సరిహద్దు వెంబడి చైనా గ్రామాలు

ప్రధానాంశాలు

Published : 29/09/2021 06:21 IST

సరిహద్దు వెంబడి చైనా గ్రామాలు

2.4లక్షల మందితో నిఘా!

భూములపైనా పట్టుకు యత్నం

దిల్లీ: భారత సరిహద్దుల వెంబడి చైనా 2017 చేపట్టిన 628 ఆధునిక గ్రామాల నిర్మాణం దాదాపు పూర్తి అయ్యింది. దీనిపై రేపో, మాపో చైనా అధికారిక ప్రకటన చేసే అవకాశముంది. సరిహద్దు వెంబడి జనాభాను పెంచుకునేందుకు డ్రాగన్‌ ఈ ఎత్తుగడ వేసినట్టు నిపుణులు భావిస్తున్నారు.

ఆధునిక ప్రపంచానికి ప్రాచీన జ్ఞానాన్ని అనుసంధానించే అలవాటు చైనాకు ఉంది. ఇదే బాటలో నడుస్తూ 6వ శతాబ్దం నాటి ‘జియాకాంగ్‌’ సమాజాల నిర్మాణం చేపట్టింది. జియాకాంగ్‌ అంటే.. సుసంపన్న ప్రాంతంలో ప్రజలు ఎలాంటి కష్టాలు లేకుండా ఆనందంగా జీవించడం. అయితే ఇవి భారత సరిహద్దులకు అత్యంత సమీపంలో ఉండటం గమనార్హం. సరిహద్దు వెంబడి తమ జనాభాను పెంచుకుని, అక్కడి భూములపై పట్టు సాధించేందుకు వీటిని చైనా ఉపయోగించుకునే అవకాశం లేకపోలేదు.

చైనా-భారత్‌ మధ్య 3,500 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఇక్కడి అనేక ప్రాంతాల్లో జీవించడం కూడా కష్టమే! అలాంటిది ఇక్కడ చైనా ‘జియాకాంగ్‌’ ప్రణాళికను అమలు చేసింది. సాధారణంగా ఎత్తైన పర్వత ప్రాంతాల్లో ప్రజలు ఉండటం కష్టం. అక్కడ జీవనోపాధి అవకాశాలూ తక్కువే. అందుకే అనేకమంది ఆయా ప్రాంతాలను వీడి బయటకు వస్తున్నారు. దీంతో జనాభా పడిపోతోంది. లద్దాఖ్‌ నుంచి అరుణాచల్‌ప్రదేశ్‌ వరకు దాదాపుగా ఇదే పరిస్థితి. అందుకే 2017లో ‘జియాకాంగ్‌ గ్రామాల’ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ప్రణాళిక ప్రకారం.. 21 కౌంటీల్లో 628 గ్రామాలు నిర్మిస్తారు. వాటిలో 62,160 ఇళ్లు ఉంటాయి. 2,41,835 మంది వీటిల్లో నివాసముంటారు. లద్దాఖ్‌ నుంచి నింగ్‌ఛి వెంబడి ఉన్న టిబెట్‌ సరిహద్దు, అరుణాచల్‌-మయన్మార్‌ వెంబడి ఉన్న మెచుకాలో ఈ గ్రామాలు ఉంటాయి. గతేడాది వరకు 604 గ్రామాల నిర్మాణం పూర్తయింది. ఇందుకోసం 4.6 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేశారు. మిగిలినవి ఈ ఏడాదే పూర్తవుతాయని అంచనా. భారత్‌ కూడా సరిహద్దు అభివృద్ధి పనులను మొదలుపెట్టినా.. అవి ‘డ్రాగన్‌’ స్థాయిలో ముందుకు సాగడం లేదు.

భారీ ప్రాజెక్టే.. లాభమెంత?

గత ఏడాది.. లద్దాఖ్‌లో భారత్‌-చైనాలు దాదాపు యుద్ధం అంచుల వరకూ వెళ్లాయి. ఆ ప్రాంతంలో జనాభా పెంచుకుంటే చైనా పట్టు సాధించే అవకాశముంది. అరుణాచల్‌ ప్రదేశ్‌పైనా చైనా కన్నేసింది. భవిష్యత్తులో అక్కడ సరిహద్దు వివాదం చేలరేగే అవకాశాలను కొట్టిపారేయలేం. టిబెట్‌ సరిహద్దుల్లో గ్రామాలు నిర్మిస్తుండటం వెనుక మరో వ్యూహం కూడా ఉన్నట్టు కనిపిస్తోంది. గ్రామాల్లోని ప్రజలు.. దలైలామా కార్యకలాపాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించవచ్చు. ఆ సమాచారాన్ని చైనాకు చేరవేయవచ్చు. అయితే వీటిని చైనా కొట్టిపారేస్తోంది. భారత్‌, టిబెట్‌పై నిఘా పెట్టేందుకు తాము గ్రామాలను ఏర్పాటు చేయడం లేదని.. భారత్‌లో అంతర్గత కలహాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు సరిహద్దు అంశాన్ని పదేపదే లేవనెత్తుతున్నారని చైనా అధికార మీడియా ‘గ్లోబల్‌ టైమ్స్‌’ కథనం ప్రచురించింది.

ఉత్తరాఖండ్‌లో చైనా సైనికుల అతిక్రమణ

గత నెల 30న దాదాపు వంద మంది చైనా సైనికులు ఉత్తరాఖండ్‌లోని బారాహొటి ప్రాంతంలోకి చొరబడినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వారు ఓ వంతెన ధ్వంసం చేశారు. కొద్దిగంటల పాటు అక్కడే ఉండి, వెనుదిరిగారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ప్రాంతంలో ఇండో-టిబెటన్‌ సరిహద్దు పోలీసు (ఐటీబీపీ) బలగాలు మోహరించి ఉన్నాయి. చైనా సైనికుల చర్యకు ప్రతిగా భారత బలగాలు కూడా  గస్తీ నిర్వహించాయి. గతంలో ఇక్కడ స్వల్పస్థాయిలో అతిక్రమణలు జరిగాయి. అయితే వంద మంది సైనికులు చొరబడటం భారత అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన