close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అగ్నిమాపక నిబంధనలు పాటించాల్సిందే

 లేదంటే మూసేయాల్సిందే
 ప్రైవేటు కళాశాలలకు హైకోర్టు స్పష్టీకరణ.. తీర్పు వాయిదా

ఈనాడు, హైదరాబాద్‌: ప్రైవేటు కళాశాలలు అగ్నిమాపక నిబంధనలను అమలు చేసి తీరాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. లేని పక్షంలో వాటిని మూసేయాల్సిందేనని పేర్కొంది. పాత భవనాలకు నిబంధనలు అమలు చేయలేమంటూ మినహాయింపు కోరలేరని, ఇది పిల్లల ప్రాణాలకు సంబంధించిన అంశమని, తీవ్రంగా పరిగణించాల్సిందేనని తెలిపింది. దీనిపై తీర్పును వాయిదా వేసింది.
అగ్నిమాపక నిబంధనలను అమలు చేయాలంటూ ఆ శాఖ జారీ చేసిన సర్క్యులర్‌ను సవాలు చేస్తూ శ్రీచైతన్య ఎడ్యుకేషనల్‌ కమిటీ, గౌతమి జూనియర్‌ కాలేజి, శ్రీగాయత్రి ఎడ్యుకేషనల్‌ సొసైటీ తదితర కళాశాలలు దాఖలు చేసిన 10 పిటిషన్‌లపై గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమాకోహ్లి, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. కొన్ని కళాశాలల తరఫున సీనియర్‌ న్యాయవాది సి.వి.మోహన్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఆయా కళాశాలలను మూసివేస్తే అందులో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తుకు ఇబ్బంది ఉంటుందని, గత 25 ఏళ్లుగా ఆ కాలేజీలు కొనసాగుతున్నాయని చెప్పారు. అయినా పిల్లల భవిష్యత్తు పేరుతో వాటిని అనుమతించలేమని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఆ భవనాల్లో ఒకవైపు చిట్‌ఫండ్‌ కంపెనీలు, మరోవైపు కాలేజీలు నిర్వహిస్తున్నారంది. ఈ దశలో సీనియర్‌ న్యాయవాది జోక్యం చేసుకుంటూ దిల్లీలో కూడా ఇదే పరిస్థితి ఉందనగా ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. దేశ రాజధానిలో జరుగుతుంటే రాష్ట్ర రాజధానిలోనూ అక్రమాలను అనుమతించాలా అని ప్రశ్నించింది. కాలేజీల పరిస్థితిపై అధ్యయనానికి కమిటీ వేయాలంటూ దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌నూ పరిగణనలోకి తీసుకోబోమని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రస్తుతం కాలేజీలను వాణిజ్య సంస్థలుగా నిర్వహిస్తూ, దోపిడీకి పాల్పడుతున్నారని వ్యాఖ్యానించింది.
ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎ.సంజీవ్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ మొత్తం 68 కళాశాలలకు నోటీసులు జారీ చేశామని, వాటిలో 19 కాలేజీలు తరలించి అనుమతులు పొందాయని, 9 నిరభ్యంతర పత్రాలు పొందాయని, 40 మూతపడ్డాయని పేర్కొన్నారు. దీనిపై రాతపూర్వకంగా ఎందుకు నివేదిక సమర్పించలేదని ధర్మాసనం ప్రశ్నించింది. వాదనల అనంతరం పిటిషన్‌లపై తీర్పును వాయిదా వేసింది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు