ఎల్‌ఎఫ్‌టీతో కొవిడ్‌ వ్యాప్తికి అడ్డుకట్ట

ప్రధానాంశాలు

Published : 15/10/2021 04:53 IST

ఎల్‌ఎఫ్‌టీతో కొవిడ్‌ వ్యాప్తికి అడ్డుకట్ట

లండన్‌: బ్రిటన్‌లో పాఠశాలలు, పని ప్రదేశాల్లో కొవిడ్‌-19 వ్యాప్తిని అడ్డుకోవడానికి  ఉపయోగిస్తున్న ‘లేటరల్‌ ఫ్లో టెస్ట్‌’ (ఎల్‌ఎఫ్‌టీ) గతంలో అంచనావేసిన దానికన్నా మరింత కచ్చితమైందని శాస్త్రవేత్తలు తేల్చారు. దీన్ని ప్రామాణిక ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షతో పోల్చలేమన్నారు. యూనివర్సిటీ కాలేజీ ఆఫ్‌ లండన్‌ (యూసీఎల్‌) శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ ఏ దశలో ఉన్నా.. దాన్ని గుర్తించడంలో ఎల్‌ఎఫ్‌టీ విధానం 80 శాతానికిపైగా సమర్థత చాటినట్లు వారు పేర్కొన్నారు. వైరల్‌ లోడు అధికంగా ఉన్నవారిని పసిగట్టడంలో ఇది 90 శాతానికి పైగా సత్తాను కలిగి ఉందని చెప్పారు. మునుపటి అధ్యయనాల్లో తేలిన దాని కన్నా దీని కచ్చితత్వం చాలా ఎక్కువగా ఉందని వివరించారు. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడానికి దీన్ని విశ్వసనీయ సాధనంగా ఉపయోగించొచ్చని తెలిపారు. గతంలో నిర్వహించిన అధ్యయనాల్లో ఎల్‌ఎఫ్‌టీ విశ్వసనీయతను పీసీఆర్‌ పరీక్షతో పోల్చి చూశారని పరిశోధకులు చెప్పారు. అది సరైన విధానం కాదన్నారు. అందువల్లే ఎల్‌ఎఫ్‌టీ పరీక్ష సమర్థత తక్కువగా నమోదైందని చెప్పారు. ‘‘ఈ విధానం.. వైరస్‌ ఉపరితల ప్రొటీన్లకు సంబంధించిన పదార్థాలను గుర్తిస్తుంది. ఒక వ్యక్తి నుంచి వైరస్‌ వ్యాప్తి జరుగుతున్నప్పుడు ఇది ‘పాజిటివ్‌’ ఫలితాన్ని ఇస్తుంది. ఇందుకు భిన్నంగా పీసీఆర్‌ పరీక్ష.. వైరస్‌లోని జన్యు పదార్థాన్ని పసిగడుతుంది. అయితే బాధితుడి నుంచి వైరస్‌ వ్యాప్తి జరగని సమయంలోనూ ఈ పదార్థం ఉంటుంది’’ అని వివరించారు. ఈ రెండు పరీక్ష విధానాలు పూర్తిగా భిన్నమైనవని, వాటిని పరస్పరం పోల్చి చూడకూడదన్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన