close

తాజా వార్తలు

భగభగలవేళ నిగనిగలు!

ఇవి తింటే..

సూరీడు చుర్రుమంటే..
పూలు ఓ పక్కకు వాలిపోతాయి
లతలు పందిరిపైనే తూలిపోతాయి
మరి కుసుమాల కన్నా కోమలమైన మేని సంగతేంటి?
అందుకే ఎండ కన్నెరగకుండా ఉండేందుకు ఎన్నో రక్షణ చర్యలు తీసుకుంటారు.
సన్‌స్క్రీన్‌ లోషన్లు వాడుతారు.. గొడుగు అడ్డుపెట్టుకుంటారు.. స్కార్ఫ్‌లు గట్రా కట్టుకుంటారు..
పోషకాలతోనూ భానుడి భగభగలకు చెక్‌ పెట్టొచ్చు.
క్యారెట్లు, టమాటాలు, దానిమ్మ వెరైటీలకు వేసవి డైట్‌లో చోటివ్వండి.
రవి కాంచిన చోట కందిపోకుండా చర్మ సౌందర్యాన్ని కాపాడుకోండి.

*- విటమిన్‌ సి అధికంగా ఉండే పండ్లు ఎండ నుంచి శరీరాన్ని కాపాడే సహజమైన సన్‌స్క్రీన్లుగా పనిచేస్తాయి. జామకాయ చర్మ ఆరోగ్యానికి చక్కని ఉపశమనకారిగా పనిచేస్తుంది.
* చర్మంపై యూవీ రేడియేషన్‌ ప్రభావాన్ని అదుపు చేయడంలోనూ, చర్మం తేమ కోల్పోకుండా చేయడంలోనూ టమాటాలు, పుచ్చకాయలు సమర్థంగా పనిచేస్తాయి.
* క్యారట్లలోని బీటాకెరటిన్‌ చర్మం ఎండ వేడికి కమిలిపోకుండా, నల్లగా మారకుండా కాపాడుతుంది.
* అతినీలలోహిత కిరణాల ప్రభావానికి చెక్‌పెట్టి చర్మకణాల ఆరోగ్యాన్ని కాపాడటంలో దానిమ్మ ముందుంటుంది.
* కారంపొడిలో చర్మాన్ని అందంగా ఉంచే విటమిన్‌ ఇతో పాటు లైకోపీన్‌ అధికంగా ఉంటుంది.
* తీవ్రమైన ఎండల కారణంగా మెలనోమా తీవ్రత పెరిగి శరీరం నల్లబడకుండా ఉండాలంటే రోజుకి రెండు కప్పుల గ్రీన్‌టీ తాగాలి.


దానిమ్మ  సన్‌స్క్రీన్‌ సలాడ్‌

దానిమ్మగింజలు ఎండవేడిమికి చర్మం నల్లగా మారడం, కమిలిపోవడం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. స్ట్రాబెర్రీలు సన్‌స్క్రీన్‌లోషన్ల మాదిరిగా పనిచేసి చర్మానికి రక్షణ ఇస్తాయి.
కావాల్సినవి:: కమలాలు- మూడు, దానిమ్మకాయ- 1(గింజలు తీసి పెట్టుకోవాలి), స్ట్రాబెర్రీముక్కలు- కప్పు, కమలారసం- పావుకప్పు లేదా నిమ్మరసం- చెంచా, పుదీనాఆకుల తరుగు- రెండు చెంచాలు, ఉప్పు- చిటికెడు, మిరియాలపొడి- చిటికెడు
తయారీ: కమలా పలుకులు, దానిమ్మగింజలు, స్ట్రాబెర్రీముక్కలు, ఉప్పు, మిరియాలపొడి వేసి వీటన్నింటినీ కమలారసం లేదా నిమ్మరసం వేసి కలుపుకోవాలి. చివరిగా పుదీనా ఆకులని చల్లుకుంటే దానిమ్మ సన్‌స్క్రీన్‌సలాడ్‌ సిద్ధం. 



కురుల కోసం క్యారెట్‌ జ్యూస్‌


క్యారెట్‌లోని యాంటీఆక్సిడెంట్లు, కెరొటినాయిడ్లు చర్మానికి ఎండ నుంచి గొడుగుపడతాయి. అల్లం...చర్మ సంబంధిత ఇన్‌ఫెక్షన్లు రాకుండా చేసి, శిరోజాల  ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
కావాల్సినవి: క్యారెట్లు-2, నిమ్మకాయ- అరచెక్క, అల్లం- చిన్నముక్క, పంచదార- తగినంత, పుదీనా ఆకులు- రెండు చెంచాలు, నీళ్లు- తగినన్ని
తయారీ: శుభ్రం చేసిన క్యారెట్‌ముక్కలు, అల్లం, పంచదార, పుదీనా ఆకులు అన్నింటినీ మిక్సీలో వేసి మెత్తగా స్మూథీలా చేసుకోవాలి. చివరిగా నిమ్మరసం పిండుకుంటే చర్మాన్ని, జుట్టుని ఆరోగ్యంగా ఉంచే స్మూథీ సిద్ధమయినట్టే! 



చర్మకాంతికి అవిసెల లడ్డు


చర్మం తేమతో నిండి ఆరోగ్యంగా కనిపించడానికి, ఎండ కారణంగా జుట్టు ఎండిపోయినట్టుగా కాకుండా ఆరోగ్యంగా ఉండటానికి అవిసెలు ఉపయోగ పడతాయి.

కావాల్సినవి: అవిసె గింజలు- అరకప్పు, పెసలు- అరకప్పు, బెల్లం- అరకప్పు, యాలకులు- మూడు, నెయ్యి- మూడు చెంచాలు, గుల్లసెనగపప్పు- పావుకప్పు
తయారీ: పెసలు, అవిసెగింజలని పదిహేను నిమిషాలపాటు దోర పదను మీద వేయించుకోవాలి. మిక్సీలో బెల్లం, అవిసెగింజలు, పెసలు, యాలకులు, గుల్లసెనగపప్పు వేసి పొడిచేసుకోవాలి. చివరిగా కరిగించిన నెయ్యి వేసుకుని లడ్డూలు చుట్టుకోవాలి. 



ఓట్‌మీల్‌.. మాయిశ్చరైజర్‌


ఓట్స్‌ని సహజమైన మాయిశ్చరైజర్లుగా చెప్పుకోవచ్చు. ఎండ కారణంగా కళావిహీనంగా మారిన చర్మానికి ఓట్స్‌ మేలు చేస్తాయి. యాక్నె సమస్యలుంటే తగ్గుముఖం పడతాయి.
కావాల్సినవి: బాదం మిల్క్‌- రెండు కప్పులు(చక్కెరలేని పాలు), ఉప్పు- చిటికెడు, ఓట్స్‌- కప్పు, నానబెట్టిన బాదం పలుకులు- రెండు చెంచాలు
తయారీ: బాదంపాలని చిన్నమంట మీద దగ్గరకు వచ్చేంతవరకూ మరిగించుకోవాలి. పాలల్లో ఓట్స్‌ వేసి ఐదారునిమిషాల పాటు ఉడకనివ్వాలి. దించేముందు చిటికెడు ఉప్పు వేసి ఆపై బాదం పలుకులు వేసి దించుకోవాలి. 



గ్రీన్‌టీతో విటమిన్‌ ఇ

గ్రీన్‌టీలో ఎపిగాలోకాథెసిన్‌ గాలేటా అనే శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్‌ ఉంది. చర్మసౌందర్యానికి ఉపయోగపడే విటమిన్‌ ఇతో పోలిస్తే ఇది పాతికరెట్లు శక్తిమంతమైంది. సి విటమిన్‌తో పోలిస్తే వందరెట్లు ఎక్కువ ప్రయోజనాలని అందిస్తుంది.
కావాల్సినవి: అల్లం- అంగుళం సైజులో ఉండేది, నీళ్లు- మూడుకప్పులు, పుదీనాఆకులు- అరకప్పు, గ్రీన్‌టీ బ్యాగులు- మూడు, తేనె- పావుకప్పు, నిమ్మరసం- రెండు చెంచాలు
తయారీ: ముందుగా నీళ్లలో దంచిన అల్లం వేసి మరిగించుకోవాలి. పొయ్యికట్టేసి దాంట్లో పుదీనా ఆకులు, గ్రీన్‌టీ బ్యాగు
లు వేసి ఆవిరి బయటకు పోకుండా మూతపెట్టేయాలి. పావుగంట తర్వాత తేనె, నిమ్మరసం వేసుకోవాలి. చల్లగా తాగాలను కుంటే రిఫ్రిజరేటర్‌లో ఉంచుకుని తాగితే మేలు.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.