ఆవిష్కరణలేమో మెకానికల్‌
close

తాజా వార్తలు

Updated : 24/08/2019 00:50 IST

ఆవిష్కరణలేమో మెకానికల్‌

చదివింది కంప్యూటర్స్‌

చైన్‌ లేకుండా బైకు..స్టీరింగ్‌ లేకుండా కారు.. ఊహించగలరా?కానీ, వైజాగ్‌కి చెందిన గౌతమ్‌ ఊహించాడు..రూపం ఇచ్చాడు.. నడిపాడు.. అందర్నీ తన మెకానికల్‌ స్కిల్‌తో అబ్బురపరుస్తున్నాడు..

‘ఇష్టమైన సబ్జెక్టు ఎంపిక చేసుకోలేకపోయా. పేరెంట్స్‌ చెప్పారని ఆసక్తి లేకపోయినా చదువుతున్నా. ఒత్తిడి తట్టుకోలేకపోతున్నా..’ అంటూ జీవితాల్ని అంధకారం చేసుకునే యువతని చూస్తున్నాం. దీనికి భిన్నంగా గెంబలి గౌతమ్‌ ఆలోచించాడు. డిగ్రీలో కంప్యూటర్స్‌, పీజీలో డేటాసైన్స్‌ కోర్సులు చేసి కంప్యూటర్‌ పరిజ్ఞానాల్లో ఆరితేరినప్పటికీ తన ఆవిష్కరణలన్నీ మెకానికల్‌ ఇంజినీరింగ్‌కు చెందినవే. ఎందుకంటే.. తనకి చిన్నప్పటి నుంచీ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ అంటే అంత ఇష్టం. తన ఆలోచనలను ప్రోత్సహించేలా గీతం విశ్వవిద్యాలయ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ విభాగం వారు తమ పరిశోధనశాలలు, వర్క్‌షాప్‌లను ఉపయోగించుకోవడానికి అనుమతి ఇవ్వడంతో ఆయా ఆవిష్కరణలకి ప్రాణం పోశాడు. ప్రతిభని గుర్తించిన వాసన్‌ స్వచ్ఛంద సంస్థ ప్రాంగణ నియామకాల్లో ఎంపిక చేసి ఉద్యోగం ఇచ్చింది. సమాజానికి అత్యంత ఉపయుక్తమైన వివిధ ఉపకరణాలు చేయాలన్న తపనతో పరిశోధనలు చేసి ఇప్పటివరకు అరడజను వరకు ఆవిష్కరణలు చేశాడు.

స్టీరింగ్‌లేని కారు..
కారు నడపాలంటే స్టీరింగ్‌ కీలకం. కానీ గౌతమ్‌ స్టీరింగ్‌లేని కారును ఆవిష్కరించాడు. రెండు చేతులూ లేని వారు సైతం నడపడానికి అనుకూలమైన వాహనం ఉండాలన్న ఉద్దేశంతో ఈ కారుని తయారు చేశాడు. దీనికి హోవర్‌బోర్డ్‌ పరిజ్ఞానాన్ని  ఉపయోగించుకున్నాడు. ముందుసీట్లో కూర్చొని పాదాలను పైకి, కిందికి, ముందుకి, వెనక్కి తిప్పితే కారు కావాల్సిన దిశలో ప్రయాణిస్తుండడం విశేషం. బ్రేకులు వేయడానికి, హారన్‌ మోగించడానికి కూడా కాళ్లనే ఉపయోగించి పని పూర్తి చేసేలా సెన్సర్ల పరిజ్ఞానాన్ని వినియోగించుకున్నాడు. ఈ కారులో కూర్చుంటే చూసేవారికి డ్రైవింగ్‌ చేస్తున్నట్లు గుర్తించడం కూడా కష్టం. దీనికున్న లిథియం బ్యాటరీకి రెండు గంటలు ఛార్జింగ్‌ పెడితే 30 నుంచి 40కి.మీ.ల దూరం వెళ్తుంది. మరింత దూరం వెళ్లాల్సి వచ్చినప్పుడు మరో బ్యాటరీని కూడా ప్రత్యామ్నాయంగా అమర్చుకోవచ్చు. కారుపైన అమర్చిన సౌరవిద్యుత్తు ఫలకంతో కారును ఎండలో ఉంచితే దానంతటదే ఛార్జింగ్‌ అవుతుంది. రూ.32వేల వ్యయంతో దీన్ని తయారు చేశాడు.

చైన్‌ లేకుండానే బైక్‌....
సైకిల్‌, బైక్‌ పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చేది దానికుండే చైన్‌. ఆ చైన్‌ ఆధారంగానే చక్రాలు కదిలి వాహనం ముందుకు వెళ్తుంది. గౌతమ్‌ మాత్రం.. చైన్లు లేకుండా, ఆయిలింగ్‌ చేయాల్సిన అవసరం లేకుండా రాకెట్‌ బైక్‌ను తయారుచేశాడు. చక్రాలను మాత్రం చైనా నుంచి దిగుమతి చేసుకున్నాడు. లిథియం బ్యాటరీతో ఈ ద్విచక్రవాహనం నడుస్తుంది. రెండుగంటలు ఛార్జింగ్‌ పెడితే 40కి.మీ.ల దూరం వెళ్లేలా ఈ రాకెట్‌ బైక్‌ను రూపొందించాడు. దీనికి డిస్క్‌బ్రేక్‌, ఎలక్ట్రిక్‌ బ్రేక్‌ రెండూ ఉన్నాయి. కేవలం 20కేజీల లోపు బరువుండే ఈ బైక్‌ను సునాయాసంగా కారులో పెట్టుకుని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. ధ్వని, వాయు కాలుష్యాలకు తావులేకుండా దీన్ని తయారుచేశాడు.

ఇక మోయక్కర్లేదు
రైతులు పొలంలో పురుగుమందులు కొట్టాలంటే బరువైన స్ప్రేయర్‌ను వీపుపై మోయాలి. ఫలితంగా రైతులు కొంత కాలానికి అనారోగ్యాలకు గురయ్యే ముప్పు ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని గౌతమ్‌ ‘వీల్‌ స్ప్రేయర్‌’ తయారుచేశాడు. మొక్కల మధ్యన స్రేయర్‌ని నడిపించుకుంటూ పురుగుమందులు చల్లొచ్చు. ఒకేసారి ఆరువరుసల్లో మొక్కలకు మందు చల్లేలా దీన్ని రూపొందించాడు. ఫలితంగా ఎకరం పొలానికి సగటున 20 నిమిషాల్లోనే పురుగుమందులను కొట్టవచ్చు. రైతుల శరీరంపై ఎలాంటి భారం పడదు. సౌరశక్తితోగానీ, బ్యాటరీతోగానీ ఇది పనిచేస్తుంది. దీని వినియోగానికి అయ్యే వ్యయం కూడా ఇతర స్ప్రేయర్లతో పోల్చుకుంటే తక్కువే.

బైక్‌/కార్‌ సర్వీసింగ్‌ పంప్‌సెట్‌....
ద్విచక్రవాహనాలు, కార్లకు వాటర్‌ సర్వీసింగ్‌ను వేగంగా చేయడానికి వీలుగా ఒక ఉపకరణాన్ని తయారుచేశారు. తక్కువ నీటితో, ఎక్కువ ప్రెజర్‌తో నీటి జల్లు వాహనంపై పడేలా దీన్ని రూపొందించాడు. ఫలితంగా తక్కువ సమయంలోనే వాహనాన్ని శుభ్రపరచుకోవడం పూర్తి చేయవచ్చు. పది వాహనాల్ని సర్వీసింగ్‌ చేస్తే ఒక యూనిట్‌ విద్యుత్తు మాత్రమే ఖర్చవుతుంది. దీంతోపాటు నీటి వనరులు బాగా ఆదా అవుతాయి.

- బి.ఎస్‌.రామకృష్ణ, ఈనాడు, విశాఖపట్నం

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని