
తాజా వార్తలు
దేశాలు దాటొచ్చినా సంస్కృతి మరవలేదని ప్రశంస
ఫ్లోరిడా: రైతు కళ్లల్లో సంతోషాన్ని చూసే.. ప్రజలు చిరునవ్వులతో ఉండే రోజులు తెలంగాణాలో రానున్నాయని.. ఆ దిశగా సీఎం కేసీఆర్ పాలన సాగుతోందని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో అమెరికాలోని ప్లోరిడా రాష్ట్రం ట్యాంపా సిటీలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో హరీశ్ పాల్గొన్నారు. అమెరికాలో ఆతిథ్యం, ఆత్మీయత చూస్తే తాను హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నట్టు అన్పిస్తోందన్నారు. వచ్చే రెండేళ్లలో రైతు పడే కష్టాలుపోయి రైతు కళ్ళలో సంతోషాన్ని ఖచ్చితంగా చూస్తామన్నారు. ఒకప్పుడు భారతదేశంలో అభివృద్ధి అంటే బెంగాల్ అని.. దేశానికి మోడల్ కేరళ అని అనుకునే వారు.. కానీ ఇప్పుడు దేశానికి తెలంగాణ ఓ రోల్ మోడల్ అని దేశ నలుమూలల్లో వినిపిస్తోందని హరీశ్‌రావు పేర్కొన్నారు. 24గంటల విద్యుత్ ఇస్తోన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. మిషన్ కాకతీయ, కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టుల ద్వారా కోటి ఎకరాల మాగాణికి సాగునీరందించాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యంఅన్నారు. రైతు బంధు, రైతు బీమా, ఎరువులు, విత్తనాల పంపిణీ, మార్కెటింగ్ వ్యవస్థ, మోటార్, స్టాటార్ లేని వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తూ రైతులకు ఆత్మవిశ్వాసాన్ని నింపింది, వారి జీవితాల్లో భరోసానిచ్చింది తెరాస సర్కారేనని గుర్తుచేశారు. ఉద్యోగ రీత్యా, ఉన్నత చదువుల కోసం దేశాలు దాటి వచ్చినా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాన్ని మరువలేదని ఎన్నారైలను ఉద్దేశించి అన్నారు. అంతకుముందు హరీశ్‌రావుకు తెలంగాణ సంప్రదాయం ప్రకారం మహిళలు బొట్టు పెట్టి, మంగళహారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎన్నారైల ఆధ్వర్యంలో హరీశ్‌ను ఘనంగా సన్మానించారు.