close
పాకిస్థాన్‌ ఆటగాళ్లకు హర్భజన్‌ మద్దతు

టీమిండియాతో ఓటమి కారణంగా ట్రోలింగ్‌కు గురైన సర్ఫరాజ్‌ బృందం

లండన్‌: టీమిండియాతో ఓటమికి గురైన పాకిస్థాన్‌ ఆటగాళ్లపై ఆ దేశ అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్‌ చేస్తున్నారు. భారత్‌తో మ్యాచ్‌కు ముందు రాత్రి పాక్‌ ఆటగాళ్లు బయటకు వెళ్లి సరదాగా గడిపారని పెద్దెఎత్తున దుమారం చెలరేగుతోంది. ఈ విషయంపై స్పందించిన ఆ జట్టు యాజమాన్యం.. సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్న వార్తలను ఖండించింది. మ్యాచ్‌కు ముందు రోజు రాత్రి ఆటగాళ్లు ఎక్కడికీ వెళ్లలేదని, వారు హోటల్‌ గదులకే పరిమితమయ్యారని తెలిపింది. అలాగే సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఫొటోలు, వార్తలు ఎప్పటివోనని పేర్కొంది. 

ఇదిలా ఉండగా పాకిస్థాన్‌ జట్టుకు టీమిండియా క్రికెటర్‌ హర్భజన్‌సింగ్‌ మద్దతుగా నిలిచాడు. ‘ఆటగాళ్లకి ఏం కావాలో అది తినేందుకు అనుమతి ఇచ్చారు. అది టీమిండియాతో మ్యాచ్‌లో వారి ప్రదర్శనకు కారణం కాదు. భోజన విషయాన్ని ప్రదర్శనతో పోల్చవద్దు’ అని భజ్జీ వివరించాడు. అలాగే ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ మైఖేల్‌ క్లార్క్‌ పాక్‌ ఆటగాళ్ల ప్రదర్శనపై స్పందించాడు. ‘పనిచేస్తే ఫలితాలొస్తాయి. లేకపోతే రావు. ప్రపంచకప్‌లో ప్రదర్శనపై పాకిస్థాన్‌ ఆత్మపరిశీలన చేసుకోవాలి. కారణం ఏదైనా కానీ వారి స్థాయికి తగ్గ ప్రదర్శన చెయ్యడం లేదు’ అని పేర్కొన్నాడు.

మరోవైపు షోయబ్‌మాలిక్‌ తన భార్య, భారత టెన్నిస్ స్టార్‌ సానియామిర్జాతో పాటు సహచర ఆటగాళ్లు వాహబ్‌ రియాజ్‌, ఇమాముల్‌ హాక్‌లతో కలిసి బయట కనిపించిన ఫొటోలూ వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. దీనిపైనా స్పందించిన హర్భజన్‌.. ‘అది నిజమో కాదో నాకు తెలీదు. కానీ ఫొటోలు వైరల్‌గా మారాయి. ప్రపంచకప్‌ లాంటి ఈవెంట్లలో మరీ ముఖ్యంగా భారత్‌తో మ్యాచ్‌కు ముందు ఇలా వ్యవహరించడం మాత్రం మంచిది కాదు’ అని తెలిపాడు. ఈ మ్యాచ్‌ ఫలితం సర్ఫరాజ్‌ కెప్టెన్సీపై ప్రభావం చూపిస్తుందా అని అడిగితే.. పాకిస్థాన్‌ జట్టు ఇకపై విజయాలు సాధిస్తుందనే నమ్మకం ఉందన్నాడు. ఒకవేళ ఆ జట్టు సెమీస్‌కు చేరకపోతే సర్ఫరాజ్‌ తన బాధ్యతల నుంచి తప్పుకునే అవకాశముందని భజ్జీ స్పష్టంచేశాడు. క్లార్క్‌ మాట్లాడుతూ ‘పాకిస్థాన్‌ క్రికెట్‌ను నేను ఎక్కువగా గమనించను. కానీ ఒక జట్టు ఓడిపోతే కెప్టెన్‌ తప్పకుండా బాధ్యత వహించాల్సి ఉంటుంది’ అని చెప్పుకొచ్చాడు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.