బుద్ధుని చరిత్ర బోధపడేలా..

ప్రధానాంశాలు

బుద్ధుని చరిత్ర బోధపడేలా..

నాగార్జున సాగర్‌లో సిద్ధమైన బుద్ధవనం

ఆగస్టు నెలాఖరులో ప్రారంభానికి ముహుర్తం!

ఈనాడు, నల్గొండ: గౌతమబుద్ధుడి పుట్టుక నుంచి మహాపరినిర్యాణం వరకు పూర్తి చరిత్రని ఒకేచోట తెలుసుకొనేలా ప్రసిద్ధ బౌద్ధక్షేత్రం నాగార్జునసాగర్‌లో నిర్మిస్తున్న ‘బుద్ధవనం’ ప్రాజెక్టు ప్రారంభానికి సిద్ధమైంది. ఈ వనాన్ని గతేడాదే ప్రారంభించాల్సి ఉన్నా వివిధ కారణాలతో ఆలస్యమైంది. ఆగస్టు నెలాఖరులో ప్రాజెక్టును ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పటికే తొలిదశలో ప్రారంభించిన పనులన్నీ పార్కులో పూర్తయ్యాయి. కృష్ణా నది ఒడ్డున 274 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ వనాన్ని 8 సెగ్మెంట్లుగా విభజించారు. గత పదిహేనేళ్లుగా స్తూపం పార్కు, జాతక పార్కు, బుద్ధచరిత్ర వనం, ధ్యానవనం, మహాస్తూపం సెగ్మెంట్లలో పనులు సాగాయి. మరో మూడు సెగ్మెంట్లలో బుద్ధిజానికి సంబంధించి విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని రెండేళ్ల క్రితం అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. సర్కారు నుంచి ఆమోదం లభించినా పనులు ఇంకా మొదలు కాలేదు. ఇప్పటివరకు పార్కు అభివృద్ధికి రూ.80 కోట్ల వరకు ఖర్చు చేశారు. పార్కు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందని బుద్ధవనం ప్రాజెక్టు ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య ‘ఈనాడు’కు వెల్లడించారు.

ఇవీ ప్రత్యేకతలు

* బంగారు వర్ణంలో మహాస్తూపం, అందులో బుద్ధుడి ప్రతిమ, పైన తైలవర్ణంతో కూడిన డోం సిద్ధమైంది.

* బుద్ధుడి జీవితాన్ని తెలుసుకొనే విధంగా వివిధ చారిత్రక వస్తువులతో మ్యూజియం ఏర్పాటు చేశారు.

* పార్కులో బుద్ధుడి పాద ముద్రికలను లోటస్‌పాండ్‌లో ఉంచేవిధంగా నిర్మాణం చేశారు.

* శ్రీలంక, థాయ్‌లాండ్‌ వంటి వివిధ దేశాల బౌద్ధ సంస్కృతులను ప్రతిబింబించే స్తూపాల నిర్మాణాలు పూర్తయ్యాయి.

* సందర్శకులను రైలులో పార్కు అంతా తిప్పి చూపించడానికి వీలుగా రైలు పట్టాలు నిర్మించనున్నారు. ఇక్కడ వినియోగించే రైలు ఇప్పటికే పార్కుకు చేరుకుంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని