కారులో కొవిడ్‌ రిస్క్‌ తప్పించుకోవాలంటే?

తాజా వార్తలు

Published : 05/12/2020 19:54 IST

కారులో కొవిడ్‌ రిస్క్‌ తప్పించుకోవాలంటే?

బోస్టన్‌: ఓ వైపు కొవిడ్‌ భయం వెంటాడుతున్నా కొన్నిసార్లు ప్రయాణాలు చేయడం అనివార్యమవుతోంది. వృత్తిరీత్యానో, ఇతర అవసరాల రీత్యానో ప్రయాణించక తప్పడం లేదు. ఈ క్రమంలో బ్రౌన్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు కారు ప్రయాణంలో కొవిడ్‌ రిస్క్‌ను తప్పించుకునేందుకు కొన్ని సూచనలు చేశారు. డ్రైవర్‌తో పాటు ఒక ప్రయాణికుడు ఉన్నప్పుడు ఎలా వ్యవహరించాలో తమ అధ్యయనంలో పేర్కొన్నారు. కంప్యూటర్‌ మాడ్యుల్స్‌ను ఉపయోగించి చేసిన ఈ అధ్యయనం సైన్స్‌ అడ్వాన్సెస్‌ అనే జర్నల్‌లో ప్రచురితమైంది.

కారులో డ్రైవర్‌తో పాటు ఒకే ప్రయాణికుడు ఉన్నప్పుడు విండోస్‌ తెరవడం మూయడం ఆధారంగా కొవిడ్‌ తరహా వైరస్‌ల రిస్క్‌ను ఎలా తప్పించుకోవచ్చో పరిశోధకులు వివరించారు. ముఖ్యంగా డ్రైవర్‌ పక్కన కాకుండా వెనుకవైపు అవతలి వైపు కూర్చోవడం ద్వారా భౌతిక దూరం సాధ్యపడుతుందని పరిశోధకులు పేర్కొన్నారు. ఆ సమయంలో వారిద్దరి నుంచి వచ్చే గాలి తుంపర్లు ఒకరి నుంచి ఒకరిని చేరే అవకాశం తక్కువ అని తెలిపారు. అలానే కారులోని అన్ని కిటికీలను మూయడం కన్నా తెరవడమే శ్రేయస్కరమని వెల్లడించారు.

అన్ని కిటికీలను మూసి ఉంచడం కన్నా ఒక కిటికీనైనా తెరిచి ఉంచడం మంచిదని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా కారులోని ముందు కిటికీల కంటే వెనుక కిటికీల నుంచి గాలి పీడనం అధికంగా ఉంటుందని పేర్కొన్నారు. అలాగే సీట్లలో కూర్చున్నప్పుడు తమ పక్కనే ఉన్న కిటికీలను తెరవడం శ్రేయస్కరం అని కొందరు భావిస్తుంటారని, కానీ తమకు ఎదురుగా ఉన్న కిటికీలను తెరవడం ద్వారా రిస్క్‌ను తగ్గించుకోవచ్చని పరిశోధకులు అంటున్నారు. అయితే, ప్రయాణ సమయంలో మాస్క్‌ ధరించడం, ప్రయాణాలను వాయిదా వేసుకోవడానికి మించిన ఉత్తమ మార్గం మరోటి లేదని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని