close

తాజా వార్తలు

రాంబాబు రిజిస్టార్‌!

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం..క్రయవిక్రయాల సందడి...బ్రోకర్ల హడావుడి... చేతులు తడపందే ఫైళ్లు కదలవు... తమ వాటా ముట్టనిదే రిజిస్ట్రేషన్లు జరగవు. చాలాచోట్ల ఇదే పరిస్థితి. ఓహ్‌... ఇదంతా షరా‘మామూలే’గా...ఆగండాగండి... ఒక్కసారి మంచిర్యాల సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయానికి రండి... సందడి ఎక్కువే... కానీ దండుకోడాలుండవు...ఎవరూ ఏమీ ఇవ్వాల్సిన పనిలేదు... పత్రాలు సక్రమంగా ఉంటే చాలు...ఒకవేళ పని సకాలంలో చేయకపోతే కార్యాలయమే ప్రజలకు జరిమానా కడుతుంది. నిజమా..? నిజమే? ఈ రోజుల్లో ఇలాంటి ప్రభుత్వ కార్యాలయమా అని ఆశ్చర్యపోకండి... దీన్ని సాధ్యం చేసిన ఆ అధికారికి జేజేలు కొట్టండి..


మంచిర్యాల... నిత్యం 80కిపైగా రిజిస్ట్రేషన్లు జరిగే చోటు.. హైదరాబాద్‌ స్థాయిలో ఇక్కడ భూముల క్రయవిక్రయాలు జరుగుతాయని చెబుతారు. అందుకే నిత్యం ప్రజలతో ఇది కిటకిటలాడుతుంది. ఏ రిజిస్ట్రేషన్‌ కార్యాలయం చూసినా కాసులు చేతిలో పడందే పనికాదనే అభిప్రాయం బలంగా ఉంది. ఇక్కడ మాత్రం ఎవరూ ఎవరికీ రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రతిదీ పద్ధతి ప్రకారం జరుగుతుంది. ప్రత్యేక సూచికలను ఏర్పాటు చేసి ఏ పనికి ఎంత సమయం పడుతుందో పూర్తి వివరాలను ఇక్కడ తెలియజేస్తారు. రిజిస్ట్రేషన్‌కు అవసరమైన పత్రాలను మధ్యాహ్నం 3 గంటల లోపు తీసుకెళ్తే సాయంత్రం వరకు పని పూర్తవుతుంది. ఇంతే కాదండోయ్‌.. కార్యాలయంలో సాంకేతిక సమస్య, సిబ్బంది కొరత తప్ప మరే ఇతర కారణం వల్ల జాప్యమైనా రోజుకు రూ.50 చొప్పున సిబ్బంది బాధిత వ్యక్తికి చెల్లిస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కనిపించని ఈ ప్రత్యేకతలు ఇక్కడ అమలుకావడానికి కారణం సబ్‌రిజిస్ట్రార్‌ కొనకంచి రాంబాబు. ఆయన 2014 నవంబరులో ఇక్కడ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వినూత్న ఆలోచనలు చేస్తూ ఒక్కొక్కటిగా అమల్లోకి తెస్తున్నారు. ‘ఒక పనికి ఒక్కసారి మాత్రమే.. పదే పదే తిరగనవసరం లేదు’ అంటూ వాటిని పక్కాగా అమలుచేస్తూ నిబద్ధతను చాటుకుంటున్నారు..

పరిస్థితుల నుంచే ఆలోచనలు... 
మంచిర్యాల అంటే నిత్యం భూముల పంచాయితీలే గుర్తుకొస్తాయి. ఇక్కడి సింగరేణి కార్మికుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు చెలరేగిపోతుంటారు. ఇక్కడి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో వారిదే రాజ్యం. వారి రిజిస్ట్రేషన్లతోనే రోజులు గడిచిపోతుండేవి. ఇక సామాన్యులు తమ పనులుకాక నానాఅవస్థలు పడేవారు. చెల్లించాల్సినవారికి చెల్లింపులు చేస్తేనే పనులు జరిగేవి. ఈ పరిస్థితుల్లో సబ్‌రిజిస్ట్రార్‌గా బాధ్యతలు చేపట్టిన రాంబాబు మార్పు తేవాలని నిర్ణయించుకున్నారు. ఇలా ఒక్కొక్కటిగా అమలుచేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఇతరుల అవసరం లేకుండానే సామాన్యుల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి.

స్వచ్ఛతలోనూ ముందే.. 
స్వచ్ఛంద సంస్థల తోడ్పాటుతో మంచిర్యాల సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాన్ని స్వచ్ఛ కార్యాలయంగా తీర్చిదిద్దారు. ప్రజల కోసం మరుగుదొడ్లు నిర్మించారు. కార్యాలయం ఆవరణలో మొక్కలను నాటి పెంచుతున్నారు. ఫలితంగా తెలంగాణ రాష్ట ప్రభుత్వం 2017లో దీనికి ‘స్వచ్ఛ కార్యాలయం’గా గుర్తింపు ఇచ్చింది.

ఆ పుస్తకంతో... 
భూముల క్రయవిక్రయాలు.. వాటి రిజిస్ట్రేషన్ల గురించి చాలా మందికి అవగాహన ఉండదు. ఆంగ్లంలోనే ఇవి కనిపిస్తాయి. సామాన్యుల ఇబ్బందులను గుర్తించిన సబ్‌రిజిస్ట్రార్‌ రాంబాబు ‘భారత స్టాంపు చట్టం’ అనే పుస్తకాన్ని తెలుగులో రచించారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల కార్యాలయాల్లో కార్యకలాపాలు ఈ పుస్తకం ఆధారంగానే జరుగుతున్నాయంటే దీని ప్రాధాన్యం అర్థం చేసుకోవచ్చు. క్రయ, విక్రయాలు, దస్తావేజులకు సంబంధించిన ఏ సందేహం వచ్చినా ఆయన రచించిన పుస్తకంలో పరిష్కారం దొరుకుతుంది. వాడుక భాషలో ఉపయోగించే పదాలను ఎంచుకుని సలువుగా అర్థమయ్యేలా రచించారు. సుమారు 350 పేజీల్లో క్రయ, విక్రయాలు, దస్తావేజులపై స్టాంపు డ్యూటీ నిర్ణయించడం, కలెక్టర్‌ విధులు, మార్కెట్‌ విలువలను లెక్కించడం, పలు సెక్షన్లతో పాటు సుమారు 50 రకాలతో కూడిన వివరాలను ఇందులో పొందుపరిచారు. 2002లో తొలిసారిగా విడుదల చేశారు. 2016లో మరిన్ని మార్పులు చేసి అప్పటి ఉపముఖమంత్రి, నేటి హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ చేతులమీదుగా ఆవిష్కరించారు. 
ప్రస్తుతం ఈ పుస్తకం తెలుగు రాష్ట్రాల్లో ప్రతి సబ్‌రిజిస్ట్రార్‌ దగ్గర ఉంది. రాంబాబు మంచి రచయితతో పాటు కవి కూడా. నాలుగు వైపుల మంచి సూక్తులను రాసి ఉంచారు. కార్యాలయంలో ఏ వైపు తిరిగినా ఓ సూక్తి మనకు కనిపిస్తుంది.

- మంద రామచంద్రం, సతీష్‌, మంచిర్యాల

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.