Boris Johnson: బోరిస్‌ పెళ్లికొడుకాయెనే..

ప్రధానాంశాలు

Updated : 31/05/2021 08:14 IST

Boris Johnson: బోరిస్‌ పెళ్లికొడుకాయెనే..

నెచ్చెలిని మనువాడిన బ్రిటన్‌ ప్రధాని

లండన్‌: బ్రిటన్‌ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌(56) గడచిన శనివారం ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా తన నెచ్చెలి క్యారీ సిమండ్స్‌ (33)ను పెళ్లాడారు. ఓ చిన్న వేడుకగా ఈ కార్యక్రమం ముగిసినట్టు డౌనింగ్‌ స్ట్రీట్‌ కార్యాలయం ఆదివారం వెల్లడించింది. దేశంలో కరోనా వైరస్‌ ఆంక్షలు ఉన్నందున 30 మందికి మించకుండా పరిమిత సంఖ్యలో స్నేహితులు, కుటుంబసభ్యులు హాజరయ్యారు. రోమన్‌ కేథలిక్‌ వెస్ట్‌మినిస్టర్‌ కేథడ్రల్‌లో ఈ పెళ్లి జరిగినట్టు ప్రధానమంత్రి కార్యాలయం ధ్రువీకరించింది. వచ్చే ఏడాది వేసవిలో బంధుమిత్రుల నడుమ వివాహ వేడుకలు చేసుకోనున్నట్లు కొత్త దంపతులు వెల్లడించారు. కన్జర్వేటివ్‌ పార్టీలో చురుగ్గా పనిచేస్తున్న క్యారీ సిమండ్స్‌ను తాను పెళ్లాడనున్నట్లు గతేడాది ఫిబ్రవరిలోనే బోరిస్‌ ప్రకటించారు. వీరి సహజీవనానికి గుర్తుగా ఆ తర్వాత కుమారుడు విల్‌ఫ్రెడ్‌ (1) జన్మించాడు. సిమండ్స్‌కు ఇది తొలి వివాహం కాగా, బోరిస్‌ జాన్సన్‌కు మూడో పెళ్లి. గత వివాహబంధాల కారణంగా ఆయనకు అయిదుగురు పిల్లలు ఉన్నారు. గతంలో దాదాపు 200 ఏళ్ల కిందట 1822లో అప్పటి ప్రధాని రాబర్ట్‌ బ్యాంక్స్‌ జెన్‌కిన్సన్‌ పదవిలో ఉండగా పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత జరిగిన అలాంటి వివాహం ఇదే.

రాజకీయ విమర్శలకు ‘శుభం’ కార్డు
బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ గత వారమంతా రాజకీయంగా పలు విమర్శలు ఎదుర్కొన్నారు. కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో ప్రభుత్వ స్పందన సరిగా లేదంటూ ప్రధానికి మాజీ ముఖ్య సహచరుడైన డొమినిక్‌ కమింగ్స్‌ తప్పుబట్టారు. ప్రధాని పనితీరు హోదాకు తగ్గట్టుగా లేదని విమర్శించారు. డౌనింగ్‌ స్ట్రీట్‌లోని బోరిస్‌ జాన్సన్‌ నివాస భవనం పునరుద్ధరణ పనుల్లో నిధుల ఖర్చుపైనా ఆరోపణలు వచ్చాయి. వీటన్నిటిపై ప్రతిపక్షమైన లేబర్‌ పార్టీ సభ్యుడు జాన్‌ ట్రికెట్‌ మాట్లాడుతూ.. ‘ప్రధానిపై వచ్చిన ఆరోపణలను పెళ్లిసందడితో సమాధి చేశారు’ అని వ్యాఖ్యానించారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన