సెంట్రల్‌ విస్టా.. అత్యవసరమైన ప్రాజెక్టు

తాజా వార్తలు

Published : 31/05/2021 12:22 IST

సెంట్రల్‌ విస్టా.. అత్యవసరమైన ప్రాజెక్టు

నిర్మాణ పనులపై స్టే విధించేందుకు దిల్లీ కోర్టు నిరాకరణ

దిల్లీ: కొవిడ్‌ ఉద్ధృతి వేళ పార్లమెంట్‌ నూతన భవన సముదాయం సెంట్రల్‌ విస్టా నిర్మాణ పనులు కొనసాగిస్తుండటంపై ప్రతిపక్ష కాంగ్రెస్‌ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న వేళ.. దీనిపై దిల్లీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ ప్రాజెక్టు చాలా ముఖ్యమైనది, అత్యవసరమైనది అని పేర్కొన్న న్యాయస్థానం.. సెంట్రల్‌ విస్టా నిర్మాణ పనులు కొనసాగాల్సిందేనని తేల్చి చెప్పారు. 

కరోనా ఉద్ధృతి సమయంలో సెంట్రల్‌ విస్టా నిర్మాణం అంతగా అవసరం లేదని, ఆ పనులను వెంటనే నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ డాక్యుమెంటరీ ఫిల్మ్‌మేకర్‌, చరిత్రకారుడు సోహైల్‌ హష్మీ, ట్రాన్సలేటర్‌ అన్యా మల్హోత్రా దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ డీఎన్‌ పటేల్‌ నేతృత్వంలోని ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది. ఈ ప్రాజెక్టు చట్టబద్ధతను ఇప్పటికే సుప్రీంకోర్టు సమర్థించిందని, నిర్మాణ పనులకు దిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ కూడా అనుమతించిందని న్యాయస్థానం గుర్తుచేసింది. ఇప్పటికే కూలీలు కూడా సైట్‌ వద్ద ఉన్నారని తెలిపింది. 

అందువల్ల నిర్మాణ పనులను ఆపేందుకు ఎలాంటి కారణం లేదని పేర్కొంటూ పిటిషన్‌ను కొట్టివేసింది. అంతేగాక, ఇది నిజమైన ప్రజాప్రయోజన వ్యాజ్యం కాదని, ఎవరి ప్రోద్బలంతోనే వేసిన పిటిషన్‌లా ఉందని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో పిటిషన్‌దారులకు రూ. లక్ష చొప్పున జరిమానా విధించింది. 

పార్లమెంట్‌ నూతన భవన సముదాయం సెంట్రల్‌ విస్టా నిర్మాణ పనులు వెంటనే ఆపాలంటూ గత కొంతకాలంగా కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తోన్న విషయం తెలిసిందే. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వానికి మాత్రం సెంట్రల్ విస్టాకే ప్రాధాన్యం ఇస్తోందంటూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ సోషల్‌మీడియా వేదికగా దుయ్యబట్టారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని