close

భారత్‌ నాకు రెండో ఇల్లు

ప్రపంచకప్‌లో భారతే ఫేవరెట్‌
‘ఈనాడు’తో స్పిన్‌ దిగ్గజం మురళీధరన్‌
ఈనాడు డిజిటల్‌ - హైదరాబాద్‌

తన  స్పిన్‌ మాయాజాలంతో మేటి బ్యాట్స్‌మెన్‌ను సైతం వణికించిన మాంత్రికుడు.. ముత్తయ్య మురళీధరన్‌. ఆదివారం ఓ కార్యక్రమం కోసం హైదరాబాద్‌కు వచ్చిన ఈ దిగ్గజ స్పిన్నర్‌ ‘ఈనాడు’తో మాట్లాడాడు. ఆ విశేషాలు..

ఆట నుంచి వీడ్కోలు తీసుకున్నాక కుటుంబంతో ఎలా గడుపుతున్నారు?
నాకు క్రికెట్‌ కాకుండా వేరే వ్యాపకాలు పెద్దగా లేవు. ఎక్కువ సమయం కుటుంబంతోనే గడుపుతున్నా. వ్యాపారం చూసుకుంటున్నా. భార్య, కొడుకు, కూతురు వీళ్లే నా ప్రపంచం. నా కొడుక్కి క్రికెట్‌ అంటే పిచ్చి. ప్రస్తుతం అండర్‌-13 స్థాయిలో ఆడుతున్నాడు. వాడు ఏ స్థాయి వరకు వస్తాడో చూడాలి.

భారత్‌తో మీ అనుబంధం గురించి చెప్పండి?
భారత్‌కు ఎప్పుడు వచ్చినా ఆనందమే. మా ముత్తాతలు భారతీయులే. నా భార్య స్వస్థలం చెన్నై. భారత్‌ నాకు రెండో ఇళ్లు. ఇక్కడికి రావడానికి నాకు ప్రత్యేకంగా వీసా అవసరం లేదు. హైదరాబాద్‌కు ఎప్పుడు వచ్చినా ఆ అనుభవం ప్రత్యేకమే.

టీమ్‌ఇండియాకు కోచ్‌కు పనిచేసే అవకాశం వస్తే..?
ఆ ఉద్దేశం నాకు లేదు. అయినా భారత్‌లోనే ఎంతో మంది కోచ్‌లు ఉన్నారు. భవిష్యత్‌లో ఏ జట్టుకు కూడా కోచ్‌గా ఉంటానని అనుకోవట్లేదు.

మీతో పాటు సంగక్కర, జయవర్దనె లాంటి దిగ్గజ క్రికెటర్లు సంక్షోభంలో ఉన్న శ్రీలంక జట్టును గట్టెక్కించడానికి ప్రయత్నాలు చేయొచ్చు కదా?
మా జట్టు పేలవమైన ప్రదర్శన చేస్తుంటే బాధగా ఉంది. ఒక స్పిన్నర్‌గా జట్టుకు చాలా చేశా. కానీ పాలనాపరమైన విషయాల్లో నాకు తగినంత అవగాహన లేదు. క్రికెటర్‌ పని క్రికెటర్‌ చేయాలి, పాలకుడి పని పాలకుడు చేయాలి. బోర్డు  పరిపాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలని నేను అనుకోవట్లేదు. మిగతా మాజీ ఆటగాళ్లు ముందుకు వచ్చి ఆ పని చేస్తే సంతోషిస్తా. సంగక్కర, జయవర్దనె ఆటకు వీడ్కోలు పలికాక వాళ్ల స్థానాలను భర్తీ చేసే ఆటగాళ్లను వెతకడంలో బోర్డు విఫలమైంది. జట్టు విషయంలో ప్రణాళికాబద్ధమైన వ్యూహాలతో ముందుకు సాగాలి.

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ల్లో బౌన్సీ, పేస్‌ పిచ్‌లపై మణికట్టు స్పిన్నర్లయిన చాహల్‌, కుల్‌దీప్‌ చక్కటి ప్రదర్శన చేయడంపై మీరేమంటారు?
కొంత కాలంగా చాహల్‌, కుల్‌దీప్‌ బౌలింగ్‌ను గమనిస్తున్నా. వాళ్ల ప్రదర్శన అద్భుతంగా ఉంది. మణికట్టు స్పిన్‌తో బౌలింగ్‌లో వైవిధ్యం తీసుకొస్తున్నారు. ప్రత్యర్థులు ఊహించలేని బంతులతో వికెట్లు పడగొడుతున్నారు. సాధారణ స్పిన్నర్లతో పోలిస్తే మణికట్టు స్పిన్నర్లకు వికెట్లు తీసే సౌలభ్యం ఎక్కువగా ఉంటుంది. అలా కానీ  సాధారణ స్పిన్నర్లు రాణించలేరు అని కాదు. నా దృష్టిలో మాత్రం ఇప్పటికీ అశ్వినే  ప్రపంచలో అత్యుత్తమ స్పిన్నర్‌. అతను ఏ దేశంలో ఆడినా వికెట్లు తీయగలడు.

వన్డే ప్రపంచకప్‌లో ఏ జట్టు విజేతగా నిలుస్తుందనుకుంటున్నారు?
కప్పు గెలిచేందుకు టీమ్‌ఇండియాకు మంచి అవకాశాలున్నాయి. బ్యాటింగ్‌, బౌలింగ్‌ రంగాల్లో ఆ జట్టు అద్భుతంగా ఉంది. ఇటీవల విదేశీ సిరీస్‌ల్లో కూడా మంచి ప్రదర్శన కనబరచింది. మరోవైపు సొంత దేశంలో జరిగే ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌ కూడా ట్రోఫీకి గట్టి పోటీదారే.


 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.