Indo-China border: డ్రాగన్‌పై భారత్‌ ‘పినాకా’స్త్రం!

తాజా వార్తలు

Published : 23/10/2021 01:27 IST

Indo-China border: డ్రాగన్‌పై భారత్‌ ‘పినాకా’స్త్రం!

మెరుపు వేగంతో లక్ష్యాన్ని ఛేదించే రాకెట్ల మోహరింపు

ఇంటర్నెట్‌ డెస్క్‌: సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖ వెంబడి చైనా కవ్వింపులకు భారత్‌ దీటుగా బదులిస్తోంది. డ్రాగన్‌ పెద్దఎత్తున యుద్ధ విమానాలు, సైన్యాన్ని మోహరించగా.. మన దేశం కూడా అదే తరహాలో రాకెట్‌ వ్యవస్థలను సరిహద్దులకు తరలిస్తోంది. యుద్ధం అంటూ వస్తే శత్రువులకు తగిన రీతిలో బుద్ధిచెప్పేందుకు అన్ని వ్యవస్థలను సిద్ధంచేస్తూ నిత్యం మాక్‌డ్రిల్స్‌ నిర్వహిస్తోంది.

భారత్‌- చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో సైన్యం అనునిత్యం అప్రమత్తంగా ఉంటూ పహారా కాస్తోంది. శత్రుదేశంలోని కీలక ప్రాంతాల్లోకి చొచ్చుకెళ్లే సామర్థ్యంతో రూపొందించిన పినాక, స్మెర్చ్‌ రాకెట్‌ వ్యవస్థలను రూపొందించింది. అత్యంత శక్తిమంతమైన ఈ రెండు రాకెట్‌ వ్యవస్థలను ప్రస్తుతం అసోంలోని ఈస్ట్రన్‌ సెక్టార్‌లో పలుచోట్ల ఏర్పాటు చేసింది. పినాక రాకెట్‌ వ్యవస్థ కేవలం 44 సెకెన్లలో 75 రాకెట్లను పేల్చడం ద్వారా 100 మీటర్ల పొడవు, 800 మీటర్ల వెడల్పు కలిగిన ప్రాంతాన్ని భస్మీపటలం చేయగల సత్తాతో కూడినది. పినాకలో మైదాన ప్రాంతంలో ఉన్న లక్ష్యం కోసం ఒక రాకెట్‌ను.. కొండలు, ఇతర క్లిష్టప్రాంతాల్లో ఉన్న లక్ష్యాన్ని ఛేదించేందుకు మరో తరహా రాకెట్‌ను మార్చుకోగల ప్రత్యేక వ్యవస్థ ఉంది. ఈ రెండు రాకెట్లను ఎత్తైన ప్రదేశంలో ఏర్పాటు చేస్తే ఎక్కువ దూరంలోని లక్ష్యాలను ఛేదించే అవకాశం ఉంటుందని సైనికాధికారులు తెలిపారు. 75 కి.మీ.ల లక్ష్యాన్ని ఛేదించేలా అభివృద్ధి చేసిన పినాక రాకెట్‌ వ్యవస్థ త్వరలో సైన్యంలో చేరనున్నట్టు వెల్లడించారు.

మరో రాకెట్‌ వ్యవస్థ స్మెర్చ్‌ 90 కి.మీల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగల సామర్థ్యం కలిగి ఉంది. 40 సెకెన్లలో 44 రాకెట్లను పేల్చగల సామర్థ్యంతో స్మెర్చ్‌ రాకెట్‌ వ్యవస్థను రూపొందించారు. ఇది 1200 చదరపు మీటర్ల ప్రాంతాన్నీ ధ్వంసం చేయగలదు. భారత సైన్యంలో అత్యధికంగా 90కి.మీల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల సత్తా ఉన్న రాకెట్‌ స్మెర్చ్‌ ఒక్కటే. ఈ రాకెట్‌ వ్యవస్థను భారత్‌ రష్యా నుంచి దిగుమతి చేసుకుంది. ప్రస్తుతం భారత సైన్యంలో మూడు స్మెర్చ్‌ రెజిమెంట్లు ఉన్నాయి. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో డీఆర్‌డీవో రూపొందించిన పినాక రాకెట్‌కు సంబంధించి ప్రస్తుతం నాలుగు రెజిమెంట్లు ఉన్నాయి. మరో ఆరు రెజిమెంట్లను సైన్యం సిద్ధం చేస్తోంది. పినాక, స్మెర్చ్‌ రాకెట్‌ వ్యవస్థలు అతి తక్కువ సమయంలో వేగంగా స్పందించే సత్తా కలిగి ఉన్నాయి. లక్ష్యాన్ని ఛేదించడంలోనూ అత్యంత కచ్చితత్వంతో పనిచేయగలవు.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని