ఆర్యన్‌ఖాన్‌కు బెయిల్‌ ఇవ్వలేం

ప్రధానాంశాలు

Updated : 21/10/2021 10:21 IST

ఆర్యన్‌ఖాన్‌కు బెయిల్‌ ఇవ్వలేం

డ్రగ్స్‌ కార్యకలాపాల్లో ఉన్నట్లు   కనిపిస్తున్నాడన్న కోర్టు

బాంబే హైకోర్టును ఆశ్రయించిన షారుఖ్‌ తనయుడు

ముంబయి: బాలీవుడ్‌ ప్రముఖుడు షారుఖ్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌కు ప్రత్యేక న్యాయస్థానంలోనూ బెయిల్‌ లభించలేదు. ప్రాథమికంగా చూస్తే నిందితుడు తరచూ మాదక ద్రవ్యాల అక్రమ కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లుగానే కనిపిస్తోందని కోర్టు వ్యాఖ్యానించింది. నిషిద్ధ మాదక ద్రవ్యాలను చేరవేసేవారితో అతను టచ్‌లో ఉన్నట్లుగా వాట్సాప్‌ సంభాషణలను బట్టి తెలుస్తోందని ‘మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల’ (ఎన్‌డీపీఎస్‌) కేసుల విచారణకు ఉద్దేశించిన న్యాయస్థాన ప్రత్యేక న్యాయమూర్తి వి.వి.పాటిల్‌ బుధవారం పేర్కొన్నారు. ‘‘..బెయిల్‌పై విడుదలైతే ఇలాంటి మరో నేరం చేయడని చెప్పలేం. అందువల్ల ఆర్యన్‌తో పాటు అతని స్నేహితుడు అర్బాజ్‌ మర్చంట్‌, ఫ్యాషన్‌ మోడల్‌ మున్మున్‌ ధమేచాలకూ బెయిల్‌ ఇవ్వడం లేదు. అర్బాజ్‌ వద్ద డ్రగ్స్‌ ఉన్న విషయం ఆర్యన్‌కు తెలుసు. ఎన్‌సీబీ అధికారుల సోదాల్లో ఆర్యన్‌ వద్ద డ్రగ్స్‌ ఏమీ లభ్యం కాకపోయినా దానితో అతనికి ప్రమేయం ఉన్నట్లే. నేరాభియోగాల తీవ్రతను, ప్రాథమికంగా నిందితుల ప్రమేయాన్ని చూశాక బెయిల్‌ను తిరస్కరిస్తున్నాం’’ అని ప్రకటించారు. ఇదివరకు మెజిస్ట్రేట్‌ న్యాయస్థానం కూడా ఆర్యన్‌కు బెయిల్‌కు నిరాకరించి, దానిపై ప్రత్యేక న్యాయస్థానమే నిర్ణయం తీసుకోవాలని చెప్పిన విషయం తెలిసిందే. ప్రత్యేక కోర్టు తీర్పు వెలువడగానే నిందితుల తరఫున న్యాయవాదులు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఈ అంశం గురువారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.
Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన