సింధును అభినందించిన పార్లమెంటు

ప్రధానాంశాలు

Published : 03/08/2021 05:22 IST

సింధును అభినందించిన పార్లమెంటు

దిల్లీ: ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన బ్యాడ్మింటన్‌ తార పి.వి.సింధును పార్లమెంటు సోమవారం అభినందించింది. వరుసగా రెండు ఒలింపిక్స్‌ పోటీల్లో పతకాలు సాధించిన తొలి భారతీయ మహిళగా ఆమె తన పేరును చరిత్రలో సుస్థిరం చేసుకుందని ఉభయ సభలు కొనియాడాయి. రాజ్యసభ సమావేశం మొదలు కాగానే ఛైర్మన్‌ ఎం.వెంకయ్యనాయుడు సభ తరఫున, వ్యక్తిగతంగా కూడా సింధుకు అభినందనలు తెలిపారు. ఆమె పేరును ప్రస్తావించిన ప్రతిసారీ ఎంపీలు బల్లలు చరిచి హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. ‘‘తన అద్భుతమైన ప్రదర్శనతో సింధు.. చరిత్రను లిఖించింది. అంతర్జాతీయ వేదికలపై మన క్రీడాకారుల నుంచి ఆశిస్తున్నదానికి తగ్గట్టుగా ఆమె పోరాడింది. క్రీడాకారుల కుటుంబంలో జన్మించిన ఆమె తన 12వ ఏటనే బ్యాడ్మింటన్‌లో ప్రవేశించింది. శిక్షణ నిమిత్తం రోజూ 120 కి.మీ. ప్రయాణించేది. వ్యక్తిగతంగానూ ఆమె నాకు తెలుసు. తాను ఎంచుకున్న రంగంలో రాణించడానికి ఆమె ఎంత శ్రమిస్తుందో, నిరంతరం ఎంత చిత్తశుద్ధితో తపన పడుతుందో నేను కళ్లారా చూశాను. ఆమె విజయంలో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల పాత్రను కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఆమె మరిన్ని విజయాలు సాధించి, దేశానికి మంచిపేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. సింధు విజయాన్ని లోక్‌సభ తరఫున స్పీకర్‌ ఓంబిర్లా కొనియాడారు. ఆమె చరిత్రాత్మక విజయం దేశ యువతకు స్ఫూర్తిదాయకమన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన