అది చరిత్ర.. ఇప్పుడు నేను కెప్టెన్‌ కాదు 

తాజా వార్తలు

Updated : 31/01/2021 12:29 IST

అది చరిత్ర.. ఇప్పుడు నేను కెప్టెన్‌ కాదు 

అజింక్య రహానె ఇంటర్వ్యూ..

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇప్పుడు తాను టీమ్‌ఇండియా కెప్టెన్‌ కాదని, ఆ తాత్కాలిక బాధ్యత ముగిసిందని వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానె అన్నాడు. ఆస్ట్రేలియాతో బోర్డర్‌-గావస్కర్‌ సిరీస్‌లో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ లేకున్నా రహానె యువ ఆటగాళ్లతో చారిత్రక విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ క్రికెట్‌ వ్యాఖ్యాత హర్షాభోగ్లేతో రహానె తాజాగా ముచ్చటించిన సందర్భంగా పలు విషయాలను పంచుకున్నాడు. ఆ వివరాలేంటో వారి మాటల్లోనే తెలుసుకుందాం.

భోగ్లే: గబ్బా టెస్టులో చివరిరోజు పుజారా, పంత్‌ కలిసి ఆడారు. ఇద్దరూ భిన్నమైన ఆటగాళ్లు. మీరు ఇలాగే ఆడాలని వారికేమైనా సలహాలిచ్చారా? లేక వారి సహజ సిద్ధమైన ఆటనే ఆడమన్నారా?
రహానె: ఎవరి ఆట వాళ్లు ఆడాలని మేం అనుకున్నాం. అందులో ఎటువంటి సందేహం లేదు. నేను బరిలోకి వెళ్లాక పుజారాతో.. నువ్వు నీలాగే ఆడు. నేను వేగంగా పరుగులు చేస్తానని చెప్పా. ఆ సమయంలో త్వరగా 40 పరుగులు సాధిస్తే తర్వాత మ్యాచ్‌ గెలిచే అవకాశం ఉందని భావించా. 24 పరుగులు చేశాక నేను ఔటయ్యా. పంత్‌ క్రీజులోకి వస్తుండగా.. ‘టీ విరామానికి 20 నిమిషాల సమయముంది. అప్పటి వరకూ జాగ్రత్తగా ఆడు’ అని పంత్‌కు చెప్పా. తర్వాత తన సహజసిద్ధమైన ఆట ఆడుకోమన్నాను. 

భోగ్లే: పుజారా అంతసేపు క్రీజులో పాతుకుపోయాడు. ఎలా ఆడగలిగాడు?
రహానె: పుజారా పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు. ఎలా ఆడాలనే విషయంపై అతడికి మంచి అవగాహన ఉంది. గత పర్యటనలోనూ చాలా బంతులు ఎదుర్కొని శతకాలు చేశాడు. క్రీజులో పాతుకుపోతే తర్వాత నచ్చినట్టు ఆడొచ్చనే నమ్మకం అతడికి ఉంది. అది జట్టుకు ప్రయోజనకరం. కాబట్టి, అతడి ఆటతీరు గురించి మేం ఆలోచించలేదు. 

భోగ్లే: యువ బ్యాట్స్‌మన్‌ శుభ్‌మన్‌ గిల్‌ ఎలా అనిపించాడు?
రహానె: గిల్‌ అద్భుతమైన ఆటగాడు. ప్రాక్టీస్‌ మ్యాచ్‌ల నుంచే పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. రెండో టెస్టులో అతడికి అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. 

భోగ్లే: రిషభ్‌పంత్‌, వాషింగ్టన్‌, శుభమన్‌ లాంటి యువకులు ఇంత పెద్ద టోర్నీలో ఆడడానికి సిద్దంగా, ఉత్సాహంతో కనిపించారు?
రహనె: ఓడిపోతామనే భయం లేకపోవడమే అందుకు కారణమని నేను అనుకుంటున్నా. టీమ్‌ఇండియా తరఫున బాగా ఆడాలనే కసి వారిలో ఉంది. అలాగే ఐపీఎల్‌ కూడా ఉపయోగపడింది. అంతర్జాతీయ ఆటగాళ్లతో కలిసి ఆడడం లాభపడిందని భావిస్తున్నా.

భోగ్లే: గబ్బా టెస్టులో విజయం సాధించాక నీకెలా అనిపించింది?
రహానె: విజయానికి 10 పరుగుల దూరంలో ఉండగా.. ఇప్పుడు చరిత్ర సృష్టించేలా ఉన్నామనిపించింది. నాలో భావోద్వేగాలు బయటపడనీయను. ఆ సమయంలో రోహిత్ పక్కన కూర్చున్నా. అతడేమో మనం గెలుస్తున్నాం అనే ఉత్సాహంతో ఉన్నాడు. నేనేమో ప్రతి బంతినీ గమనిస్తూ కూర్చున్నా. ఇది నిజమేనా కాదా అనే ఆశ్చర్యంలో మునిగిపోయా. అదో ప్రత్యేకమైన అనుభూతి. అప్పుడెలా స్పందించాలో అర్థం కాలేదు. 

భోగ్లే: ఈ మ్యాచ్‌ గెలుస్తున్నామనే తొలి ఆలోచన ఎప్పుడొచ్చింది?
రహానె: టీ విరామం తర్వాత విజయానికి 80 పరుగుల దూరంలో ఉండగా తొలిసారి ఆ భావన కలిగింది. చరిత్ర సృష్టించడానికి ఇదే సరైన సమయం. ఇది జీవితకాల అవకాశం. మళ్లీ ఇలాంటి సందర్భం రాదనిపించింది. ఇప్పుడు డ్రా గురించి ఆలోచించకుండా గెలవాలనే భావన కలిగింది. ఆ సమయంలో పంత్‌, వాషింగ్టన్‌ అద్భుతంగా ఆడారు. విజయం కోసం ప్రయత్నించమని వారికెవరూ చెప్పలేదు. అయినా లక్ష్యం దిశగానే సాగారు. 

భోగ్లే: మూడు టెస్టుల అనుభవంతోనే సిరాజ్‌ బౌలింగ్‌ భారాన్ని తన భుజాలపై మోశాడు. అతడికి ఏమైనా సలహాలిచ్చావా?
రహానె: బౌలర్లను నడిపించే బాధ్యత నీదే అని అతడితో అన్నాను. దాన్ని ఒత్తిడిగా భావించొద్దని, వీలు చిక్కినప్పుడల్లా ఇతర బౌలర్లతో మాట్లాడమని సూచించా. వారికి అవసరమైన సలహాలు, సూచనలు చేయమని కోరాను.

భోగ్లే: నేథన్‌ లైయన్‌కు జెర్సీ ఇవ్వాలని ఎందుకు అనుకున్నారు?
రహానె: మేం అందరం సంతకాలు చేసిన జెర్సీని అతడికి ఇవ్వాలని అనుకున్నా. ఒక బౌలర్‌గా 100 టెస్టులు ఆడటం అనేది గొప్ప విషయం. అది కూడా ఆస్ట్రేలియా జట్టులో స్పిన్‌ బౌలర్‌గా ఆడటం మరింత ప్రత్యేకం. ఒక క్రికెటర్‌గా అతడి ఘనతను గౌరవించాలి. ప్రతి ఒక్కరికీ మర్యాద ఇవ్వాలనే విషయం నేను ఈ ఆట నుంచే నేర్చుకున్నా. ఆటలో గెలుపోటములు పట్టించుకోకూడదు. తోటి ఆటగాళ్లను గౌరవించడమే ముఖ్యం. అందుకే లైయన్‌కు టీమ్‌ఇండియా తరఫున గుర్తుగా జెర్సీ అందించాం.

భోగ్లే: ట్రోఫీ ఇచ్చినప్పుడు పుజారా, అశ్విన్‌, నువ్వు ఆటగాళ్లందరి వెనకాల నిలిచి ఉన్నారు. అది అనుకోకుండా జరిగిందా లేక యువకుల గెలుపుగా భావించి వారికి ప్రాధాన్యం ఇచ్చారా?
రహానె: ఈ విజయం ఏ ఒక్కరిదీ కాదు. మొత్తం టీమ్‌ఇండియాది. అయితే, యువకుల వల్లే మేం ఆ మ్యాచ్‌ గెలిచి సిరీస్‌ సొంతం చేసుకున్నాం. శార్దూల్‌, సిరాజ్‌, వాషింగ్టన్‌, గిల్‌, నటరాజన్‌, సైని ఇలా ప్రతిఒక్కరూ బాగా ఆడారు. ఒక్కొక్కరు ఒక్కో సెషన్‌లో రాణించారు. ఇది సమష్టి విజయం. 

భోగ్లే: భారత్‌కు తిరిగి వచ్చాక కంగారూ బొమ్మతో ఉన్న కేక్‌ కోసేందుకు ఎందుకు నిరాకరించావు?
రహానె: కంగారూ.. ఆస్ట్రేలియా జాతీయ జంతువు కాబట్టి ఆ కేకు కోయడానికి నిరాకరించా. ప్రత్యర్థిని గౌరవించాలి. మనం విజయం సాధించినా, చరిత్ర సృష్టించినా అవతలి వారికి మర్యాద ఇవ్వాలి. ఇతర దేశాల పట్ల గౌరవంతో ఉండాలి. ఇతర జట్లకు మర్యాద ఇవ్వాలి. అందుకే ఆ కేకు కోయలేదు.

భోగ్లే: ఇకపై కెప్టెన్‌ కాదనే భావన ఎలా ఉంది? కోహ్లీ వచ్చాడు.. కెప్టెన్సీ భారం తొలగిందని చెప్పడం సులువేనా?
రహానె: అవును నిజమే. ఆ బాధ్యత అయిపోయింది. ఇప్పుడు నేను కెప్టెన్ కాదు. ఇకపై ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌పైనే నా దృష్టి నెలకొంది. జరిగిందంతా ఒక చరిత్ర. అది గతం. రాబోయే సిరీస్‌ గురించి ఆలోచిస్తూ ముందుకు సాగాలి.  


ఇవీ చదవండి..
కోహ్లీ.. ఈ రికార్డులు కూడా కొట్టేసెయ్‌..!
బాబర్‌ అజామ్‌ను వెనకేసిన పుజారాTags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని