Parliament: కేంద్రంపై నిరసనగా.. ప్రతిపక్షాల ‘మాక్‌ పార్లమెంట్’!

తాజా వార్తలు

Published : 02/08/2021 14:59 IST

Parliament: కేంద్రంపై నిరసనగా.. ప్రతిపక్షాల ‘మాక్‌ పార్లమెంట్’!

రేపు భేటీ కానున్న విపక్ష నేతలు

దిల్లీ: పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలను పెగాసస్‌, సాగు చట్టాల అంశాలు కుదిపేస్తున్నాయి. ప్రతిపక్షాల ఆందోళనలతో, ప్రభుత్వం పట్టుదల నడుమ ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ విపక్షాలు ‘మాక్‌ పార్లమెంట్‌’ను నిర్వహించాలని భావిస్తున్నాయి. దీనిపై మంగళవారం నిర్ణయం తీసుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

రేపు ఉదయం 10 గంటలకు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ నేతృత్వంలో విపక్ష నేతలు భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ‘మాక్ పార్లమెంట్‌’పై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై విపక్షాల వాదనలు, అభిప్రాయాలను వినేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని, అందుకే సభల్లో చర్చలకు అంగీకరించట్లేదని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ‘పెగాసస్‌’ వ్యవహారం దేశ భద్రతకు సంబంధించిన అంశమని, దీనిపై కేంద్రం స్పష్టతనివ్వాలని డిమాండ్‌ చేస్తున్నాయి. 

జులై 19న పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే అందుకు ఒక్క రోజు ముందు పెగాసస్‌తో ఫోన్ల హ్యాకింగ్‌ వ్యవహారం వెలుగు చూసింది. పెగాసస్‌తో లక్ష్యంగా చేసుకున్న వారి జాబితాలో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ సహా పలువురు ప్రముఖులు ఉన్నట్లు తెలిసింది. దీంతో ఈ అంశంపై పార్లమెంట్‌లో చర్చ జరపాలని విపక్షాలు పట్టుబట్టాయి. సభలు ప్రారంభం కాగానే దీనిపై నిరసనలు చేపట్టడంతో ఉభయ సభలు సజావుగా సాగట్లేదు. అయితే సభలో ప్రశాంతత నెలకొంటే చర్చలకు సిద్ధమేనని కేంద్రం చెబుతోంది. ఇదిలా ఉండగా.. పార్లమెంట్‌లో ప్రతిపక్షాల ఆందోళనల కారణంగా సభా సమయం వృథా అవుతోందని, ఇప్పటికే రూ. 130కోట్లకు పైగా ప్రజల సొమ్ము వృథా అయ్యిందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని