సీఎం వల్లే దళిత బంధు ఆగింది

ప్రధానాంశాలు

సీఎం వల్లే దళిత బంధు ఆగింది

ఆయనే ఎన్నికల సంఘానికి అవకాశం కల్పించారు

రాష్ట్రంలో కుల సంఘాలను చీల్చే కుట్ర

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

ఈనాడు- హైదరాబాద్‌, కంటోన్మెంట్‌, గన్‌ఫౌండ్రి- న్యూస్‌టుడే: కేంద్ర ఎన్నికల సంఘం కొనసాగుతున్న ప్రభుత్వ పథకాలను ఎప్పుడూ నిలిపివేయదని, ముఖ్యమంత్రి కేసీఆరే ‘దళితబంధు’ను పూర్తి స్థాయిలో ప్రారంభించకుండా పథకాన్ని ఆపివేసే అవకాశాన్ని ఈసీకి కల్పించారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. దళితుల్ని ఆయన మరోసారి మోసం చేశారని, తక్షణమే సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. దళితబంధు పథకాన్ని ఆపివేయాలంటూ ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చిన నేపథ్యంలో సంజయ్‌ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో కుల సంఘాలను చీల్చేందుకు కుట్ర జరుగుతోందని మరో కార్యక్రమంలో ఆరోపించారు. ‘కేసీఆర్‌ కుట్ర బుద్ధితోనే ఇప్పటివరకు దళితబంధు నిధులు విడుదల కాకుండా ఆపారు. లబ్ధిదారుల ఖాతాల్లో పడ్డ డబ్బును బ్యాంకులు ఫ్రీజ్‌ చేసిన దాఖలాలు దేశంలో ఎక్కడా లేవు. లబ్ధిదారులు ఆ డబ్బుల్ని డ్రా చేసుకునే అవకాశం కల్పించాలని కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌, రిటర్నింగ్‌ అధికారికి వినతిపత్రం ఇచ్చాం’ అని గుర్తుచేశారు.

అధికార పార్టీకి అడ్డాలుగా కుల సంఘ భవనాలు

రాష్ట్రంలో కుల సంఘాలను చీల్చే కుట్ర జరుగుతోందని సంజయ్‌ దుయ్యబట్టారు. కుల సంఘాల భవనాలు అధికార పార్టీకి అడ్డాలుగా మారిపోతున్నాయని ఆరోపించారు. కంటోన్మెంట్‌లో సోమవారం రాష్ట్ర మున్నూరు కాపు సంఘం నేత మీసాల చంద్రయ్య ఆధ్వర్యంలో ‘అలయ్‌.. బలయ్‌’ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలువురు కుల సంఘాల నేతలు తమ ఆస్తులు, పదవులను కాపాడుకోవడానికే అధికార పార్టీకి కొమ్ము కాస్తూ, సంఘాలను చీల్చడానికి ఉపయోగపడుతున్నారని విమర్శించారు.

అందరికీ టీకా అందేలా కార్యకర్తలు చూడాలి

ప్రతి ఒక్కరికీ కొవిడ్‌ టీకా అందేలా కార్యకర్తలు కృషి చేయాలని సంజయ్‌ భాజపా శ్రేణుల్ని కోరారు. సోమవారం అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులు, ఇన్‌ఛార్జులతో ఆయన టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రానున్న రెండు రోజుల్లో దేశంలో వంద కోట్ల డోసులు పూర్తి కానున్నాయని, రాష్ట్రాల వద్ద సుమారు 10 కోట్ల డోసులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని