close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
టీకా.. రూ. 500?

  ఒక్కో డోసు ఖరీదు ఇది!
నేడో రేపో సర్కారు ఖరారు
  ప్రైవేటులో పంపిణీపై చర్చలు

ఈనాడు- హైదరాబాద్‌: ప్రభుత్వ ఆసుపత్రుల్లో టీకా పొందేవారికి ఉచితంగా ఇస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. ప్రైవేటులో  వేయించుకునేవరు మాత్రం కొంత డబ్బు చెల్లించాలని స్పష్టం చేయడంతో.. ఖరీదు ఎంత ఉండొచ్చనేది చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో 60 ఏళ్ల పైబడినవారు, 45-60 ఏళ్ల మధ్యన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు సుమారు 55 లక్షలమంది ఉంటారని వైద్యవర్గాలు అంచనా వేస్తుండడంతో.. వీరిలో ప్రైవేటు ఆసుపత్రుల్లో టీకాలు పొందేవారు కూడా పెద్ద సంఖ్యలోనే ఉండొచ్చని వైద్యశాఖ అంచనా వేస్తోంది. ప్రైవేటులో టీకాకు ఖరీదును ఎంత ఖరారు చేస్తారనేదానిపై ఆసక్తి నెలకొంది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం శుక్ర, శనివారాల్లో ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటి వరకూ టీకా ఖరీదుపై స్పష్టత లేకపోయినా.. ఒక్కో డోసు ఖరీదు సుమారు రూ. 500 లోపే ఉండొచ్చని వైద్యవర్గాలు పేర్కొన్నాయి. ఒక లబ్ధిదారు 28 రోజుల వ్యవధిలో రెండు డోసులు పొందాల్సి ఉండడంతో.. అంతకంటే ఎక్కువ ఖరీదు పెడితే స్పందన ఉండదేమోననే భావన వ్యక్తమవుతోంది.
236 ప్రైవేటు ఆసుపత్రుల్లో..
రాష్ట్రంలో మరో 3 రోజుల్లో అత్యధిక జనాభాకు కొవిడ్‌ టీకా అందుబాటులోకి రానుంది. ఆరోగ్యశ్రీ ట్రస్టుకు అనుసంధానంగా ఉన్న 236 ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులతోపాటు ప్రభుత్వ ఆసుపత్రులను కలుపుకొని సుమారు 1500కి పైగా కేంద్రాల్లో టీకా పంపిణీకి ఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేస్తోంది. 60 ఏళ్ల పైబడినవారు, 45-60 ఏళ్ల మధ్యన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి వీటిలో టీకాలు వేస్తారు. ఆరోగ్యశ్రీ ట్రస్టు ఆసుపత్రుల్లో కూడా టీకాలను పొందవచ్చు. అయితే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించే ధర చెల్లించాల్సి ఉంటుంది.
సరఫరా ఎలా?
ప్రైవేటు ఆసుపత్రులకు టీకాలను ఎవరు సరఫరా చేస్తారనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. నేరుగా కేంద్ర ప్రభుత్వమే సరఫరా చేస్తుందా? రాష్ట్ర గిడ్డంగి నుంచి వెళ్తాయా? లేదా నేరుగా ఉత్పత్తి సంస్థల నుంచి ప్రైవేటు ఆసుపత్రులు కొనుక్కుంటాయా? అనేదానిపై ప్రస్తుతానికి స్పష్టత లేదని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వమే ఒకట్రెండు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేస్తుందని పేర్కొన్నారు.
మరింత అప్రమత్తత
కొవిడ్‌ టీకాల పంపిణీలో ఇప్పటి వరకూ తీవ్ర దుష్ప్రభావాలేమీ కనిపించలేదని వైద్యవర్గాలు చెప్పాయి. అయితే ఇక ముందు పంపిణీ భారీ స్థాయిలో ఉండబోవడంతో.. ఏవైనా దుష్ప్రభావాలు తలెత్తితే ఎదుర్కోవడానికి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా నోడల్‌ అధికారులను నియమించారు. అన్ని కేంద్రాల్లోనూ సత్వర చికిత్సకు ప్రత్యేకంగా కిట్లను సరఫరా చేయనున్నారు. ఒకవేళ ఆసుపత్రిలో చేర్చి మెరుగైన చికిత్స అందించాల్సి వస్తే ముందుజాగ్రత్తగా నిమ్స్‌ సహా 60కి పైగా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులను ఎంపిక చేశారు. అస్వస్థతకు గురైన వారు కూడా వైద్యసలహా అవసరమైతే 104 నెంబరుకు ఫోన్‌ చేయాలని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు తెలిపారు.

* ప్రైవేటు పంపిణీపైనా ప్రభుత్వ పర్యవేక్షణ ఉంటుంది.
* ప్రతి లబ్ధిదారు సమాచారాన్ని కొవిన్‌   2.0 యాప్‌లో పొందుపర్చాలి.
* వయసు, వ్యాధులకు సంబంధించిన సమాచార పత్రాలను కచ్చితంగా అప్‌లోడ్‌ చేయాలి. ప్రతి టీకా పంపిణీకి పక్కాగా ప్రభుత్వానికి లెక్క చెప్పాలి.
* ప్రైవేటులో టీకా పంపిణీని ఎప్పటికప్పుడూ పర్యవేక్షించడానికి ప్రత్యేక బృందాలను నియమించనున్నారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు