ప్రపంచ క్రికెట్లో ఆధిపత్యపు బాటలో టీమ్‌ఇండియా..

తాజా వార్తలు

Published : 29/03/2021 01:26 IST

ప్రపంచ క్రికెట్లో ఆధిపత్యపు బాటలో టీమ్‌ఇండియా..

దిల్లీ: ప్రపంచ క్రికెట్లో ఆధిపత్యం చెలాయించే దారిలో టీమ్‌ఇండియా సాగుతోందని ఆస్ట్రేలియా దిగ్గజం ఇయాన్‌ ఛాపెల్‌ అన్నారు. విదేశాల్లో జట్లు తడబడుతున్న తరుణంలో భారత్‌ దానిని తిరగరాస్తోందని పేర్కొన్నారు. బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌ సహా అన్ని విభాగాల్లో పటిష్ఠంగా ఉండటమే ఇందుకు కారణమని వెల్లడించారు. ప్రత్యర్థి ఆటగాళ్లు తమకన్నా ఎక్కువ కాదన్న గంగూలీ దారినే ధోనీ అనుసరించాడని అన్నారు. ఐపీఎల్‌, దేశవాళీ క్రికెట్‌ వల్ల యువకులు మెరుగ్గా రాణిస్తున్నారని స్పష్టం చేశాడు.

‘ఆస్ట్రేలియాలో టీమ్‌ఇండియా విజయాలను చూస్తుంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా విజయాలు సాధించగల ఆత్మవిశ్వాసం ఆటగాళ్లలో కనిపిస్తోంది. విదేశాల్లో జట్లు తడబడుతోంటే భారత్‌ మాత్రం దానికి భిన్నంగా సాగుతోంది. కోహ్లీసేన వచ్చిందంటే దూరం నుంచి పరుగెత్తి బంతులేస్తే సరిపోదని ఆతిథ్య జట్లు గమనిస్తున్నాయి. ఒకప్పటి వెస్టిండీస్‌, ఆస్ట్రేలియా తరహాలో ఇప్పుడా జట్టులో ప్రతిభావంతులు అధికంగా ఉంటున్నారు. తుది జట్టులో చోటుకే ఇబ్బంది ఎదురవుతోంది’ అని ఛాపెల్‌ అన్నారు.

విజయాల వెనుక కొన్ని ఓటములు ఎదురవుతున్నా ప్రపంచ క్రికెట్లో టీమ్‌ఇండియా ఆధిపత్యం సాగుతోందని ఇయాన్‌ అభిప్రాయపడ్డారు. భారత దేశవాళీ క్రికెట్‌ వ్యవస్థ అద్భుతంగా ఉందని ప్రశంసించారు. కోహ్లీసేన విజయవంతం అయ్యేందుకు కారణం అదేనని వెల్లడించారు. శుభ్‌మన్‌ గిల్‌, మహ్మద్‌సిరాజ్‌, నవదీప్‌ సైని, వాషింగ్టన్‌ సుందర్‌, నటరాజన్‌, అక్షర్‌ పటేల్‌ వంటి ఆటగాళ్లే ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు.

‘శార్దూల్‌ ఠాకూర్‌ రెండో మ్యాచులోనే అదరగొట్టాడు. రిషభ్‌ పంత్‌ టీ20ల్లోకి రాకముందే అంతర్జాతీయ విజేత. అందరు ఆటగాళ్లు అందుబాటులో ఉన్నా గిల్‌, సిరాజ్‌ చోటు దక్కించుకోగలరు. ఇంగ్లాండ్‌పై ఇషాన్‌ కిషన్‌, ప్రసిద్ధ్‌  కృష్ణ, కృనాల్‌ పాండ్య అరంగేట్రంలోనే అదరగొట్టారు. రాంచీ నుంచి వచ్చిన ఎంఎస్‌ ధోనీ విజయవంతం అవ్వడంతో మారుమూల గ్రామాల్లోని యువకులకు తమపై విశ్వాసం పెరిగింది. ప్రత్యర్థి ఆటగాళ్లతో తాము సమానం అన్న విశ్వాసాన్ని గంగూలీ సారథ్యం క్రికెటర్లలో నింపింది. ధోనీ మార్గనిర్దేశంలో అది మరింత పెరిగింది. కోహ్లీ నాయకత్వంలో అత్యున్నత ప్రేరణగా మారింది’ అని ఇయాన్‌ ఛాపెల్‌ అన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని