close
గల్ఫ్‌గుత్తగా మోసాలు

ఏజెంట్ల ఘరానా దందా
తెలంగాణలో 3 వేల మంది నకిలీల కార్యకలాపాలు
కార్యాచరణపై పట్టింపు లేని పోలీస్‌శాఖ

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో నకిలీ వీసాల మోసాలు నిత్యకృత్యమయ్యాయి. వేలాది మంది వలస కార్మికులు ఎడారి దేశాలకు వెళ్లి విలవిల్లాడుతుండటం పరిపాటిగా మారింది. బడుగు జీవుల్ని నిట్టనిలువునా ముంచుతున్న బోగస్‌ గల్ఫ్‌ ఏజెంట్లు కోట్లకు పడగలెత్తుతున్నారు. ఇదంతా బహిరంగ రహస్యమే అయినా ఆ వ్యవస్థను తుదముట్టించడానికి పోలీసులకు మనస్కరించడం లేదు.

ఉత్తర తెలంగాణలో ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో నకిలీ వీసాల మోసాలకు బలవుతున్న ఘటనలు అధికం. బతుకుదెరువు కోసం ఎడారి దేశాల బాట పట్టాలనే బడుగుజీవుల ఆశనే బోగస్‌ ఏజెంట్లు సొమ్ము చేసుకుంటున్నారు. తొలుత వర్క్‌పర్మిట్‌ వీసా ఇస్తామని నమ్మిస్తూ ఒక్కొక్కరి వద్ద రూ.1-2లక్షల వరకు వసూలు చేసి విజిట్‌ వీసాలు అంటగడుతున్నారు. ఈ వీసాలపై అక్కడికి వెళ్లిన తర్వాత పని చేసే అవకాశం లేక కార్మికులు బావురుమంటున్నారు. తమ మోసాలకు ఎక్కువగా నిరక్షరాస్యులనే ఎంచుకుంటున్నారు. పలు సందర్భాల్లో పాస్‌పోర్టులను లాక్కోవడం.. కార్మికుడికి తెలియకుండానే మధ్యలోనే వీసా రద్దు చేయడం లాంటి పరిణామాలతో వలసజీవులు ఎడారి దేశాల్లోని జైళ్లలో మగ్గిపోవాల్సి వస్తోంది. కువైట్‌ జైళ్లలో మగ్గిపోయిన 17 మంది కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం చొరవతో రెండు రోజుల క్రితం విముక్తి లభించడం గమనార్హం.

గల్ఫ్‌లో కంపెనీలు తెరిచి మరీ...
గతంలో గల్ఫ్‌ కంపెనీలకు వలస కార్మికులను సరఫరా చేసే పని చేసిన బోగస్‌ ఏజెంట్లు ఇప్పుడు ఏకంగా ఆయా దేశాల్లోనే నకిలీ కంపెనీలు తెరిచారు. వాటిల్లో పని కల్పించే పేరిట అక్కడి ప్రభుత్వాల నుంచి వీసాలు పొందుతున్నారు. వాటిని ఇక్కడి కార్మికులకు అంటగడుతూ లక్షలు వెనకేస్తున్నారు. జగిత్యాల ధర్మపురికి చెందిన ఓ ఏజెంట్‌ ఇలాగే దుబాయ్‌లో వందకుపైగా కంపెనీల్ని సృష్టించి వెయ్యికిపైగా వీసాల్ని పొందడం గమనార్హం. వాటిల్లోని చాలా కంపెనీల్లో ఎలాంటి కార్యకలాపాలు లేకపోవడంతో ఆ వీసాలపై వెళ్లిన కార్మికులకు అక్కడ అగచాట్లు తప్పడం లేదు.

అధీకృత ఏజెంట్లు 30లోపే అయినా..
తెలంగాణ వ్యాప్తంగా వాస్తవానికి ప్రభుత్వ అధీకృత గల్ఫ్‌ ఏజెంట్లు 30లోపే ఉన్నారు. సుమారు 3వేల మంది బోగస్‌ ఏజెంట్లు ఉన్నారు. గ్రామాల్లో పటిష్ఠమైన దళారీ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారు. ఈ ముఠాలకు చెన్నై, ముంబయి, దిల్లీతోపాటు దుబాయ్‌లాంటి గల్ఫ్‌ దేశాల్లోనూ నెట్‌వర్క్‌ ఉంటోంది. ఇదంతా గ్రామాల్లో బహిరంగ రహస్యమే అయినా పోలీసుల దృష్టి సారించకపోవడం విమర్శలకు తావిస్తోంది. గతంలో సైబరాబాద్‌ పోలీసులు నకిలీ వీసాల రాకెట్‌ను ఛేదించారు. ఆ ముఠా నుంచి సేకరించిన సమాచారంతో తెలుగు రాష్ట్రాల్లోని బోగస్‌ ఏజెంట్ల జాబితాను తయారు చేసి ఆయా జిల్లాల ఎస్పీలకు పంపారు. ప్రస్తుతం ఆ వ్యవహారం అటకెక్కింది. ఉమ్మడి నిజామాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లోనూ బోగస్‌ ఏజెంట్ల వ్యవహారాలు తరచూ వెలుగుచూస్తున్నా బాధితుల ఫిర్యాదులపై కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారు తప్ప వ్యవస్థీకృత నేరాల్ని తుద ముట్టించే ప్రయత్నాలు జరగడం లేదు.

వార్తలు / కథనాలు

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.