వీల్‌ఛైర్‌లో కూర్చుని ప్రచారం చేస్తా: మమత

తాజా వార్తలు

Updated : 11/03/2021 19:30 IST

వీల్‌ఛైర్‌లో కూర్చుని ప్రచారం చేస్తా: మమత

ఆసుపత్రి బెడ్‌పై నుంచి దీదీ వీడియో సందేశం

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీపై నందిగ్రామ్‌లో దాడి జరగడంతో ఆ పార్టీ కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా నేడు ఆందోళనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో నిరసనలపై స్పందించిన దీదీ.. ఆసుపత్రి నుంచే తమ కార్యకర్తలకు సందేశమిచ్చారు. ప్రజలకు ఇబ్బంది కలగనివ్వొద్దని, శాంతియుతంగా ఉండాలని కోరారు. అవసరమైతే చక్రాల కుర్చీలో కూర్చునే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని హామీ ఇచ్చారు. 

‘‘నిన్న సాయంత్రం కారు ఎక్కుతూ దేవుడిని ప్రార్థిస్తుండగా ఒక్కసారిగా కొంతమంది నన్ను తోసేశారు. దీంతో నా ఎడమకాలి మడమ ఎముకకు, పాదానికి, మోకాలికి గాయమైంది. ఛాతిలో నొప్పి, శ్వాసతీసుకోవడంలో ఇబ్బందిగా అనిపిస్తోంది. ప్రస్తుతం నాకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. రెండు మూడు రోజుల్లోనే డిశ్చార్జ్‌ అయి తిరిగి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటాను. అవసరమైతే వీల్‌ఛెయిర్‌లో కూర్చుని ప్రచారం చేస్తా. అందుకు మీ అందరి సహకారం కావాలి. ఈ సందర్భంగా ప్రజలకు ఇబ్బంది కలిగించే పనులు చేయొద్దని, శాంతియుతంగా ఉండాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నా’’ అని దీదీ వీడియోలో పేర్కొన్నారు. ఈ వీడియోను తృణమూల్‌ కాంగ్రెస్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. 

నందిగ్రామ్‌లో నామినేషన్‌ వేసిన అనంతరం ఓ ఆలయాన్ని సందర్శించిన సమయంలో దీదీ కాలికి గాయమైన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన రాజకీయ దుమారానికి దారితీసింది. సీఎంపై కుట్రపూరితంగానే దాడి జరిగిందని అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ ఆరోపించింది. దీనిపై ఎన్నికల సంఘానికి నేడు ఫిర్యాదు చేసింది. ఘటనపై ఈసీ బాధ్యత తీసుకోవాలని, నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. 

అయితే తృణమూల్‌ ఆరోపణలను భాజపా ఖండించింది. మమతపై ఎలాంటి దాడి జరగలేదని, అది కేవలం ప్రమాదమేనని కొట్టిపారేసింది. ఎన్నికల్లో ఓడిపోతాననే భయంతోనే దీదీ ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టింది. ప్రజల్లో సానుభూతి పొందేందుకే ఈ ఘటనను రాజకీయం చేస్తున్నారని మండిపడింది. దీనిపై లోతుగా దర్యాప్తు చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని