Covishield: ఎడం పెరిగినా పొరపాటు లేదోయ్‌!

తాజా వార్తలు

Updated : 19/05/2021 11:39 IST

Covishield: ఎడం పెరిగినా పొరపాటు లేదోయ్‌!

ఆరు నెలల లోపు రెండో విడత టీకా పొందొచ్చు 
కొవిషీల్డ్‌పై నిపుణుల విశ్లేషణ 


దిల్లీ: ‘కొవిషీల్డ్‌’ టీకా రెండు డోసుల మధ్య విరామాన్ని భారత ప్రభుత్వం క్రమంగా పెంచుకుంటూ వెళుతోంది. అందుకు భిన్నంగా బ్రిటన్‌ సర్కారు దీన్ని తగ్గిస్తోంది. దీంతో ఈ అంశంపై ప్రజల్లో గందరగోళం తలెత్తుతోంది. అయితే దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరమేమీ లేదని నిపుణులు చెబుతున్నారు. రెండో డోసును ఆరు నెలలలోపు తీసుకున్నా.. అది సమర్థంగానే పనిచేస్తుందని భరోసా ఇస్తున్నారు. 
కొవిషీల్డ్‌ టీకా డోసుల మధ్య విరామాన్ని 12-16 వారాలకు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పొడిగించింది. ఇదేసమయంలో బ్రిటన్‌ ప్రభుత్వం దీన్ని 12 వారాల నుంచి 8 వారాలకు తగ్గించింది. భారత్‌ నుంచి వచ్చిన ‘బి.1.617’ రకం కరోనా వైరస్‌ తమ దేశంలో ఉద్ధృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. టీకా డోసుల మధ్య విరామాన్ని భారత్‌లో పెంచడంపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దిల్లీలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇమ్యునాలజీ శాస్త్రవేత్త సత్యజిత్‌ రథ్‌ దీనిపై స్పందించారు.

‘‘మొదటి డోసు పొందిన నాలుగు వారాల తర్వాత నుంచి ఎప్పుడైనా రెండో డోసును ఇవ్వవచ్చు. ఆరు నెలలలోపు ఇస్తే సరిపోతుంది. అయినా దాని బూస్టర్‌ సామర్థ్యంలో తేడా ఉండదు. అద్భుతంగా రోగ నిరోధక స్పందనను పెంచుతుంది. మరోవైపు మొదటి డోసు పొందిన నెలలోపు రెండో డోసును పొందినా.. టీకా రక్షణ సామర్థ్యమేమీ పెరగబోదు’’ అని తెలిపారు. జాతీయ సాంకేతిక సలహా బృందం (ఎన్‌టీఏజీఐ) ఈ సూచన చేసిందన్నారు. క్షేత్రస్థాయి వాస్తవాల ఆధారంగా బ్రిటన్‌ ప్రభుత్వం ఈ విరామాన్ని తగ్గించిందని పుణెలోని ‘ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌’లో ఇమ్యునాలజీ నిపుణురాలు వినీతా బాల్‌ పేర్కొన్నారు. దీనివల్ల కరోనాలో కొత్త రకాన్ని సమర్థంగా ఎదుర్కోవడం సాధ్యమేనా అన్నది ఇతమిత్థంగా తేల్చలేమన్నారు. సరిపడా డోసులు అందుబాటులో ఉంటే రెండో విడత టీకాలో ఎక్కువ జాప్యం చేయకపోవడమే మేలని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో దీనివల్ల రోగనిరోధక సామర్థ్యం పెరుగుతుందన్నారు. టీకాతో వెలువడే రోగనిరోధక ప్రతిస్పందన.. కాలం గడిచేకొద్దీ తగ్గుతుందని ఆమె అంగీకరించారు. అయితే 12-16 వారాల సమయంలో అది కనిష్ఠ స్థాయికి పడిపోదని, అందువల్ల అంత విరామం తర్వాత కూడా బూస్టర్‌ సామర్థ్యాన్ని పొందొచ్చన్నారు. కొవిషీల్డ్‌ రెండో డోసును.. మొదటి టీకా పొందిన మూడు నెలల తర్వాత ఇస్తే సమర్థంగా పనిచేస్తుందని ప్రముఖ వైద్య పత్రిక ‘లాన్సెట్‌’లో ప్రచురితమైన అధ్యయనం పేర్కొంది.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని