Corona పడగ నీడన పల్లెలు
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Corona పడగ నీడన పల్లెలు

విరుచుకు పడుతున్న వైరస్‌
నగరాలు, పట్టణాల నుంచి వ్యాప్తి
లక్షణాలున్నా బయటికి చెప్పకపోవడంతో పెరుగుతున్న ముప్పు
భారీగా పెరుగుతున్న మరణాలు
ఈనాడు - హైదరాబాద్‌

ఒకే గ్రామంలో నెల రోజుల్లో 20 మంది..
జగిత్యాల గ్రామీణ మండలం చల్‌గల్‌ గ్రామం కరోనా కల్లోలంతో వణికిపోతోంది. నెలరోజుల్లోనే ఇక్కడ 20 మంది మరణించారు. 6,500 మంది నివసిస్తున్న ఆ గ్రామంలో 200 మందికి పైగా వైరస్‌ బారినపడ్డారు. జగిత్యాలలో ఉన్న మామిడి మార్కెట్‌ చల్‌గల్‌కు అనుకుని ఉంటుంది. ఇక్కడికి మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ తదితర రాష్ట్రాల నుంచి వందల సంఖ్యలో లారీలు వస్తుంటాయి. మార్కెట్‌లోని కూలీలు గ్రామంలోకి వెళ్తుండటం, గ్రామానికి చెందిన వారు మార్కెట్‌లోకి రాకపోకలు సాగిస్తుండటం వైరస్‌ వ్యాప్తికి కారణమని భావిస్తున్నారు.

పాతమద్దిపడగలో 20 రోజుల్లో 10 మంది..
నిర్మల్‌ జిల్లా కడెం మండలం పాతమద్దిపడగ గ్రామ జనాభా 4 వేలు. గడిచిన 20 రోజుల్లోనే 10 మంది కొవిడ్‌కు  బలయ్యారు. ఇందులో నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు. ఒక కుటుంబంలోని నలుగురు అన్నదమ్ముల్లో ముగ్గురు కొవిడ్‌తో మరణించారు. మరో సోదరుడు చికిత్స పొందుతుండగా, ఆయన భార్యను మహమ్మారి బలితీసుకుంది. మార్చి వరకు ఈ గ్రామంలో ఒక్కటంటే ఒక్క కేసు కూడా నమోదుకాలేదని, 3 వారాల్లోనే 50 మందికి సోకిందని గ్రామస్థులు పేర్కొన్నారు.

 

పల్లెలు కరోనా గుప్పిట్లోకి వెళ్తున్నాయి. వైరస్‌పై అవగాహన లేకపోవడం, కరోనా లక్షణాలున్నా సరైన వైద్యం తీసుకోకపోవడంతో గ్రామీణులు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మండల కేంద్రాలు, గ్రామాల్లోనూ మరణాలు భారీగా నమోదవుతున్నాయి. కొన్ని ఊళ్లలో ఇంట్లో ఇద్దరు, ముగ్గురు కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయిన ఉదంతాలున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రతో సరిహద్దున ఉన్న గ్రామాలు, హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, ఖమ్మం నగరాలకు చుట్టూఉన్న పల్లెల్లో వ్యాప్తి ఉద్ధృతంగా ఉంటోంది. గ్రామీణ ప్రజలు జీవనోపాధి కోసం నగరాలు, పట్టణాలకు వలస వచ్చి, వైరస్‌ సోకిన తరువాత సొంతూళ్లకు వెళ్తుండటం వ్యాప్తికి కారణమవుతోందనే అనుమానాలను అధికారులు వ్యక్తంచేస్తున్నారు. ఇంటి యజమానుల నుంచి ఇబ్బందులు ఉంటాయన్న కారణంగా కొందరు వైరస్‌ సోకిన తర్వాత గ్రామాలకు వెళ్లి అక్కడే ఆశ్రయం పొందుతున్నారని, ఇది కూడా తీవ్రతను పెంచుతోందని పేర్కొంటున్నారు. ‘‘మా గ్రామంలో 230 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇంటింటి జ్వర సర్వేలో 177 కుటుంబాలను పరిశీలించాం. ఇప్పటికే ఇద్దరికి కరోనా నిర్ధారణయింది. జ్వరం, జలుబు లక్షణాలున్నప్పటికీ కొందరు అంతా బాగుందని చెబుతూ పరీక్షలకు దూరంగా ఉంటున్నారని’’ నల్గొండ జిల్లాకు చెందిన పంచాయతీ కార్యదర్శి ఒకరు తెలిపారు. ‘జిల్లా కేంద్రానికి దగ్గర్లోని గ్రామంలో ఓ వృద్ధురాలు చనిపోయింది. ఆమె కొడుకుకు అప్పటికే పాజిటివ్‌గా నిర్ధారణయింది.  జ్వరం, జలుబు లక్షణాలున్నప్పటికీ కొందరు అంతా బాగుందని చెబుతూ పరీక్షలకు దూరంగా ఉంటున్నారని’’ నల్గొండ జిల్లాకు చెందిన పంచాయతీ కార్యదర్శి ఒకరు తెలిపారు. ‘జిల్లా కేంద్రానికి దగ్గర్లోని గ్రామంలో ఓ వృద్ధురాలు చనిపోయింది. ఆమె కొడుకుకు అప్పటికే పాజిటివ్‌గా నిర్ధారణయింది. ఎవరికీ చెప్పకుండా అంత్యక్రియలు నిర్వహించాడు. హాజరైన వారిలో 26 మంది బంధువులు కరోనా బారినపడ్డారు’’ అని జగిత్యాల జిల్లా అధికారి ఒకరు చెప్పడం పరిస్థితి తీవ్రతకు దర్పణమే.

రకరకాల కారణాలతో వ్యాప్తి..
* నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం ముందిపల్లి గ్రామంలో ఇటీవల ఓ నాటక ప్రదర్శన జరిగింది. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు హాజరయ్యారు. తర్వాత రెండు రోజుల వ్యవధిలో గ్రామానికి చెందిన 25 మంది కడపలోని ఓ ఆలయ దర్శనానికి వెళ్లారు. తిరిగి వచ్చిన తరువాత లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా 12 మందికి పాజిటివ్‌గా నిర్ధారణయింది. తర్వాత గ్రామంలోని అనుమానితులంతా పరీక్షలు చేయించుకుంటే 30 మందికి పాజిటివ్‌గా తేలింది.
* మంచిర్యాల జిల్లా కాసిపేట కోమటిచేను గ్రామంలోని రేగులగూడెం ఆదివాసీ గూడెంలో 200 మంది ఉన్నారు. ఇటీవల ఓ వేడుకకు హాజరై వచ్చారు. ఒకరిలో లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకుంటే పాజిటివ్‌గా తేలింది. వారం రోజుల్లోనే 56 మంది కరోనా బారిన పడ్డారు. ఇప్పుడిప్పుడే అందరూ  కోలుకుంటున్నారు.

*భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌ మండలం ఏడపల్లి గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమానికి 10 కిమీ దూరంలోని మహారాష్ట్ర సరిహద్దు ప్రజలు హాజరయ్యారు. వారం తర్వాత పరీక్షలు చేయించుకుంటే చాలా మందికి పాజిటివ్‌ వచ్చింది.
*జగిత్యాల జిల్లాలోని ముత్యంపేట, కొండగట్టు గ్రామాల్లో ఇటీవల కరోనా కేసులు పెరిగాయి. సమీపంలోని మల్యాల పట్టణానికి రైతులు కూరగాయలు తీసుకెళ్లేవారని, ఈ క్రమంలో గ్రామంలోకి వైరస్‌ వ్యాప్తి జరిగిందని గ్రామస్థులు చెబుతున్నారు.

ఇప్పటికైనా మేలుకుంటేనే..

* కరోనా నిర్ధారణయితే ఊర్లో ప్రజలు అంటరాని వారిగా చూస్తారన్న కారణంతో గ్రామీణులు పరీక్షలు చేయించుకోవడం లేదు.
*సరైన వైద్యం తీసుకోకుండా చిట్కాలు, ఆర్‌ఎంపీ వైద్యం తీసుకుంటూ అనారోగ్యం పాలవుతున్నారు.
* వైరస్‌ లక్షణాలున్నా చాలామంది బయటికి చెప్పడం లేదు. దీంతో ఆరోగ్య పరిస్థితి విషమిస్తోంది.
* పట్టణాలు, మండల కేంద్రాలకు స్థానిక ప్రజా రవాణా సాధనాలనే వినియోగిస్తున్నారు. దీంతో వైరస్‌ గ్రామాల్లోకి వ్యాపిస్తోంది.
*ఈ నేపథ్యంలో ప్రజల్లో అవగాహన కల్పించేలా క్షేత్రస్థాయి యంత్రాంగం కృషి చేయడంతోపాటు, పరీక్షల సంఖ్యను పెంచడం, వైరస్‌ బాధితులకు సకాలంలో చికిత్స అందించడం, వారిని మిగిలిన వారికి దూరంగా ఉంచేలా ఎక్కడికక్కడ ఐసొలేషన్‌ కేంద్రాలు ఏర్పాటుచేయడం వంటివి చేస్తే తప్ప వ్యాప్తిని అదుపు చేయడం సాధ్యం కాదనే అభిప్రాయాలను వైద్య సిబ్బంది వ్యక్తం చేస్తున్నారు.

 

కిట్ల కొరతతో పెరుగుతున్న తీవ్రత

గతంతో పోలిస్తే కరోనా పరీక్షల సంఖ్య తగ్గుతోంది. గ్రామాల పరిధిలోని పీహెచ్‌సీ, సబ్‌పీహెచ్‌సీల్లో కిట్లు లేవు. కరోనా లక్షణాలున్నా అనుమానితులకు పరీక్షలు చేయడం లేదు. దీంతో వారంతా మందుల షాపుల్లో ఔషధాలు కొనుక్కుని వినియోగిస్తున్నారు. ఉదాహరణకు కడెం మండలంలో రోజుకు 50కి మించి కిట్లు రావడం లేదు. స్థానికులు రోజూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వరకు వెళ్లి వెనక్కు వస్తున్నారు. లక్షణాలు ఉండటం.. నిర్ధారణలో జాప్యంతో వారిలో భయం పెరుగుతోంది. గ్రామాల్లో జ్వరపీడితులను గుర్తించేందుకు ఇంటింటికీ సర్వే నిర్వహిస్తున్నా ఆశించిన లక్ష్యం నెరవేరడం లేదు. ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు వ్యాక్సిన్‌, నిర్ధారణ పరీక్షల్లో నిమగ్నమయ్యారు. పంచాయతీ కార్యదర్శులకు థర్మా మీటర్లు, ఆక్సిమీటర్లు సరఫరా చేయలేదు. దీంతో కొందరు పంచాయతీ కార్యదర్శులు సొంతగా కొనుగోలు చేసి, పంచాయతీ సిబ్బందితో పరీక్షలు నిర్వహిస్తున్నారు. జ్వరపీడితులకు కిట్లు సమకూర్చకపోవడంతో అందుబాటులోని పారాసిటమాల్‌ మాత్రలు ఇస్తున్నారు. రెండు మూడు రోజులు జ్వరం మాత్రలు మాత్రమే వినియోగిస్తున్న కొందరు..తర్వాత తీవ్ర అస్వస్థతకు గురవుతున్నట్టు తమ పరిశీలనలో తేలిందని కార్యదర్శులు కొందరు పేర్కొన్నారు.
 

ఒకే ఊరిలో 150 కేసులు
ఏడుగురి మృతి

సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం అన్నారం గ్రామ జనాభా 6,840. ఇటీవల 150 మంది కరోనా బారినపడ్డారు. నెలరోజుల వ్యవధిలో ఏడుగురు కన్నుమూశారు. ఇందులో నలుగురు 35-40 ఏళ్లలోపువారే. అవి అధికారిక లెక్కలని, మరో అయిదుగురు కూడా కరోనాతో చనిపోయారని గ్రామస్థులు చెబుతున్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని