విషవాయువులు సృష్టించిన విధ్వంసాలు..!

తాజా వార్తలు

Updated : 07/05/2020 17:43 IST

విషవాయువులు సృష్టించిన విధ్వంసాలు..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: మానవ జీవన క్రమంలో ఎన్నో ఒడిదొడుకులు, సవాళ్లను ఎదుర్కొంటూనే ఉన్నాం. ప్రకృతి ప్రకోపంతో కొన్ని విపత్తులు జరుగుతుండగా మరికొన్ని మాత్రం మానవుని నిర్లక్ష్యం కారణంగా భారీ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి ప్రమాదాలు ప్రజల ఆరోగ్యంతోపాటు అక్కడి అభివృద్ధిపై దీర్ఘకాలికంగా ప్రభావం చూపిస్తున్నాయి. తాజాగా విశాఖపట్నంలో జరిగిన గ్యాస్‌ లీక్‌ ఘటనతో ప్రజలు పిట్టల్లా రాలిపోవడం, జంతువులు, పక్షులు విలవిలలాడుతూ కొట్టుకోవడం వంటి ఘటనలు దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. పరిశ్రమల నుంచి ప్రమాదకర రసాయనాలు, గ్యాస్‌లు లీక్‌ అయినప్పుడు వాటి తీవ్రత ఎంత ఉంటుందో ఇలాంటి ఘటనలు చూస్తే అర్ధం అవుతుంది. అత్యంత ప్రమాదకర రసాయనాలతో వాడకంలో నిర్లక్ష్యం వహిస్తే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో విశాఖ ఘటనతోపాటు గతంలో జరిగిన చెర్నోబిల్‌, ఫుకుషిమా స్పష్టం చేస్తున్నాయి. 

చెర్నోబిల్‌ ..
ఉక్రెయిన్‌లో ఉన్న చెర్నోబిల్‌ అణువిద్యుత్‌ కేంద్రంలో 1986లో జరిగిన ఘటన మానవ చరిత్రలో ఒక అత్యంత దుర్ఘటనగా నిలిచిపోయింది. నిర్వహణ వైఫల్యంతో అక్కడి అణువిద్యుత్‌ కర్మాగారంలో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. అక్కడ నుంచి వెలుబడుతున్న అణుధార్మికతతో కనీసం 2లక్షల మంది చనిపోయి ఉంటారని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేశారు. ఈ ఘటనపై అంతర్జాతీయంగా ఇప్పటికీ ఎన్నో పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. 1986 ఏప్రిల్‌ 26న జరిగిన ఈ ఘటనలో విద్యుత్‌ కేంద్రం భద్రతను పరిశీలించేందుకు ఇంజినీర్లు ప్రయోగం చేపట్టారు. అణువిద్యుత్‌ కేంద్రంలోని నాలుగవ రియాక్టరులో చేపట్టిన ఈ ప్రయోగంలో లోపం తలెత్తింది. దీంతో రియాక్టరులో మంటలు చెలరేగాయి. రియాక్టరులోని ఆవిరి ఒత్తిడికి మూత తొలగిపోయి దానిలోని ‘కోర్’ బయటకు రావడం ప్రారంభించింది. దీని నుంచి బయటకు వచ్చిన రేడియా ధార్మికత బయటి వాతావరణంపై ప్రభావం చూపడం ప్రారంభించింది. ఇది దాదాపు పది రోజులపాటు కొనసాగడంతో ఎంతో మంది ప్రజలు రేడియో ధార్మికత బారినపడ్డారు. అంతేకాదు, ఈ కేంద్రం నుంచి వెలుబడిన రేడియో ధార్మికత స్వల్ప కాలంలోనే కొన్ని వందల కిలోమీటర్లు వ్యాపించింది.

ప్రమాదకర స్థాయిలో వస్తున్న పొగను నియంత్రించేందుకు అత్యవసర సేవల సిబ్బంది రంగంలోకి దిగి వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఘటన జరిగన వెంటనే దాని చుట్టుపక్కల 10కి.మీ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని నిషేధిత జోన్‌గా ప్రకటించారు. అనంతరం తీవ్రత దృష్ట్యా అణువిద్యుత్‌ కేంద్రం చుట్టూ ఉన్న 30 కిలోమీటర్ల ప్రాంతాన్ని నిషేధిత ప్రాంతంగా ప్రకటించి దాదాపు లక్ష మందిని సుదూర ప్రాంతాలకు తరలించారు. దీంతో దీనికి సమీపంలో ఉన్న ప్రిప్‌యత్‌ నగరం మొత్తాన్ని మూసివేశారు. ఈసమయంలో ప్రజలను అక్కడినుంచి ఖాళీ చేయాలని అధికారులు సూచించారు. దీనికి కొన్ని గంటలు మాత్రమే సమయం ఇవ్వడంతో చాలామంది ప్రజలు తమ వస్తువులను అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అంతేకాకుండా సంవత్సరాలపాటు ఆ ప్రాంతంపై నిషేధం ఉండడంతో చాలా మంది కొత్త ప్రాంతంలో నూతన జీవనం ప్రారంభించారు. ఇలా వెళ్లిన వారిలో ఎక్కువగా మానసిక ఆరోగ్యం దెబ్బతిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ నివేదికలో పేర్కొంది. ఇప్పటికీ అక్కడ మానవ జీవనానికి అనువైన వాతావరణం లేదు.

ఫుకుషిమా.

చెర్నోబిల్‌ అనంతరం అత్యంత భారీ విపత్తుగా ఫుకుషిమా అణువిద్యుత్‌ కేంద్రం ప్రమాదం నమోదైంది. జపాన్‌లో 2011లో సంభవించిన సునామి కారణంగా ఈ దుర్ఘటన జరిగింది. భారీ సునామితో ఫుకుషిమా అణువిద్యుత్‌ కేంద్రం పూర్తిగా ధ్వంసమైంది. భూకంపం ధాటికి రియాక్టర్లలో విద్యుత్ సరఫరా దెబ్బతింది. అంతేకాకుండా బలమైన సునామీ అలల ధాటికి విద్యుత్‌ కేంద్రం లోని చాలా రియాక్టర్లు దెబ్బతిన్నాయి. దీంతో ఆ విద్యుత్‌ కేంద్రంలో దెబ్బతిన్న రియాక్టర్ల నుంచి రేడియో అణుధార్మికత వెలబడటం ప్రారంభమైంది. అప్రమత్తమైన అధికారులు విద్యుత్‌ కేంద్రం చుట్టూ 20కి.మీ వరకూ ఉన్న దాదాపు లక్షన్నర మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని సూచించారు. ఈ ఘటనతో అక్కడి వాతావరణంతోపాటు చుట్టుపక్కల నీరు కూడా కలుషితమైంది. అంతేకాకుండా అక్కడి ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఈ దుర్ఘటన జరిగిన అనంతరం పుట్టిన పిల్లల్లో జన్యులోపాలతో పాటు ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. కలుషితమైన ఈ అణువిద్యుత్‌ కేంద్రాన్ని పూర్తిగా శుద్ధిచేయడానికి దాదాపు 30 సంవత్సరాలు పట్టే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేసారు.

భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటన
దేశంలో సంభవించిన అతిపెద్ద ప్రమాద ఘటనల్లో భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటన ఒకటి. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో 1984 డిసెంబర్‌ 2వ తేదీ రాత్రి ఈ ఘటన జరిగింది. ఇక్కడి యూనియన్‌ కార్బైడ్‌ ఇండియా లిమిటెడ్‌ (యూసీఐఎల్‌) పురుగుమందుల ప్లాంట్‌లో మిథైల్‌ ఐసోసైనేట్‌ గ్యాస్‌ లీక్‌ అయ్యింది. దీంతో ఆ వాయువు పీల్చిన సుమారు 3,787 మంది మరణించారని మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం పేర్కొంది. మొత్తంగా సుమారు 5.50 లక్షల మంది ఈ గ్యాస్‌ ప్రభావానికి గురైనట్లు 2006లో ప్రభుత్వం తన అఫిడవిట్‌లో పేర్కొంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని