close

తాజా వార్తలు

పసిడి ఈటీఎఫ్‌లు కొనొచ్చా?

మా అబ్బాయి వయసు ఎనిమిదేళ్లు. అతని ఉన్నత చదువులకు ఉపయోగపడేలా నెలకు రూ.10,000 వరకూ మదుపు చేయాలనే ఆలోచనతో ఉన్నాను. పోస్టాఫీసు రికరింగ్‌ డిపాజిట్‌లో లేదా పీపీఎఫ్‌లో మదుపు చేయాలనుకుంటున్నాను. దీనివల్ల మంచి రాబడి వస్తుందా? నేను ఏం చేయాలి?

- శ్రీకాంత్‌

విద్యా ద్రవ్యోల్బణం ఏటా పెరుగుతోంది. ప్రస్తుతం ఇది 8-10శాతం మధ్య ఉంది. మీరు పెట్టుబడులు పెట్టినప్పుడు దీన్ని మించి రాబడి ఆర్జించేలా చూసుకోవాలి. మీరు రికరింగ్‌ డిపాజిట్‌లో మదుపు చేస్తే.. 7.2శాతం మాత్రమే వడ్డీ లభిస్తోంది. పీపీఎఫ్‌లో 7.9శాతం రాబడి లభిస్తోంది. భవిష్యత్తులో ఈ వడ్డీ రేట్లు తగ్గే అవకాశం లేకపోలేదు. మీ బాబు ఉన్నత చదువుల కోసం మరో 12-13 ఏళ్ల సమయం ఉంది. ఈ సమయంలో మీ పెట్టుబడి వృద్ధి చెందాలంటే, ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లను ఎంచుకోవడం మేలు. వీటిలో 12-13శాతం రాబడి వచ్చేందుకు అవకాశం ఉంది. మీరు నెలకు రూ.10,000 చొప్పున 12 ఏళ్లపాటు మదుపు చేస్తే.. కనీసం 13శాతం రాబడి అంచనాతో.. రూ.30,78,021 అయ్యే అవకాశం ఉంది. దీనికి మీరు ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్‌ ఈక్విటీ ఫండ్‌, ఫ్రాంక్లిన్‌ ఇండియా ఈక్విటీ ఫండ్‌, మిరే అసెట్‌ లార్జ్‌ క్యాప్‌ ఫండ్‌, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మల్టీ క్యాప్‌ ఫండ్లను పరిశీలించవచ్చు.

నేను మరో ఆరేళ్ల తర్వాత ఇల్లు కొనాలనుకుంటున్నాను. నా వంతు మార్జిన్‌ మొత్తాన్ని జమ చేసేందుకు ప్రస్తుతం నెలకు రూ.18,000 వరకూ మదుపు చేయాలనుకుంటున్నాను. పెట్టుబడికి నష్టం రాకుండా, కాస్త ఎక్కువ రాబడి వచ్చేలా ఎలాంటి పెట్టుబడులు ఎంచుకోవాలి?

- రవీందర్‌

ఇంటి కొనుగోలుకు అవసరమైన మార్జిన్‌ మొత్తం కోసం సురక్షితమైన పథకాలను ఎంచుకుంటే.. 6.5-7శాతం వరకూ రాబడి వస్తుంది. వచ్చిన రాబడిపై పన్ను భారమూ ఉంటుంది. కాస్త నష్టభయం ఉన్నా.. హైబ్రీడ్‌ హైబ్రీడ్‌ ఈక్విటీ ఫండ్లను ఎంచుకోవడం వల్ల దాదాపు 10-11శాతం రాబడి వచ్చే అవకాశం ఉంది. దీనికి మీరు యాక్సిస్‌ ఈక్విటీ హైబ్రీడ్‌ ఫండ్‌, ఎస్‌బీఐ ఈక్విటీ హైబ్రీడ్‌ ఫండ్‌, మిరే అసెట్‌ హైబ్రీడ్‌ ఈక్విటీ ఫండ్లను ఎంచుకోవచ్చు. మీకు డబ్బులు అవసరమయ్యే రెండేళ్ల ముందు నుంచే వీటి నుంచి కొద్దికొద్దిగా పెట్టుబడిని వెనక్కి తీసుకోండి. 

నా వయసు 64 ఏళ్లు. నేను గతంలో చేసిన ఎఫ్‌డీ నుంచి ఇప్పుడు రూ.5లక్షలు చేతికి రాబోతున్నాయి. వీటిని కనీసం 9-10శాతం రాబడి వచ్చేలా జమ చేయాలనుకుంటున్నాను. వీలవుతుందా? 
- బాలకృష్ణరావు

మీరు నష్టభయం లేకుండా 9-10శాతం రాబడి సంపాదించడం కష్టమైన విషయమే. మీరు అనుకున్నదానికన్నా.. కాస్త తక్కువ వడ్డీ వచ్చినా.. డబ్బు సురక్షితంగా ఉండేలా మదుపు చేయాలనుకుంటే.. పెద్దల పొదుపు పథకాన్ని ఎంచుకోవచ్చు. ప్రస్తుతం ఇందులో 8.6శాతం వడ్డీ వస్తోంది. ప్రతి మూడు నెలలకోసారి వడ్డీని చెల్లిస్తారు. 

బంగారం ధర పెరుగుతోన్న నేపథ్యంలో నెలకు రూ.4,000 చొప్పున ఇందులో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నాం. దీనికోసం గోల్డ్‌ ఈటీఎఫ్‌లలో పెట్టుబడి పెట్టడం మంచిదేనా? దీనికన్నా వేరే మార్గం ఉందా?

- నీరజ

ఒక పెట్టుబడి పథకాన్ని ఎంచుకునేప్పుడు.. ధర తక్కువగా ఉన్నప్పుడే అందులో మదుపు చేయాలి. గత ఏడాదిగా అంతర్జాతీయంగా స్టాక్‌ మార్కెట్ల పనితీరు అంతగా బాగాలేదు. దీనివల్లే బంగారం ధరలో వృద్ధి కనిపించింది. మార్కెట్లు వృద్ధి చెందడం ప్రారంభిస్తే.. దీని ధర తగ్గే ఆస్కారం ఉంది. 2013లో పది గ్రాముల బంగారం ధర రూ.33,000 వరకూ ఉంది. ఇప్పుడు రూ.39,000 దరిదాపుల్లో ఉంది. ఈ లెక్కను బట్టి చూస్తే.. గత ఆరేళ్లుగా వచ్చిన లాభం 2.8శాతం మాత్రమే. మీకు ఐదారేళ్ల వ్యవధి ఉంటే.. ప్రత్యామ్నాయంగా ఈక్విటీ పెట్టుబడులను పరిశీలించవచ్చు. మీకు నిజంగా బంగారం అవసరమైనప్పుడు ఈ పథకాల్లో నుంచి డబ్బు వెనక్కి తీసుకొని, కొనుగోలు చేయొచ్చు. 

- తుమ్మ బాల్‌రాజ్‌, సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ ప్లానర్‌

Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.