించి సరిపోవు. మంగళవారం(13న) ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో టీకాల కార్యక్రమం నిలిపివేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి. ఈలోగా టీకాలు రాష్ట్రానికి చేరితే.. బుధవారం(14) నుంచి తిరిగి వేయనున్నట్లు పేర్కొన్నాయి.
ఒక్కరోజే 1.62 లక్షల మందికి..
రాష్ట్రంలో శనివారం(10న) రికార్డుస్థాయిలో 1,62,385 డోసులను వేశారు. ప్రభుత్వ వైద్యంలోని 944 పంపిణీ కేంద్రాల్లో 1,39,150 డోసులు, 232 ప్రైవేటు ఆసుపత్రుల్లో 23,235 డోసులను ఇచ్చినట్లు ప్రజారోగ్య సంచాలకులు (డీహెచ్‌) డాక్టర్‌ జి.శ్రీనివాసరావు ఆదివారం వెల్లడించారు. తాజాగా టీకాలను పొందినవారిలో 1,53,295 మంది తొలి డోసు, 9,090 మంది రెండో డోసు పొందారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో 17,61,653 తొలి డోసు టీకాలను, 2,99,742 రెండో డోసు టీకాలను వేశారు. ఇందులో 45 ఏళ్లు పైబడినవారు 80 శాతానికి పైగా ఉండడం విశేషం. ఇప్పటివరకూ రాష్ట్రంలో 2.93 శాతం డోసులు వృథా అయినట్లు డీహెచ్‌ తెలిపారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు