close

తాజా వార్తలు

‘మహా’ ప్రతిష్టంభన: సోనియాకు ఎంపీ లేఖ!

ముంబయి: మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతోంది. చెరిసగం కాలం పాలన (50:50 ఫార్ములా) పై శివసేన పట్టు వీడకపోవడంతో ఈ అంశంలో ఇంకా ఎలాంటి ముందడుగూ పడటంలేదు. మరోవైపు, రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను కాంగ్రెస్‌, ఎన్సీపీలు సునిశితంగా పరిశీలిస్తున్నాయి. శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్‌ భాగస్వామ్యంతో ‘మహా’లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుచేసే అవకాశం ఉందంటూ ఊహాగానాలు వస్తోన్న వేళ కాంగ్రెస్‌ ఎంపీ హుస్సేన్‌ దాల్వాయి ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాశారు. శివసేన-ఎన్సీపీతో కలిసి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుచేసే అవకాశాలను పరిశీలించాలని ఆయన ఈ లేఖలో కోరారు. ‘‘భాజపా-శివసేన కలిసి ప్రభుత్వం ఏర్పాటు అంశంలో గొడవ పడుతున్నాయి. కొందరు కాంగ్రెస్‌ మద్దతుదారులు ఎన్సీపీ, శివసేనతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే అంశంపై అభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో పాటు ఇతర పార్టీల నేతలను కూడా తమ పార్టీలో చేర్చుకుంది. ఈసారి అధికారంలోకి వస్తే ఆ వేటను మరింతగా కొనసాగిస్తుంది’’ అని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో శివసేనతో కలిసి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుచేస్తే భాజపా ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయవచ్చని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా రాష్ట్రంలో తమ పార్టీని కూడా పటిష్టపరుచుకోవచ్చని ఆ లేఖలో పేర్కొన్నారు. 

ఈ సందర్భంగా హుస్సేన్‌ దాల్వాయి మీడియాతో మాట్లాడుతూ.. భాజపా, శివసేన పార్టీలది వేర్వేరు సిద్ధాంతాలు.. భాజపా కంటే శివసేన ఎంతో మెరుగైన పార్టీ అన్నారు. అలాగే, రాష్ట్రంలో భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా నిలువరించడం అత్యంత అవసరమన్నారు. శివసేనతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో ఎటువంటి తప్పూలేదని తాను వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నట్టు చెప్పారు. శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్‌ మద్దతిస్తుందా? అన్న ప్రశ్నకు ఆయన స్పందించారు. ‘ఎందుకు కాదు?’ అని వ్యాఖ్యానించారు.  గతంలో కాంగ్రెస్‌కు శివసేన మద్దతు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయన్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ కాలంలో, మహారాష్ట్రలో ఏఆర్‌ అంతులే సీఎంగా ఉన్నప్పుడు శివసేన మద్దతు ఇచ్చిందని పేర్కొన్నారు. అలాగే, ప్రతిభాపాటిల్‌ను రాష్ట్రపతిగా ఎన్నుకున్న సందర్భంలోనూ శివసేన కాంగ్రెస్‌కు మద్దతిచ్చిందని చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఉద్ధవ్‌ ఠాక్రే ఏదైనా ప్రతిపాదనతో వస్తే మాత్రం కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆలోచిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. 

మేం ఎవరితో చర్చలు జరపలేదు: ఖర్గే
మరోవైపు, మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసే అంశంపై ఇప్పటి వరకు తాము ఏ పార్టీతోనూ చర్చలు జరపలేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లిఖార్జున ఖర్గే స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రజలు తమను ప్రతిపక్షంలో ఉండాలని తీర్పు ఇచ్చినట్లు ఆయన గుర్తు చేశారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.