close

తాజా వార్తలు

Published : 23/01/2021 10:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘ట్రాక్టర్ల ర్యాలీలో మమ్మల్ని చంపేందుకు కుట్ర’

రైతు నేతల సంచలన ఆరోపణ

దిల్లీ: కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతు సంఘాల నేతలు శుక్రవారం రాత్రి సంచలన ఆరోపణలు చేశారు. జనవరి 26న నిర్వహించ తలపెట్టిన ట్రాక్టర్ల కవాతులో తమలో నలుగురిని చంపేందుకు కుట్ర జరుగుతున్నట్లు తెలిపారు. తద్వారా కవాతును భగ్నం చేసి ఆందోళనను అణదొక్కేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించారు. ఇందుకోసం రంగంలోకి దింపిన ఓ వ్యక్తిని తాము పట్టుకున్నట్లు తెలిపారు. ముఖానికి ముసుగు తొడిగిన అతణ్ని శుక్రవారం రాత్రి మీడియా ముందుకు తీసుకొచ్చారు. పోలీసు వలే నటించి కవాతులో రైతులపై లాఠీ చార్జి చేయాలని అతనికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.

మీడియా సమావేశం అనంతరం అతణ్ని హరియాణా పోలీసులకు అప్పగించినట్లు రైతు సంఘాల నాయకుల్లో ఒకరైన కుల్వంత్‌ సింగ్‌ సంధు తెలిపారు. ఈ కుట్రకు సంబంధించిన సమాచారాన్ని లీక్‌ చేస్తే కుటుంబసభ్యులను చంపేస్తామని దీన్ని అమలు చేయాల్సిన వ్యక్తులను బెదిరించినట్లు చెప్పారు. దీనిపై స్పందించిన దిల్లీ పోలీసులు.. తమకు ఎలాంటి ముసుగు తొడిగిన వ్యక్తి సమాచారం అందలేదని తెలిపారు. ఇప్పటి వరకు ఎవరూ ఫిర్యాదు కూడా చేయలేదని పేర్కొన్నారు.

రైతులు తాము పట్టుకున్నట్లుగా చెప్పిన ముసుగు తొడిగిన వ్యక్తి మీడియాతో మాట్లాడుతూ...‘‘జనవరి 26న రైతులు నిర్వహించ తలపెట్టిన ర్యాలీని అడ్డుకోవాలని నిర్ణయించకున్నాం. ఒకవేళ వారు ఆగకపోతే.. తొలుత గాల్లోకి కాల్పులు జరపాలనుకున్నాం. తర్వాత మా బృందంలోని మరికొంత మంది సభ్యులు వెనక నుంచి కాల్పులు జరుపుతారు. అక్కడ ఉన్న దిల్లీ పోలీసులు.. రైతులే కాల్పులు జరుపుతున్నారని భావించి ఎదురుకాల్పులు జరుపుతారు’’ అని చెప్పుకొచ్చాడు.

మరోవైపు కొత్త వ్యవసాయ చట్టాలపై కేంద్రం, రైతు సంఘాల మధ్య శుక్రవారం 11వ విడత చర్చలు ఎలాంటి ఫలితం లేకుండానే ముగిశాయి. చట్టాల అమలును రెండేళ్ల పాటు వాయిదా వేస్తామని కేంద్రం ప్రతిపాదించినట్లు తెలిసింది. కానీ, రైతులు మాత్రం చట్టాలను పూర్తిగా ఉపసంహరించాల్సిందేనని పట్టుబట్టారు. రద్దు డిమాండ్‌ను అంగీకరించేదిలేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ప్రభుత్వ వైఖరి సరిగాలేదని, తమ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని, 26న ట్రాక్టర్ల కవాతు నిర్వహిస్తామని సంయుక్త కిసాన్‌ మోర్చా ప్రకటించింది. మరోవైపు సాగు చట్టాలపై రైతులతో ఇక చర్చలు ముగిసినట్లేనని వ్యవసాయ మంత్రి తోమర్‌ తెలిపారు.

ఇవీ చదవండి...

కవాతు ఖాయం!

సాగు చట్టాలను రద్దు చేస్తే... సంస్కరణల అవకాశాన్ని కోల్పోతాం



Tags :

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని