అసలు రోహిత్‌కు ఏమైందో చెప్పండి: సన్నీ
close

తాజా వార్తలు

Published : 27/10/2020 17:21 IST

అసలు రోహిత్‌కు ఏమైందో చెప్పండి: సన్నీ

దుబాయ్‌: ముంబయి సారథి రోహిత్‌ శర్మకు ఎలాంటి గాయమైంది? ఎంత తీవ్రమైంది? గాయపడితే అతనెలా నెట్స్‌లో సాధన చేస్తున్నాడు? అతడిని నెట్స్‌లో ఆడించి ప్రత్యర్థులపై మానసిక ప్రయోజనం పొందాలని ముంబయి చూస్తోందా? బాగానే ఉంటే హిట్‌మ్యాన్‌ను టీమ్‌ఇండియాకు ఎందుకు ఎంపిక చేయలేదు? మరి గాయపడ్డ మయాంక్‌ అగర్వాల్‌ను మూడు ఫార్మాట్లలో ఎందుకు ఎంపిక చేశారు? ఆస్ట్రేలియా పర్యటనకు భారత జట్లను ఎంపిక చేసిన తర్వాత సగటు క్రికెట్‌ అభిమానిలో మెదిలిన ప్రశ్నలివి. మాజీ క్రికెటర్‌ సునిల్‌ గావస్కర్‌ సైతం ఇవే సందేహాలను లేవనెత్తారు.

తొడ కండరాల గాయంతో బాధపడుతున్న రోహిత్‌ శర్మ గత రెండు మ్యాచుల్లో ఆడలేదు. కీరన్‌ పొలార్డ్‌ అతడి స్థానంలో బాధ్యతలు తీసుకున్నాడు. అయితే టీమ్‌ఇండియా జట్టును ప్రకటించిన క్షణాల్లోనే రోహిత్‌ ప్యాడ్లు కట్టుకొని నెట్స్‌లో సిక్సర్లు బాదేస్తున్న వీడియో, ఫొటోలను ముంబయి ట్విటర్లో పోస్ట్‌ చేసింది. దాంతో అతడి ఫిట్‌నెస్‌పై, ఆసీస్‌ పర్యటనకు విశ్రాంతినివ్వడంపై గావస్కర్‌ ప్రశ్నించారు. భారత జట్టు అభిమాని ఎవరికైనా అతడి పరిస్థితిని తెలుసుకొనే హక్కుఉందని పేర్కొన్నారు.

‘రోహిత్‌ సాధనకు సంబంధించి ముంబయి ఏం చూపించిందో నేను చూడలేదు. అందుకే అతడికి ఎలాంటి గాయమైందో నాకు తెలియదు. నిజానికి అతడి గాయం తీవ్రమైనదే అయితే అసలు ప్యాడ్లే ధరించకూడదు. ఇక ఆస్ట్రేలియా పర్యటనేమో డిసెంబర్‌లో మొదలవుతుంది. తొలి టెస్టు మ్యాచ్‌ 17న జరుగుతుంది. అంటే కనీసం నెలన్నర సమయం ఉంది. ఇప్పుడు మనకు కావాల్సింది పారదర్శకత. రోహిత్‌ అసలు సమస్యేంటో చెబితే అందరికీ ఉపయోగపడుతుంది. భారతీయ క్రికెట్‌ అభిమానికి ఏం జరిగిందో తెలుసుకొనేందుకు అర్హుడు’ అని సన్నీ అన్నారు.

‘ఫ్రాంచైజీలు పైచేయి సాధించాలనే కోరుకుంటాయని నాకు తెలుసు. ఎందుకంటే వారు గెలవాలనే కోరుకుంటారు. ప్రత్యర్థులకు మానసిక ప్రయోజనం కలగాలని భావించరు. కానీ మేమిక్కడ మాట్లాడుతున్నది భారత జట్టు గురించి. మయాంక్‌ సైతం ఇప్పుడు ఆడటం లేదు. ఈ ఇద్దరు కీలక ఆటగాళ్లకు ఏమైందో తెలుసుకోవాలని అభిమానులు ఆరాటపడుతున్నారు’ అని ఆయన పేర్కొన్నారు.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని