close

తాజా వార్తలు

Updated : 14/02/2019 04:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్రేమ...ఎంత మధురం?

ప్రేమ... లౌకికమా? అలౌకికమా? 
క్షణికమా? శాశ్వతమా?
నిజమైన ప్రేమకు నిదర్శనాలేంటి? 
హద్దులు లేని ఆ అమృత భావనను ఎలా దర్శించాలి?

నిజమైన ప్రేమ శారీరక వాంఛలకు, కోరికలకు భిన్నమైంది. దాని కోసం మనుషులు ఉదాత్త చరితులుగా మారతారు. త్యాగజీవులుగా మిగులుతారు.  ప్రేమలో ఉన్నప్పుడు మనసంతా వసంతరుతువులా ఉంటుంది. ఫలితంగా కనిపిస్తున్నదంతా ప్రేమతో చూడడం అలవాటవుతుంది. ఇది ఆధ్యాత్మికతలో ఓ అత్యున్నత స్థితి. యోగికమైన దృక్పథమది. తనకు అపకారం చేసిన వారికి కూడా ఉపకారం చేసే హృదయ వైశాల్యాన్ని ప్రేమ మనిషికి ఇస్తుంది. ద్వేషాన్ని, కసిని, పశుతత్వాన్ని మనిషి నుంచి తొలగించే దివ్యౌషధం ప్రేమ. ఈ ప్రేమ ప్రియురాలికో, ప్రియుడికో పరిమితం కాదు. అది ఆధ్యాత్మికతలోకి పర్యవసించినప్పుడు ఈ ప్రపంచం అంతటిపై మమకారం వ్యక్తమవుతుంది. దానికి ఉదాహరణ బుద్ధుడు. నిజానికి రుషులంతా ప్రపంచంపై వివిధ రూపాల్లో ప్రేమను వ్యక్తం చేసినవాళ్లే. 

మందార మకరంద మాధుర్యం...
మనిషి తన ప్రేమను విశ్వానికి ఆపాదించగలిగినప్పుడు, ఆధ్యాత్మికతతో మేళవించగలిగినప్పుడు అది ఆర్ద్రగీతమై పల్లవిస్తుంది. అప్పుడు సిసలైన ప్రేమ మాధుర్యం అవగతమవుతుంది. కామానికి అతీతమైన ఓ అమృతభావన ఎదను తడుతుంది. ఈ భావన కారణంగా ప్రపంచమంతా ప్రేమమయంగా కనిపిస్తుంది. ఇది పరమ ఉత్కృష్టమైన, ఉదాత్తమైన స్థితి. ఈ స్థితిలో ఉన్న గోపికలు ఏ అంగన ఎదురైనా ఆలింగనం చేసుకునేవాళ్లు. వారిలో కృష్ణుడిని దర్శించేవారు. అలా వాళ్లు చెట్టుతో, పుట్టతో. వర్షపు చినుకుతో, లేలేత సూర్య కిరణంతో ఏకత్వాన్ని సాధించగలిగారు. ఆ ఏకత్వానికి ప్రేమే పునాది. అది ప్రేమ మాధుర్యం. ఇలాంటి ప్రేమ పుట్టతేనెలాంటిది. దాన్ని చవిచూసిన వాళ్లకు ఇతర భావనలన్నీ రుచించవు. అందుకే పోతన ‘మందార మకరంద మాధుర్యమునదేలు మధుపమ్ముబోవునే మదనములకు’ అన్నారు. ప్రేమ అనుభూతమైన వారికి ఇలాంటి స్థితి ఏర్పడుతుంది. ఆ తర్వాత ప్రేమ అద్భుతమైన శక్తిని పుంజుకుని విశాలంగా పరుచుకుంటుంది. అలా పరుచుకున్న ప్రాంగణమంతా ప్రేమాలయం అవుతుంది. అలాంటి ప్రేమమయమైన, ఉదాత్తమైన ప్రపంచాన్ని సృష్టించడానికి ప్రతి ఒక్క మనసూ ఆరాటపడాలి. ఇలాంటి మనసులు భగవంతుడి నిలయమవుతాయి. ఇది ఆధ్యాత్మికతకు మూలబిందువుగా తయారవుతుంది. ప్రేమికుల రోజున మనం విశ్వజనీనమైన ప్రేమ స్వరూపాన్ని దర్శించాలి. 

కష్టాల్లోనూ ఇష్ట సఖే!
ప్రేమ అమలినం... ప్రేమంటే అనురాగం. ఎక్కడ ఉన్నా, పక్కనే ఉన్నట్లు ఉండే ఓ అనిర్వచనీయ అనుభూతి. దీనికి అద్దం పట్టినట్లుండే అద్భుత ప్రేమ గాథ రాధాకృష్ణులది. జయదేవుని అష్టపదికే కాదు జానపదుల ఆలాపనలకు కూడా వీరిద్దరే నాయకానాయికలు. ఎంత మంది రమణులు ఉన్నా రాధామాధవుల మధ్య ప్రేమే ప్రేమ అని లోకం కొనియాడుతోంది. ఆ ప్రేమకు అంత శాశ్వతత్వం రావడానికి ప్రధాన కారణం ఆకర్షణ కాదు. అనురాగం. వారిని పాత్రలుగా కాకుండా ప్రణయానికి సంకేతాలుగా మనం అర్థం చేసుకోవాలి. 
పశ్చిమ సముద్ర తీరంలో ఉన్న ద్వారకాపురి రాధికా క్షేత్రం. కృష్ణుడు ఈ భూమిపైకి రాకముందే ఆయన తేజం, ఆనందం, తత్త్వం రాధగా వచ్చాయని చెబుతారు. అందుకే రాధాకృష్ణులు రెండు దేహాలు, ఒకే ఆత్మ... నాలుగు నయనాలు, ఒకే చూపుగా మసలారు. శ్రీకృష్ణుడు తన భార్యలు, బంధువులందరి దగ్గర పరమ చాకచక్యంగా ప్రవర్తించేవాడట. కానీ రాధ దగ్గరకు వచ్చేసరికి ఆయన స్వరూపమే మారిపోయేదట. అంతటి చతురుడు చిక్కింది మాత్రం రాధాదేవికే. అందరూ తమ కష్టాలు ఆయనకు చెప్పుకుంటే, కృష్ణుడు తన కష్టాలను రాధకు చెప్పుకునేవాడట. అలాగే గోపికలందరూ కృష్ణుడిని ‘నువ్వు మా అందరి బలం... నీ బలహీనత మాత్రం రాధ’ అని ఆటపట్టించేవారట. కానీ నా బలం, బలగం ఆమే అని, ప్రేమ అంటే బలమని ఆయన చెప్పేవాడు. 
రాధ, శ్రీకృష్ణుని కంటే ముందే నందుని చెల్లెలుగా జన్మించింది. తను బాలికగా ఉన్నప్పుడే తన ప్రేమమూర్తి ఎక్కడో బాలునిగా జన్మించి వస్తాడని ఆమెకు తెలుసు. అందుకే రాధ ఎప్పుడూ ఏకాంతంగా వెదురు పొదల దగ్గర కూర్చుని రానున్న తన కృష్ణుని గురించి నిరీక్షిస్తూ ఉండేది. వెదురుపొదల మధ్య వీస్తున్న గాలులను అతని వేణుగానంగానే భ్రమించేది. ఆయననే ధ్యానిస్తూ ఆయన భావనలోనే నిమగ్నమయ్యేది. అది ఆధ్యాత్మిక స్థాయిలో ఒక నాదోపాసన. వేణుగానలోలుడికి వెదురు పొదలోంచి వెదురును తుంచి వేణువుగా చేసి బహూకరించింది కూడా రాధే. ఇప్పటికీ వారి రసమయ కలయికకు నిదర్శనంగా బృందావనాన్ని భావిస్తారు. మలిసంధ్య కాగానే స్థానికులు, పర్యాటకులు అందరూ ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లిపోతారు. ఉదయం అక్కడికి వెళ్లిన వాళ్లకు రాధాకృష్ణుల ప్రేమలీలలకు చిహ్నాలు కనిపిస్తాయని చెబుతారు.
కలహమైనా, విరహమైనా... అలకైనా, అల్లరైనా ప్రేమలో మాధుర్యానికి రాధాకృష్ణుల ప్రణయ సన్నివేశాలు అద్భుత చిహ్నాలు.
ఆధ్యాత్మికతలో ఉత్కృష్టమైన స్థితి అనంతమైన, నిశ్చలమైన ప్రేమలో మునిగితేలడం. ఆ స్థితికి చేరిన వారి కథలే పురాణగాథలుగా, భక్తి రసా సుధలుగా మారాయి. మచ్చుకు కొన్ని...

ఆ ప్రేమను మీరజాలలేదు!
ప్రేమ ఎవరి మధ్య పుడుతుంది? సమకాలీకుల మధ్య? కళ్ల ముందు కనిపించే వారి మధ్య?

కానీ కలలో కనిపించిన వారిని ప్రేమించడం! ఆ ప్రేమకే కట్టుబడిపోవడం... అది ఆరాధనగా, అనన్య భక్తిగా మారడం అసాధారణం. మీరా అలాంటి అరుదైన ప్రేమిక. ప్రేమ భక్తిలో మీరాది సమున్నత స్థానం. 
ఉత్తర భారతానికి చెందిన రాణా రతన్‌ సింగ్‌, కమలారాణిల తనయ మీరా. యాదృచ్ఛికంగా తన ఇంటికి వచ్చిన ఓ సాధువు ఇచ్చిన శ్రీకృష్ణుని కంచు విగ్రహానికి ఆమె ఆకర్షితురాలైంది. ఆ మూర్తినే మాధవుడిగా భావించి ప్రేమను పెంచుకుంది. తుదకు ఆ ప్రతిమ నుంచి ఆ పరమ పురుషుడిని ప్రత్యక్షం చేసుకుంది. భగవంతుడు భక్తుల ప్రేమకు బందీ అవుతాడని నిరూపించింది. ఆ పూర్ణ పురుషుడి ప్రేమలో పిచ్చిదైపోయింది. ‘హరీమైతో ప్రేమ్‌ దివానీ’ అని పాడుకుంది. ప్రపంచంలోని ప్రతి ఒక్కరి ప్రేమకు ఓ పరిమితి ఉంటుంది. కానీ ఆ పరమోన్నతుడి ప్రేమకు మేర లేదంటుంది మీరా! భగవంతుణ్ణి అంతరంగంలో నిలుపుకొన్న ఆమె మహారాణి పదవిని తృణప్రాయం అనుకుంది. మాధవదాసిగా మిగిలిపోయిది. ఎవరిని ప్రేమిస్తే మరెవరినీ ప్రేమించాల్సిన అవసరం లేదో, ఎవరి ప్రేమను పొందితే ఇంకెవరి ప్రేమను పొందాల్సిన పని లేదో  ఆయనే పరమాత్మ! అని ప్రత్యక్షంగా నిరూపించింది. ప్రాపంచిక ప్రేమకన్నా పారలౌకిక ప్రేమలోని శాశ్వతత్వాన్ని లోకానికి చాటింది. ఓ గీతంలో ‘బినా ప్రేమ్‌ నహీ మిలే నందలాలా’ అంటుంది భక్త మీరా! మానవుల మధ్య ఉండే ప్రేమకన్నా పదింతల మాధుర్యం ఆ మాధవుడి ప్రేమలో పొందవచ్చని అనుభూతి చెందిందామె. 

ఆ మాయలో పడొద్దు!

వలపు, మోహం, ప్రేమ ఈ మూడూ ప్రతి మనిషికీ సర్వసాధారణం. ఏది ఎప్పుడు ఎందుకు ఎలా ఏర్పడుతుందో ఎవ్వరూ చెప్పలేరు. కానీ, వీటి వల్ల కలిగే ఫలితాలు మాత్రం విభిన్నంగా ఉంటాయి. మనిషి వివేకమే ఈ ఫలితాన్ని నిర్ణయిస్తుంది. తెలివిగా వ్యవహరించకుండా భౌతికమైన దృష్టికి కనిపించేదే ప్రేమ అనీ, అదంతా తనదే అని, తాను కావాలనుకున్న దాన్నే ప్రేమ అనుకుంటే జరిగే పొరపాటుకు జీవితకాలమంతా బాధపడినా చేసిన తప్పును దిద్దుకోవటం సాధ్యపడదు. వరూధిని సరిగ్గా ఇలాంటి తప్పే చేసింది. అప్పటిదాకా తాను ఎంతగా బతిమిలాడినా వినని ప్రవరుడు, అతిలోక సౌందర్యాన్ని అతని ముందు ప్రకటించినా పట్టించుకోని ప్రవరుడు ఇప్పుడు మళ్లీ కనిపించి, ‘సరే’ అంటున్నాడెందుకు అని ఒక్క క్షణం కూడా ఆలోచించలేకపోయింది.వచ్చింది మాయా ప్రవరుడని గుర్తుపట్టలేకపోయింది.  ఆమెను వశపరుచుకున్నాక మాయా ప్రవరుడు వచ్చిన దారినే వెళ్లిపోయాడు. అతడు మాయారూపి అని వరూధినికి ఎప్పటికీ తెలియలేదు. బిడ్డ పుట్టాడు. కన్నబిడ్డను కూడా వదిలేసి ఇంద్రుడి దగ్గరకు వెళ్లిపోయింది వరూధిని. అంతిమంగా మోసపోయింది బిడ్డ మాత్రమే. తల్లి, తండ్రీ ఇద్దరూ అతడికి లేరు. పరాయిపంచనే పెరిగాడు. వరూధినికి రూపం ఉందనే అహకారం. మాయా ప్రవరుడికి తెలివి ఉందనే అహంకారం. ఈ అహంకారం వారి వివేకాన్ని కప్పేసింది. ఇదే వీరి పతనానికి దారి తీసింది. నిజమైన ప్రేమ ఎప్పటికీ మోసపోదు. ఆకర్షణలకు లోనుకాదు. క్షణికమైన తృప్తిని కోరుకోదు. ప్రేమకు కావాల్సింది గుణమే కానీ రూపం కాదు. తాత్కాలిక సుఖం అంతకన్నా కాదని వరూధిని ఇప్పటి ప్రేమికులకు సందేశం ఇస్తుంది. 

- వై.శ్రీలక్ష్మి, సైదులు, డా.కె.రామకృష్ణ

ప్రతి మనిషికీ గాలి, నీరు, ఆహారం ఎలా అవసరమో.. ప్రేమ కూడా అంతే ప్రాణాధారం. ప్రేమిస్తూ.. ప్రేమను పొందే జీవితం.. ఎంతో ఫలప్రదం.  మనిషి.. మనిషిగా జీవించాలంటే ప్రేమ తప్పనిసరి. ప్రవచనాలు నిరర్థకమైనా, భాష నిలిచిపోయినా ప్రేమ మాత్రం శాశ్వతం!’’

రాసలీల అంటే...
ప్రేమలో రసజ్ఞత ఉండాలంటారు. అసలేంటది? 
గోపికలు కృష్ణుడిపై ఎల్లలెరుగని ప్రేమను కురిపించేవారు. అలాంటి ప్రేమ వల్ల ఏకం అనేకమవుతుంది. ఏకంలో లీనమై ఉన్నదంతా ఏకమవుతుంది. వారి అనురాగంతో వెదురు వేణువై కులికింది. ప్రాణమై పలికింది. గానమై కురిసింది. గగనమై మెరిసింది. భువనమంతా ఆ ప్రేమ తాలూకు అతిలోక మాధుర్యం చిక్కగా పరుచుకుంది. అది నీలికాంతుల్ని వెదజల్లింది. ఆ కాంతులనే వేదం రాసం అంది. వేద రుషులు దాన్ని రసం అని పిలిచారు.  నేలను, నింగిని ఏకం చేసేది రాసం. అందులో భాగం కావడం రాసలీల. పరమ రమణీయమైన ఉత్కృష్టమైన ప్రేమ భావనకు అది నిదర్శనం.
మన్మథుడు లోకానికి ప్రేమ గురువు. అరవిందం, అశోకం, చూతం, నవమల్లిక, నీలోత్పలం అనే అయిదు ఆయన పదునైన పుష్ప బాణాలు. అందుకే ఆయనను పుష్పబాణుడు అని, పంచశరుడు అని పిలుస్తారు. ఆ ఆయుధాలతోనే ఆయన జితేంద్రియులైన మహర్షులను కూడా బోల్తా కొట్టించాడని ప్రతీతి.
ప్రేమ త్రిభుజం...
* మొదటి కోణం.. 
ప్రేమ దేనినీ ఆపేక్షించదు. అంటే ఆశించదు. 
* రెండో కోణం... 
ప్రేమలో భయం ఉండదు. 
* మూడో కోణం... 
ప్రేమ  ప్రేమానుభూతి కోసమే... ప్రేమ శక్తివల్ల మనిషి శ్రేష్ఠతరమవుతాడు. సున్నితమవుతాడు. 

మూడు రకాలు...
రామకృష్ణ పరమహంస తన కథామృతంలో మూడు రకాల ప్రేమల గురించి ప్రస్తావిస్తారు. అవి సాధారణ ప్రేమ, సమంజస ప్రేమ, సమర్థ ప్రేమ 
సాధారణ ప్రేమలో ప్రేమికుడు ‘నేను సుఖంగా ఉంటే చాలు. నువ్వు సుఖంగా ఉన్నా సరే! లేకపోయినా సరే’ అనుకుంటాడు.
సమంజస ప్రేమలో ‘నేను సుఖంగా ఉండాలి. నువ్వూ సుఖంగా ఉండాలి’ అనే భావముంటుంది.ఇది ఉదాత్తమైన ప్రేమ. 
మూడోది సమర్థ ప్రేమ... ఇందులో ‘నేను బాధపడినా ఫర్వాలేదు. నువ్వు మాత్రం సుఖంగా ఉండాలి’ అనే భావన ఉంటుంది. ఇది మహోన్నతమైంది. 
మన ప్రేమ సాధారణం నుంచి  సమర్థ స్థితికి ఎంత త్వరగా చేరుకుంటే మనం అంత పరిపూర్ణమైన ప్రేమమూర్తులుగా పరిణామం చెందుతున్నామన్నమాట.

బంధిస్తే...
ప్రేమంటే పూజ గదిలో పరిమళించే పచ్చకర్పూరంలా పవిత్రమైంది. ప్రత్యూషవేళలో పలకరించే పైరగాలిలా ప్రశాంతమైంది. ఆ కర్పూరం కరిగి కాంతినిస్తుందేగాని, కాల్చివేయదు. ఆ గాలి కదిలి ఉల్లాసాన్నిస్తుందేగాని ఉక్కిరిబిక్కిరి చేయదు. అందుకే ప్రేమ స్వచ్ఛమైంది, స్వార్థం లేనిది.
ఆశించేది, శాసించేది ప్రేమ కాదు. బంధించేది, బాధించేది అంతకన్నా కాదు. స్వర్ణంతో చేసినా సంకెళ్లు సంకెళ్లే కదా... అలాగే ఒకరిని మనం ప్రేమ బంధనాల్లో బందీ చేయాలనుకోవడం కూడా అలాంటిదే! నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నన్నూ ప్రేమించాలనుకోవడం స్వార్థం అవుతుంది. నిజమైన ప్రేమతో మనిషి హృదయం స్నిగ్ధంగా, కోమలంగా రూపుదిద్దుకుంటుంది. అదే ప్రేమతత్త్వం.

Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని