Nipah virus: నిపా.. వ్యాప్తిని అడ్డుకోవడమే ఏకైక మార్గం..!

తాజా వార్తలు

Updated : 07/09/2021 14:55 IST

Nipah virus: నిపా.. వ్యాప్తిని అడ్డుకోవడమే ఏకైక మార్గం..!

కేరళకు మరో కష్టం..

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

కేరళ ప్రభుత్వ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లైంది.  ఏకకాలంలో రెండు వైరస్‌లతో పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా వైరస్‌ భీకరంగా వ్యాపిస్తుండగా.. తాజాగా నిపా వైరస్‌ కేసులు బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. ఈ రెండు వైరస్‌లు గబ్బిలాల నుంచి వచ్చినవే. కానీ.. వీటి లక్షణాలు, రోగి ఆరోగ్య సమస్యలు భిన్నంగా ఉంటాయి.

జంతువుల నుంచి మనుషులకు..

నిపా వైరస్‌ జంతువుల నుంచి నేరుగా మనుషులకు సోకుతుందని తేలింది. దీనిని జునోటిక్‌ వ్యాధి అంటారు. ఇక కరోనా పుట్టుపూర్వోత్తరాలు తేలలేదు. తొలిసారి నిపా వైరస్‌ను 1999లో గుర్తించారు. దీనికి మలేసియాలో ని సున్‌గాయ్‌ నిపా గ్రామం పేరును పెట్టారు. నిపా వైరస్‌ ఆతిథ్య జీవుల జాబితాలో పందులు, ఫ్రూట్‌ బ్యాట్‌ అనే  గబ్బిలాలు,కుక్కలు, మేకలు, గొర్రెలు, పిల్లులు, గుర్రాలు ఉన్నాయి. ముఖ్యంగా ఫ్రూట్‌ బ్యాట్స్‌లో ఇవి సహజంగానే ఉంటాయి. వాటిపై ఎటువంటి ప్రభావం చూపించలేవు.

వైద్యం లేదు..

నిపా వైరస్‌కు వైద్యం లేదు. ఇప్పటి వరకు అనుమతి పొందిన ఏ ఔషధం అందుబాటులోకి రాలేదు. రోగిని వేరుగా ఉంచుతున్నారు. తగినంత నీరు అందిస్తున్నారు. దీంతోపాటు రోగి లక్షణాలకు మాత్రమే చికిత్స చేస్తున్నారు. మోనోక్లోనల్‌ యాంటీ బాడీస్‌ చికిత్స విధానం వినియోగించడంపై పరిశీలిస్తున్నారు. నిపాపై వాడేందుకు పలు యాంటీవైరల్‌ డ్రగ్స్‌ను సీఈపీఐ ప్రయోగాత్మకంగా పరీక్షించింది. కానీ, అవి జంతువుల్లో మాత్రమే మంచి ఫలితాలను చూపించాయి.

పరస్పరం వ్యతిరేకం..

కొవిడ్‌తో పోలిస్తే నిపా వైరస్‌ అత్యంత ప్రమాదకరమైంది. కాకపోతే ఇది వేగంగా వ్యాపించకపోవడం ఒక్కటే ఊరటనిచ్చే అంశం. గ్లోబల్‌ వైరస్‌ నెట్‌వర్క్‌ ప్రకారం నిపా వైరస్‌ ఆర్‌నాట్‌ 0.43. అంటే 100 మంది నిపా వైరస్‌ బాధితుల నుంచి కేవలం మరో 43 మందికే  వ్యాధి వ్యాపిస్తుందన్నమాట. కాని వ్యాధి సోకిన వారిలో 45శాతం నుంచి 70శాతం మంది మరణిస్తున్నారు. కేరళలో 19 మందికి వైరస్‌ సోకితే 17 మంది మరణించారు.

ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్‌ ఆర్‌నాట్‌ తరచూ 1కిపై గా నమోదవుతోంది. అంటే నిపాతో పోలిస్తే ఇది వేగంగా వ్యాపిస్తోందన్నమాట. చాలా మంది స్వల్ప లక్షణాలతో బయటపడుతున్నారు. మరణాల రేటు కూడా 1శాతం కంటే తక్కువగా ఉంటోంది.

టీకాల పరిస్థితి ఏమిటీ..?

1999లో వెలుగులోకి వచ్చిన నిపా వైరస్‌కు ఇప్పటి వరకు ఎటువంటి ఔషధం లేదు. అంతేకాదు టీకాను తయారు చేయలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ టీకా తయారీ ప్రాధ్యాన్యాల బ్లూప్రింట్‌లో నిపా వైరస్‌ కూడా ఉంది. నిపా వ్యాప్తి కేవలం స్థానికంగా పరిమితం కావడంతో దీని టీకాలపై పెద్దగా దృష్టిపెట్టలేదు.

పలు దేశాల్లో ఈ వైరస్‌ జాడలు..

నిపా వైరస్‌ను ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో కనుగొన్నారు. ఇప్పటికే మలేసియా, భారత్‌, సింగపూర్‌, బంగ్లాదేశ్‌ల్లో మనుషులకు సోకింది. అదే సమయంలో కాంబోడియా, ఇండోనేసియా, మడగాస్కర్‌, థాయ్‌లాండ్‌, తిమోర్‌ వంటి దేశాల్లోని గబ్బిలాల్లో ఈ వైరస్‌ జాడ బయటపడింది. భారత్‌లోని సిలుగురిలో 2001 జనవరి-ఫిబ్రవరి మధ్య 66 నిపా కేసులు నమోదయ్యాయి. వ్యాధి సోకిన ప్రతి నలుగురిలో ముగ్గురు మరణించారు.

లక్షణాలు..

నిపా వైరస్‌లో రోగి ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఏర్పడుతుంది. కొందరిలో లక్షణాలు కనిపించకుండా  అసిమ్టమాటిక్‌గా ఉంటుంది. మరికొందరిలో మాత్రం తీవ్ర శ్వాస ఇబ్బందులు, మెదడుకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. తొలుత జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, వాంతులు, గొంతు బొంగురుపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. ఆ తర్వాత రోగి పరధ్యానంగా ఉండటం, మత్తుగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మెదడు దెబ్బతినడం, వణికిపోవడం, నిమోనియా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఇలా రోగి 24 గంటల నుంచి 48 గంటల్లో కోమాలోకి చేరుకుంటాడు.

రోగి నుంచి వెలువడే స్రావాల ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ముఖ్యంగా రక్తం, మూత్రం, ముక్కు, నోటి నుంచి వచ్చే స్రావాల్లో వైరస్‌ ఉంటుంది. 2018లో కేరళలో వచ్చిన కేసులు పెరంబ్ర తాలుకా ఆసుపత్రి, కోజికోడ్‌ మెడికల్‌ కాలేజీలోనే నమోదయ్యాయి. తొలి రోగికి ఇక్కడే చికిత్స చేశారు.

తాజాగా కోజికోడ్‌లో నిపా వ్యాపించడంతో అధికారులు వేగంగా స్పందించారు. ఆ ప్రాంతాన్ని పూర్తిగా మూసివేశారు. తీవ్రమైన ఆంక్షలను విధించారు. ఆ ప్రాంతంలోకి ఎవరూ వెళ్లకుండా పోలీసులను నియమించారు.

వ్యాధి నిర్ధారణ ఎలా..

నిపా వైరస్‌ను గుర్తించడానికి ఆర్టీపీసీఆర్‌ పరీక్షను నిర్వహిస్తారు. దీంతోపాటు పాలిమరైజ్‌ ఛైన్‌ రీయాక్షన్‌ పరీక్షలో కూడా కచ్చితమైన సమాచారం తెలుస్తుంది. ఈ పరీక్షలో అత్యంత సున్నితమైన మార్పులను గుర్తించే అవకాశం ఉంది. పీసీఆర్‌ పరీక్షకు ప్రాధాన్యమిస్తారు.

కాంటాక్ట్‌ ట్రేసింగ్‌.. క్వారంటైన్‌ తప్పదు..

నిపా వైరస్‌ విషయంలో కూడా కరోనా వలే కాంటాక్ట్‌ ట్రేసింగ్‌, క్వారంటైన్‌, ఐసోలేషన్‌ వంటి చర్యలు తీసుకొంటారు. 2018లో కేరళ ప్రభుత్వం సమర్థంగా నిపా వైరస్‌ను అరికట్టిన తీరును ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అభినందించింది. ఆరోగ్య వ్యవస్థ సమన్వయంతో పనిచేసి.. వేగంగా స్పందించడం వంటి చర్యలతో వైరస్‌ వ్యాప్తిని అడ్డుకొంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని