close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ నరసింహం కన్నుమూత

 బ్యాంకింగ్‌ సంస్కరణల పితామహుడిగా గుర్తింపు
 ఆర్థిక రంగానికి విశేష సేవలు
 పద్మవిభూషణ్‌తో సత్కరించిన ప్రభుత్వం

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌, మూసాపేట, న్యూస్‌టుడే: ప్రముఖ ఆర్థికవేత్త, భారతీయ రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్‌ మైదవోలు నరసింహం (94) కన్నుమూశారు. పదిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇక్కడి అపోలో ఆసుపత్రిలో మంగళవారం తుదిశ్వాస విడిచారు. నరసింహం భారతీయ రిజర్వు బ్యాంకుకు 13వ గవర్నర్‌గా ఏడునెలల పాటు పనిచేశారు. ఆర్థిక రంగంలో విశేష సేవలందించిన ఆయన భారతీయ బ్యాంకింగ్‌ రంగ సంస్కరణలకు పితామహుడిగా గుర్తింపు పొందారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు ఆయన మనవడు.
ఉద్యోగి నుంచి ఆర్‌బీఐ గవర్నర్‌ స్థాయికి..
బెంగళూరుకు చెందిన శేషాచలపతి, పద్మావతి దంపతులకు నరసింహం 1927లో జన్మించారు. మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీ, కేంబ్రిడ్జిలోని సెయింట్‌ జాన్స్‌ కళాశాలల్లో విద్యాభ్యాసం పూర్తి చేసిన నరసింహం రిజర్వు బ్యాంకు అదనపు కార్యదర్శిగా కొనసాగారు. ఆర్‌బీఐలో ఉద్యోగిగా మొదలై అదే బ్యాంకు గవర్నర్‌గా నియమితులైన ఏకైక వ్యక్తి నరసింహమే కావడం విశేషం. అనంతరం ప్రపంచ బ్యాంకులో భారత ప్రభుత్వం తరఫున ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా సేవలందించారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థలో దక్షిణ ఆసియా విభాగం అధ్యక్షునిగా, భారత ప్రభుత్వ ఆర్థిక శాఖ కార్యదర్శిగా విశిష్ట సేవలందించి ప్రత్యేక గుర్తింపు పొందారు. కేంద్ర ప్రభుత్వం ఆయన నేతృత్వంలో రెండు వేర్వేరు కమిటీలను వేసింది. 1991లో విత్త వ్యవస్థ మార్పుల కోసం ఏర్పాటు చేసిన నరసింహం-1 కమిటీ, 1998 బ్యాంకింగ్‌ రంగంలో సంస్కరణల కోసం వేసిన నరసింహం-2 కమిటీలకు ఆయన అధ్యక్షత వహించారు. తర్వాత హైదరాబాద్‌లోని అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజీ (ఆస్కీ) ప్రిన్సిపల్‌గా 1983 నుంచి 1985 వరకు, వైస్‌ ఛైర్మన్‌గా 1988 నుంచి 1991 వరకు, ఛైర్మన్‌గా 1991 నుంచి 2012 వరకు సేవలందించారు. ఆర్థిక రంగానికి చేసిన సేవలకుగాను 2000లో కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మ విభూషణ్‌ పురస్కారంతో సత్కరించింది. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో నివాసముంటున్నారు. భార్య శాంతి సుందరేషన్‌ ఆరేళ్ల కిందట చనిపోయారు. కుమారుడు రాధాకృష్ణన్‌ ఫిలిప్పీన్స్‌లో స్థిరపడ్డారు. ఫిలింనగర్‌ వైకుంఠధామంలో మంగళవారం సాయంత్రం ఆయన అంత్యక్రియలు నిర్వహించారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు