విపత్తు వేళా... విశేష ప్రగతి
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విపత్తు వేళా... విశేష ప్రగతి

కరోనాపై గెలిచిన పారిశ్రామిక రంగం
ప్రపంచంలోని 20 అత్యుత్తమ కంపెనీల కార్యకలాపాలు
ఐటీలో జాతీయ సగటు కంటే రెట్టింపు వృద్ధి
రామగుండం, నల్గొండ, సిద్దిపేటల్లో ఐటీ సౌధాలు
పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌
2020-21 పరిశ్రమలు, ఐటీ శాఖల వార్షిక నివేదికల విడుదల

ఈనాడు, హైదరాబాద్‌: దేశంలో అన్ని రంగాల్లో సమతుల అభివృద్ధి సాధిస్తున్న అరుదైన రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమర్థ నాయకత్వం, ప్రభుత్వ అత్యుత్తమ విధానాలు, కష్టపడి పనిచేస్తున్న అధికారుల బృందం వల్లనే రాష్ట్రం ముందడుగు వేస్తోందన్నారు. కరోనా సంక్లిష్ట పరిస్థితుల్లోనూ పారిశ్రామిక, ఐటీ రంగాల్లో అద్భుత ప్రగతిని సాధించిందని తెలిపారు. దేశ తలసరి ఆదాయం రూ. 1,27,768 కాగా, రాష్ట్ర తలసరి ఆదాయం రూ.2,27,145గా ఉందన్నారు. టీఎస్‌ఐపాస్‌ ద్వారా గత ఏడేళ్లలో రూ.2,14,951 కోట్లకు పైగా పెట్టుబడులు రాగా 15.6 లక్షల ఉద్యోగాలు లభించాయన్నారు. ప్రపంచంలోని అత్యుత్తమమైన ఫార్చ్యూన్‌- 500 కంపెనీల్లోని 20 కంపెనీలు హైదరాబాద్‌ను తమ పెట్టుబడులు, కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా ఎంచుకున్నాయని గుర్తుచేశారు.  ఐటీలో జాతీయ సగటు కంటే రెట్టింపు వృద్ధిని సాధించామన్నారు. తెలంగాణ ఏర్పడినప్పుడు 3.23 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉండగా... ఏడేళ్ల తర్వాత అది రెట్టింపయ్యిందని, 6.28 లక్షల మంది ఈ రంగంలో పనిచేస్తున్నారన్నారు. నల్గొండ, సిద్దిపేట, రామగుండంలలో త్వరలో ఐటీ సౌధాలను ఏర్పాటు చేస్తామన్నారు. 2020-21 వార్షిక పరిశ్రమలు, ఐటీ శాఖల ప్రగతి నివేదికలను గురువారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీహెచ్‌ర్డీ)లో కేటీఆర్‌ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆ శాఖల ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌, కమిషనర్‌ మానిక్‌రాజ్‌, చేనేత శాఖ కమిషనర్‌ శైలజారామయ్యర్‌, మీ సేవా కమిషనర్‌ వెంకటేశ్వర్‌రావు, టీఎస్‌ఐఐసీ ఎండీ వెంకట నర్సింహారెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడారు.

చిన్నపరిశ్రమలను కేంద్రమే ఆదుకోవాలి
అంతర్జాతీయ ఔషధరంగానికి హైదరాబాద్‌ కేంద్రంగా మారిందని, జినోమ్‌వ్యాలీలోని పరిశ్రమలకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేటీఆర్‌ తెలిపారు. ఔషధనగరికి త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ శంకుస్థాపన చేస్తారన్నారు. వైమానిక రంగంలోనూ రాష్ట్రం ఆకాశమే హద్దుగా పురోగమిస్తోందని, మహబూబ్‌నగర్‌ జిల్లా దివిటిపల్లిలో త్వరలో సోలార్‌పార్క్‌కు శంకుస్థాపన చేస్తామన్నారు. టీహబ్‌ రెండో దశ భవనాన్ని ప్రారంభిస్తామన్నారు. కరోనాతో ఇబ్బందుల్లో ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను కేంద్రం ఆదుకోవాలని, గత ఏడాది ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీని అమలు చేయాలన్నారు. విపక్ష, స్వపక్ష అనే తేడా లేకుండా అందరినీ సమదృష్టితో చూడాలన్నారు.

బెంగళూరును అధిగమించాం
కార్యాలయ స్థల వినియోగంలో హైదరాబాద్‌ బెంగళూరును అధిగమించింది. గోదాముల వసతిలో 42 శాతం వృద్ధిని సాధించింది. నవీన సాంకేతికతలైన కృత్రిమ మేధ, బ్లాక్‌చైన్‌, మెషిన్‌ లెర్నింగ్‌, క్లౌడ్‌, డ్రోన్లను ప్రోత్సహించాం. డ్రోన్ల ద్వారా ఔషధ రవాణాను ప్రారంభించాం. కరోనా సమయంలో పౌరసేవలకు సాంకేతికతను పెద్దఎత్తున వినియోగించాం. చేనేత, జౌళి రంగంలో కొత్త పార్కులు రానున్నాయి. వరంగల్‌ కాకతీయ జౌళిపార్కులో ఉత్పత్తులు ప్రారంభమవుతాయి. చిన్న పరిశ్రమలకు అన్ని విధాలా చేయూతనిచ్చాం. ఈ-కామర్స్‌ సేవలను ప్రారంభించాం. 275 ఖాయిలా పరిశ్రమలను పునరుద్ధరించాం. టీ-వాలెట్‌, టీ-యాప్‌ల సేవలను విస్తరించాం’’ అని కేటీఆర్‌ వివరించారు.
కరోనా మహమ్మారి కారణంగా మీ సేవ లావాదేవీల విలువ తగ్గింది. 2019తో పోల్చితే 2020, 2021లో ఈ తగ్గుదల గణనీయంగా నమోదైంది. 2021 మార్చి 31 నాటికి 2.86 కోట్ల పౌరసేవలు అందించినట్లు ఐటీశాఖ వెల్లడించింది. రాష్ట్రప్రభుత్వ అధీనంలోని నగదు చెల్లింపుల యాప్‌ టీ-వాలెట్‌లో 12.3 లక్షల మంది ప్రజలు తమ పేర్లు నమోదు చేసుకున్నారని, ఇప్పటి వరకు రూ.12,128 కోట్ల విలువైన 2.42 కోట్ల లావాదేవీలు నిర్వహించారని వివరించింది. సగటున రోజూ 23 వేల లావాదేవీలు జరుగుతున్నాయి.

ఐటీ ఎగుమతుల్లో 12.98% వృద్ధి
‘తెలంగాణ ఐటీ ఎగుమతుల్లో 12.98% వృద్ధి సాధించింది. 2020-21లో రాష్ట్రంలో 46,489 కొత్త ఉద్యోగాలొచ్చాయి. 2020-21 మధ్య కాలంలో తెలంగాణ జీఎస్‌డీపీ (స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి) రూ. 9.78 లక్షలు. జాతీయ జీడీపీలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ వాటా 26 బేస్‌ పాయింట్లు పెరిగి 2020-21లో 5 శాతానికి చేరుకుంది, 2019-20లో ఇది 4.74 శాతంగా ఉంది. గత ఏడేళ్లలో ఐటీ రంగంలో మూడు లక్షలకుపైగా ఉద్యోగాలు లభించాయి, టీఎస్‌ఐఐసీ ద్వారా 10 పారిశ్రామిక పార్కులకు 810 ఎకరాలను కేటాయించాం. వాటిలో రూ. 6023 కోట్ల పెట్టుబడులతో 453 కొత్త పరిశ్రమలు వచ్చాయి. 7623 మందికి ఉపాధి కలిగింది. పారిశ్రామిక ప్రామాణికాల్లో రాష్ట్రం ఉత్తమ ర్యాంకులను సాధించింది. వైమానిక పారిశ్రామిక రంగాల్లో హైదరాబాద్‌ మొదటి స్థానంలో నిలిచింది. టీహబ్‌ ఎన్నో రాష్ట్రాలకు ఆదర్శంగా ఉంది. దీని ద్వారా 2000 అంకుర సంస్థలు ప్రారంభమయయ్యాయి, టీఎస్‌ఐసీ, రిచ్‌, వీహబ్‌ ద్వారా ఆవిష్కర్తలను ప్రోత్సహించాం.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని