అక్రమ నిర్మాణాలపై ఏకపక్షంగా స్టేలు వద్దు

ప్రధానాంశాలు

అక్రమ నిర్మాణాలపై ఏకపక్షంగా స్టేలు వద్దు

న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేస్తున్నారు
 జస్టిస్‌ చల్లా కోదండరాం


‘‘అక్రమ నిర్మాణాలకు సంబంధించి ఇంజంక్షన్‌ ఉత్తర్వులు ఏకపక్షంగా ఇవ్వరాదని, జీహెచ్‌ఎంసీ వివరణ తీసుకుని ఇవ్వాలని గతంలో హైకోర్టు ధర్మాసనం ఆదేశించినా అమలుకావడంలేదు. అనుమతి లేని కట్టడాలకు న్యాయస్థానాలు అనుమతులిస్తున్నాయన్న అభిప్రాయం ప్రజల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. క్షేత్రస్థాయి అధికారులతో కలిసి అక్రమార్కులు న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేస్తున్నారు. కోర్టులకు సవాలు విసురుతున్నారు.

- జస్టిస్‌ చల్లా కోదండరాం


ఈనాడు, హైదరాబాద్‌: కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేస్తూ అక్రమ నిర్మాణాలను పూర్తి చేస్తున్న తీరుపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ‘‘నిర్మాణ దశలో జీహెచ్‌ఎంసీ అధికారులు నోటీసులు ఇవ్వగానే అక్రమ నిర్మాణదారులు కింది కోర్టులకు వెళ్లి ఇంజంక్షన్‌ (స్టే) ఉత్తర్వులను పొందుతున్నారు. కేసు విచారణకు వచ్చేసరికి ఉపసంహరించుకుంటున్నారు. ఈలోగా నిర్మాణాన్ని పూర్తి చేసుకుంటున్నారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం తగిన ఆదేశాలు జారీ చేయాలి’’ అని కోరింది. ఈ మేరకు జస్టిస్‌ చల్లా కోదండరాం ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్‌ నింబోలిఅడ్డాలో అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలన్న ఆదేశాలు అమలుకాకపోవడాన్ని సవాలు చేస్తూ ఆర్‌.నరేంద్రబాబు కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్‌ చల్లా కోదండరాం జీహెచ్‌ఎంసీ దాఖలు చేసిన కౌంటరులోని అంశాలను చూసి విస్తుపోయారు. ‘‘నింబోలిఅడ్డాలో ఓంప్రకాశ్‌, సురేష్‌లు అనుమతి పొందిన దానికంటే పెద్దగా నిర్మాణం చేపట్టారు. దీనిపై ఫిర్యాదు అందింది. నిర్మాణం ప్రారంభించిన 2017లో నోటీసులు ఇచ్చాం. యథాతథ స్థితి కొనసాగించాలని కింది కోర్టు నుంచి ఇంజంక్షన్‌ ఉత్తర్వులు పొందారు. మేం కౌంటరు దాఖలు చేశాం. పిటిషనర్లు రాకపోవడంతో కోర్టు కేసు కొట్టివేసింది’’ అని జీహెచ్‌ఎంసీ న్యాయవాది పాశం కృష్ణారెడ్డి తెలిపారు.

సర్కిల్‌ వివరాలను తెప్పించిన న్యాయమూర్తి

నింబోలిఅడ్డా కేసులో సివిల్‌ కోర్టులో ఇంజంక్షన్‌ ఉత్తర్వులు పొంది కొవిడ్‌ సమయంలో నిర్మాణం పూర్తి చేయడాన్ని గమనించిన జస్టిస్‌ చల్లా కోదండరాం మరిన్ని వివరాలను తెప్పించారు. గత అయిదేళ్లలో సర్కిల్‌ 16లో 189 పిటిషన్‌లు దాఖలయ్యాయి. వాటిలో ఎక్కువగా పిటిషనర్లు ఉపసంహరించుకోవడం, లేదంటే హాజరు కాకపోవడంతో కొట్టివేసినట్లు గుర్తించారు. జీహెచ్‌ఎంసీలో మొత్తం 30 సర్కిళ్లు ఉండగా ఇలాంటి పిటిషన్‌లు లెక్కకు మిక్కిలి ఉంటాయని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించాల్సి ఉందని, అందువల్ల ఈ కేసును అక్రమ నిర్మాణాలపై విచారణ చేపడుతున్న ధర్మాసనం ముందుంచాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. తగిన నిర్ణయం నిమిత్తం ఈ కేసును ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందుంచాలని రిజిస్ట్రీని ఆదేశించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని