Corona effect on private schools: ప్రైవేటు బడులపై కొవిడ్‌ దెబ్బ 

తాజా వార్తలు

Published : 26/07/2021 12:25 IST

Corona effect on private schools: ప్రైవేటు బడులపై కొవిడ్‌ దెబ్బ 

దిల్లీ: దేశవ్యాప్తంగా ప్రైవేటు స్కూళ్లపైన.. సంబంధిత టీచర్ల జీ(వి)తాలపైనా కొవిడ్‌ మహమ్మారి పెను ప్రభావమే చూపింది. సుదీర్ఘకాలం మూసివేయాల్సి రావడంతో చాలామేర ప్రైవేటు పాఠశాలల ఆదాయం 20-50 శాతం వరకు పడిపోయింది. ఇది ప్రైవేటు టీచర్లలో 55% మంది జీతాల్లో కోతకు దారితీసింది. ఈమేరకు భారత్‌లో నాణ్యమైన పాఠశాల విద్య కోసం పనిచేస్తున్న  ‘సెంట్రల్‌ స్క్వేర్‌ ఫౌండేషన్‌ (సీఎస్‌ఎఫ్‌)’ స్వచ్ఛంద సంస్థ తాజా నివేదికలో పలు అంశాలను వెల్లడించింది. దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 1,100 మంది తల్లిదండ్రులు, పాఠశాలల ప్రతినిధులు, టీచర్లతో ఈ సంస్థ అధ్యయనం జరిపింది.

నివేదికలోని ముఖ్యాంశాలివి..

ఈ విద్యా సంవత్సరంలో కొత్త అడ్మిషన్లు గణనీయంగా తగ్గిపోయినట్లు 55% స్కూళ్లు తెలిపాయి. తల్లిదండ్రులు కూడా ఫీజులు సక్రమంగా చెల్లించలేని స్థితిలో ఉండటం వల్ల చాలామేర పాఠశాలలు ఆదాయం కోల్పోయాయి. ఇలాంటివి పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయి.

> మైనారిటీయేతర ప్రైవేటు పాఠశాలలకు సంబంధించి చాలామేర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ‘ఆర్‌టీఈ’ రియంబర్స్‌మెంటు రావడంలో జాప్యం కారణంగా ఇబ్బందులు పడుతున్నాయి. ఈ స్కూళ్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేసిన విద్యార్థులకు 25% ‘ఆర్‌టీఈ’ కోటా కింద ఉచితంగా ప్రవేశాలు కల్పించాల్సి ఉంటుంది. ఇందుకుగాను ప్రభుత్వాలు నిర్దేశిత మొత్తాన్ని రీయంబర్స్‌ చేస్తుంటాయి.

ఆర్థిక అవసరాల కోసం రుణాలు తీసుకోవడానికి 77% పాఠశాలలు ఆసక్తి చూపించడం లేదు. 3% మాత్రమే బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల నుంచి రుణాలు తీసుకోగా.. మరో 5% అప్పుల కోసం నిరీక్షిస్తున్నాయి.

> ప్రైవేటు టీచర్లకు ఆయా స్కూళ్లు పాక్షికంగానే జీతాలిస్తున్నాయి. తక్కువ ఫీజులు వసూలు చేసే పాఠశాలలు 65% టీచర్ల జీతాలు నిలిపివేశాయి. అధిక ఫీజులు వసూలు చేసే పాఠశాలల్లో ఇది 37%గా ఉంది. 54% మంది టీచర్లకు ప్రత్యామ్నాయ ఆదాయ వనరులు లేకపోవడంతో అల్లాడిపోతున్నారు. 30% మంది ప్రైవేటు ట్యూషన్లు, కోచింగ్‌ల ద్వారా కొంత ఆదాయం పొందగలుగుతున్నారు. కొవిడ్‌ నుంచి తేరుకున్నాక పరిస్థితులు తిరిగి సాధారణ స్థితికి వస్తాయన్న ఆశాభావం 55% టీచర్లలో వ్యక్తమైంది.

> తల్లిదండ్రుల్లో 50% మంది మాత్రమే ఫీజులు చెల్లించగలుగుతున్నారు. టెక్నాలజీ, మౌలిక వసతుల కోసం ఖర్చులు పెరిగినట్లు 20% మంది తెలిపారు. విద్యా ఖర్చులు పెరిగినట్లు 15% మంది చెప్పారు. 78% మంది తమ పిల్లలను అవే స్కూళ్లలో కొనసాగించేందుకు ఆసక్తి చూపుతున్నారు. గత ఏడాది మార్చి నుంచి దేశవ్యాప్తంగా స్కూళ్లు తెరిచే పరిస్థితులు లేకపోవడంతో ఆన్‌లైన్‌ బోధనను ప్రారంభించిన సంగతి తెలిసిందే. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని