close

తాజా వార్తలు

Published : 20/10/2020 19:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘హ్యూమన్‌ ఛాలెంజ్‌’కు యూకే ఓకే!

లండన్‌: కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ సమర్థతను కచ్చితంగా అంచనా వేయగలిగే ‘హ్యూమన్‌ ఛాలెంజ్’ ప్రయోగాల‌కు యూకే ప్రభుత్వం మద్దతు తెలిపింది. ఈ అధ్యయనం కోసం 33.6 మిలియన్‌ పౌండ్లు ఖర్చు చేయనున్నట్లు ప్రకటించింది. దీనిలో భాగంగా ఇంపీరియల్‌ కాలేజీ భాగస్వామ్యంతో అధ్యయనం చేపట్టనుంది. నియంత్రణ సంస్థలు, ఎథిక్స్‌ కమిటీల ఆమోదం పొందిన వెంటనే ఈ అధ్యయనం ప్రారంభిస్తామని ప్రభుత్వం పేర్కొంది. అయితే, వీటి ఫలితాలు వచ్చే మే నెలలో వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. కరోనా వైరస్‌ విషయంలో ఈ తరహా అధ్యయనం చేపట్టడం ప్రపంచంలోనే తొలిసారని పరిశోధకులు పేర్కొన్నారు. తొలిదశలో భాగంగా దాదాపు 90 మంది వాలంటీర్లు ఈ ప్రయోగాల్లో పాల్గొంటారని బ్రిటన్‌ ప్రభుత్వం పేర్కొంది.

కరోనా వ్యాక్సిన్‌ మానవ ప్రయోగాల్లో భాగంగా ఇప్పటి వరకు కేవలం ఆరోగ్యవంతులపై మాత్రమే క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహిస్తున్నారు. కానీ, ఈ పద్ధతిలో వాలంటీర్లకు ఉద్దేశపూర్వకంగా వైరస్‌కు గురయ్యేటట్లు చేస్తారు. అనంతరం వాక్సిన్‌ సమర్థత, సురక్షితను పరీక్షిస్తారు. తద్వారా కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో వ్యాక్సిన్‌ ఏ మేరకు పనిచేస్తుందనే విషయాన్ని కచ్చితంగా తెలుసుకునే వీలుంటుంది. ఇవి కరోనా వైరస్‌వ్యాప్తిని క్షుణ్ణంగా అర్థం చేసుకోవడంలో దోహదం చేయడంతోపాటు కొవిడ్‌ చికిత్స, వ్యాక్సిన్‌ అభివృద్ధిని వేగవంతం చేస్తుందని పరిశోధన బృందానికి నేతృత్వం వహిస్తున్న ఇంపీరియల్‌ కాలేజ్‌ నిపుణులు డాక్టర్‌ క్రిస్‌ చియూ పేర్కొన్నారు. అయితే, ఈ ప్రయోగాల్లో ఏ వ్యాక్సిన్‌ను వాడతారనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు.

హ్యూమన్‌ ఛాలెంజ్‌ ప్రయోగాలు ఇలా..!

ప్రయోగాల్లో భాగంగా వైరస్‌ ముప్పు తక్కువగా ఉండే, ఎలాంటి ఆరోగ్య సమస్యలూ లేని 18 నుంచి 30 ఏళ్ల వయసున్న యువకులను ఎంచుకుంటారు. ముఖ్యంగా గుండె జబ్బులు, మధుమేహం, స్థూలకాయం వంటి సమస్యలు లేనివారినే తీసుకుంటారు. శరీరంలో కొవిడ్‌-19 ఇన్‌ఫెక్షన్‌ అభివృద్ధి కావడానికి ఎంత మోతాదు వైరస్‌ అవసరమవుతుందనే విషయాన్ని కనుగొనే లక్ష్యంతోనే ఈ మొదటి దశ ప్రయోగం చేపడతారు. అనంతరం వైరస్‌ డోసు పెంచుకుంటూ పోతారు. దీన్నే వైరస్‌ క్యారక్టరైజేషన్‌గా పేర్కొంటారు. తొలి దశ పూర్తైన తర్వాత హ్యూమన్‌ ఛాలెంజ్‌ పద్ధతి ద్వారా శరీరంలో కరోనా వైరస్‌ను అడ్డుకోవడం, నియంత్రించడంలో వ్యాక్సిన్‌ ప్రభావాన్ని అధ్యయనం చేస్తారు. అంతేకాకుండా రోగనిరోధకత ఎలా స్పందిస్తుందనే విషయాన్ని పరిశీలిస్తారు. ఈ ప్రయోగాలను ప్రత్యేక బయో క్వారంటైన్‌ వసతుల మధ్య జరుపుతారు.

కరోనా వైరస్‌ కేసుల సంఖ్య పెరగడం, తగ్గడం వల్ల వ్యాక్సిన్‌ పనితీరును అంచనా వేయడం సాధారణ ప్రయోగాల ద్వారా సాధ్యం కాదు. ఎందుకంటే ఒక్కోసారి వ్యాక్సిన్‌ తీసుకున్న వాలంటీర్లు వైరస్‌ బారినపడకపోవచ్చు. దీంతో వ్యాక్సిన్‌ పనితీరును అంచనా వేయడం కష్టమవుతుంది. ఈ తరహా ప్రయోగాల ద్వారా వ్యాక్సిన్‌ పనితీరును కచ్చితంగా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఏయే వ్యాక్సిన్‌లు విజయవంతం అవుతాయో విషయాన్ని తెలుసుకోవడంలో దోహదపడుతాయి. ఒకేసారి ఏయే వ్యాక్సిన్‌లు ఎంత సమర్థంగా పనిచేస్తున్నాయనే విషయాలను పోల్చిచూడటం కూడా సాధ్యమవుతుంది. అందుకే ఈ తరహా ప్రయోగాలను కీలకంగా వ్యవహరిస్తారు.

అయితే ఈ తరహా ప్రయోగాలు ఎక్కువ రిస్కుతో కూడుకున్నవి. అందుకే వీటిపై అంతర్జాతీయంగా నిపుణుల్లోనే భిన్నాభిప్రాయాలున్నాయి. అమెరికాలో ప్రముఖ అంటువ్యాధుల నిపుణులు ఆంటోని ఫౌచీ కూడా ఈ ప్రయోగాలను గతంలోనే వ్యతిరేకించారు. అయితే, వ్యాక్సిన్‌ సమర్థతను పరీక్షించేందుకు మాత్రం ఇటువంటి ప్రయోగాలు దోహదపడతాయని మరికొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.