close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కన్న కొడుకే కాలయముడై..

విశాఖలో తల్లి, తండ్రి, తమ్ముడి హత్య
పొగ తీవ్రతకు నిందితుడూ మరణం

ఈనాడు, విశాఖపట్నం, పీఎం పాలెం, న్యూస్‌టుడే: నవమాసాలు మోసి కని పెంచిన తల్లిని... పెంచి పెద్ద చేసి ఉన్నత చదువులు చెప్పించిన తండ్రిని కన్న కొడుకే పొట్టన పెట్టుకున్నాడు. చివరకు తమ్ముడినీ హతమార్చాడు. తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నం బెడిసికొట్టి.. తానూ ప్రాణాలు కోల్పోయాడు. విశాఖపట్నంలో గురువారం తెల్లవారుజామున ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఘటనాస్థలంలో దొరికిన ఆధారాలను బట్టి కుమారుడు తప్ప మిగిలిన వారి ప్రమేయం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని నగర పోలీసు కమిషనర్‌ మనీశ్‌ కుమార్‌ సిన్హా ప్రకటించారు. ఈ హత్యలకు కుటుంబ వివాదాలే కారణం కావొచ్చని ఆయన తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలివి.. విశాఖపట్నం శివారు మధురవాడ లో ఆదిత్య ఫార్చూన్‌ టవర్స్‌ సి-బ్లాక్‌ ఫ్లాట్‌ నంబరు 505లో సుంకరి బంగారునాయుడు(50) కుటుంబంతో ఉంటున్నారు. 20 ఏళ్ల పాటు బహ్రెయిన్‌లో ఉండి.. మూడేళ్ల క్రితమే విశాఖవచ్చారు. ఆయన భార్య నిర్మల (45) హోమియో వైద్యురాలు. పెద్దకుమారుడు దీపక్‌ (25) వరంగల్‌ నిట్‌లో ఇంజినీరింగ్‌చేసి  దిల్లీలో సివిల్స్‌కు శిక్షణ తీసుకుని, కొన్నాళ్లుగా ఇంట్లోనే ఉంటున్నాడు. చిన్నకుమారుడు కశ్యప్‌(19) ఇంటర్‌ చదువుతున్నాడు.

తెల్లవారుజామున అరుపులు.. పొగ
గురువారం తెల్లవారుజామున సుమారు నాలుగు గంటలకు ఫ్లాట్‌ నుంచి పొగలు వస్తున్నాయని ఓ మహిళ వాట్సప్‌ గ్రూప్‌లో పోస్ట్‌ చేశారు. దీంతో భద్రతాసిబ్బంది, మరికొందరు కూడా లేచి.. 505 ఫ్లాట్‌ దగ్గరకు వెళ్లి చూశారు. అగ్నిప్రమాదమని భావించి కిందికి వచ్చేశారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి.. తలుపులు కొట్టినా ఎవరూ తీయకపోవడంతో వాటిని బద్దలుకొట్టి లోపలికి వెళ్లారు. పొగ, మంటలు ఉన్నా.. ప్రధానద్వారం పక్కనే బంగారునాయుడి మృతదేహం పడి ఉంది. హాల్లోనే మరోచోట డాక్టర్‌ నిర్మల మృతదేహం బోర్లా పడి ఉంది. లోపలగదిలో కశ్యప్‌ మృతదేహం వెల్లకిలా నగ్నంగా పడిఉంది. అతని శరీరంపై పలు గాయాలున్నాయి. నిర్మల మృతదేహంపైనా పలుగాయాలున్నాయి. బంగారునాయుడి శరీరంపై కత్తిపోట్లు ఉన్నాయి.

సూటుతో ముస్తాబై.. కుప్పకూలిన దీపక్‌
బంగారునాయుడు, నిర్మల, కశ్యప్‌ మృతదేహాలపై తీవ్ర గాయాలుండగా... దీపక్‌ మాత్రం సూట్‌, టై ధరించి ముస్తాబైనట్లు పోలీసులు గుర్తించారు. అతని శరీరంపై గాయాలు లేవు. దీని ఆధారంగానే ముగ్గురినీ దీపక్‌ హత్యచేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ముగ్గురినీ హతమార్చి..వారిని తగలబెడదామన్న ఆలోచనతో ఇంట్లో నిప్పంటించి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. పొగ తీవ్రంగా రావడంతో అతను ఉక్కిరిబిక్కిరై మృతిచెంది ఉంటాడని చెబుతున్నారు. కత్తులతో పొడవడంతో ప్రాణరక్షణ కోసం కుటుంబసభ్యులు పరుగెత్తినట్లు తెలుస్తోంది. ఫ్లాట్‌ గోడలపైనా, నేలపైనా, కప్‌బోర్డ్‌ల తలుపులపైనా రక్తపు మరకలు ఉన్నాయి. గదుల్లోనూ, మంచంపైన బియ్యం గింజలు ఉండటంతో ఏమైనా క్షద్రపూజలు జరిగాయా అన్న కోణంలో పోలీసులు ఆరాతీశారు. బియ్యం పోసి కేసును పక్కదారి పట్టించడానికి దీపక్‌ ప్రయత్నించి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.



ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు