కరోనా వేళ యాత్రలా!

ప్రధానాంశాలు

Published : 15/07/2021 04:56 IST

కరోనా వేళ యాత్రలా!

యూపీ ప్రభుత్వంపై ‘సుప్రీం’ ఆగ్రహం 

కేంద్రానికీ నోటీసులు

దిల్లీ: కొవిడ్‌-19 మహమ్మారి సమయంలో కాంవడ్‌ యాత్రకు ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఒకవైపు మూడో ఉద్ధృతి ముప్పు నివారించడానికి అన్ని ప్రయత్నాలు చేయాలని కేంద్రం చెబుతుంటే.. అందుకు వ్యతిరేక పంథాను రాష్ట్రం అవలంబించడాన్ని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లో జరిగే కాంవడ్‌ యాత్రలో ప్రతి ఏటా కోట్లాది మంది భక్తులు పాల్గొంటారు. ఈ యాత్రలో భక్తులు హరిద్వార్‌, గంగోత్రి లాంటి పవిత్ర ప్రదేశాల సమీపంలోని గంగా నదిలోని జలాలను సేకరించి, ఆ నీళ్లతో స్థానిక శివాలయాల్లో అభిషేకం చేస్తారు. ఈ జలాల కోసం కోట్లాది మంది భక్తులు గంగా నది తీరానికి చేరుకుంటారు. ఈసారి యాత్ర ఈ నెల 25న ప్రారంభం కానుంది. ఆగస్టు తొలి వారం వరకు కొనసాగుతుంది. అయితే కరోనాను దృష్టిలో ఉంచుకొని ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం కాంవడ్‌ యాత్రను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఉత్తర్‌ప్రదేశ్‌ మాత్రం పరిమిత ఆంక్షలతో అనుమతులిచ్చింది. ఈ అంశంపై వార్తాపత్రికలో వచ్చిన కథనాన్ని న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎఫ్‌.నారిమన్‌ నేతృత్వంలోని ధర్మాసనం సుమోటోగా స్వీకరించింది. అనుమతులు మంజూరు చేసిన ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వంతో పాటు.. కేంద్రానికీ నోటీసులు జారీ చేసింది. ఆదమరిస్తే మూడో ముప్పు అని ప్రధాని హెచ్చరిస్తున్న సమయంలో.. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఏమేరకు సమంజసమని వ్యాఖ్యానించింది. భిన్నమైన రాజకీయ స్వరాల వల్ల ప్రజల్లో అయోమయం నెలకొనే అవకాశం ఉందని న్యాయస్థానం అభిప్రాయపడింది. దీనిపై శుక్రవారంలోగా కేంద్రం, యూపీ ప్రభుత్వంతో పాటు యాత్రను రద్దు చేసిన ఉత్తరాఖండ్‌ కూడా స్పందించాలని పేర్కొంది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన