close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Comments
ఫటాఫట్‌..ధనాధన్‌

మహిళల టీ20 ప్రపంచకప్‌ నేటి నుంచే
ఆరంభ పోరులో ఆస్ట్రేలియాతో భారత్‌ ఢీ
మధ్యాహ్నం 1.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌, డీడీల్లో

క్రికెట్‌ ప్రేమికులకు  మరో ధనాధన్‌ వినోదం!  టీ20 ప్రపంచకప్‌ వచ్చేసింది. అయితే ఈసారి మెరుపులు మెరిపించేది అమ్మాయిలు. పది జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి ఆడుతున్న టోర్నీకి నేడే ఆరంభం. టోర్నీపై ఎప్పుడూ లేనంత ఆసక్తి ఉంది ఈసారి. ఇప్పటిదాకా మూడు జట్లే ప్రపంచకప్‌ను ముద్దాడగా ఇప్పుడు ఇతర జట్లూ గట్టి పోటీకి సిద్ధమవుతున్నాయి. మరి ఈసారి కొత్త ఛాంపియన్‌ అవతరిస్తుందా? మళ్లీ పాత జట్టే గెలుస్తుందా? ఎప్పుడూ కప్పెరగని భారత్‌ ఈసారి భారీ ఆశలతోనే బరిలోకి దిగుతోంది. భారీ అంచనాల మధ్య హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ నేతృత్వంలోని యువ జట్టు కప్పు వేటకు సిద్ధమైంది. టోర్నీ తొలి మ్యాచ్‌లో శుక్రవారం డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాను ఢీకొంటుంది.

సిడ్నీ

తొలిసారి ఓ ఐసీసీ ట్రోఫీని అందుకోవాలని ఉవ్విళ్లూరుతున్న భారత మహిళల జట్టు ఆ దిశగా తొలి పోరాటానికి సన్నద్ధమైంది. శుక్రవారం మహిళల టీ20 ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌ (గ్రూప్‌-ఎ) లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాను ఢీకొంటుంది. జరిగిన ఆరు ప్రపంచకప్పుల్లో నాలుగు నెగ్గిన ఆసీస్‌ మరోసారి ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. భారత్‌ మూడుసార్లు సెమీఫైనల్‌ చేరినా.. మరో అడుగు ముందుకేయలేకపోయింది. కానీ ఈసారి మాత్రం ఎన్నో ఆశలు పెట్టుకుంది.

నిలకడ లేమే భారత్‌ సమస్య
యువ క్రీడాకారిణులు ఎక్కువగా ఉండడం భారత్‌కు కలిసొచ్చే అంశం. సగటు వయసు 22.8 సంవత్సరాలు మాత్రమే. అయితే దుర్భేద్యంగా ఉన్న ఆస్ట్రేలియాను దెబ్బతీయాలంటే గొప్ప ప్రదర్శన చేయాల్సిందే. అస్థిరతే భారత్‌కు పెద్ద సమస్య. ఇటీవల ఆస్ట్రేలియాలో ముగిసిన ముక్కోణపు సిరీసే అందుకు పెద్ద ఉదాహరణ. బలమైన ఇంగ్లాండ్‌, ఆసీస్‌లపై ఒక్కో మ్యాచ్‌లో ఓడి, ఒక్కో మ్యాచ్‌ గెలిచిన భారత్‌.. ఫైనల్లో ఆసీస్‌ చేతిలో పరాజయంపాలైంది. మిడిల్‌ ఆర్డర్‌ తరచుగా కుప్పకూలుతుండడం భారత్‌ను కలవరపెడుతోంది. ప్రపంచకప్‌లో ఆసీస్‌ లాంటి బలమైన జట్టును ఓడించాలంటే మిడిల్‌ చాలా మెరుగైన ప్రదర్శన చేయాలి. టోర్నీలో భారత్‌ మెరుగైన ఫలితాలు సాధించాలంటే మంధానతో కలిసి 16 ఏళ్ల షెఫాలీ వర్మ మంచి ఆరంభాలివ్వడం చాలా అవసరం. మంధాన మంచి ఫామ్‌లో ఉంది. ఇటీవల ముక్కోణపు సిరీస్‌లో 5 ఇన్నింగ్స్‌ల్లో 136.7 స్ట్రైక్‌రేట్‌తో 216 పరుగులు చేసింది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌పైనా చాలా అంచనాలే ఉన్నాయి. ఇక బౌలింగ్‌లో భారమంతా రాజేశ్వరీ గైక్వాడ్‌ నేతృత్వంలోని స్పిన్‌ దళంపైనే. పేస్‌ విభాగంలో తెలుగమ్మాయి అరుంధతి రెడ్డి ఎలా ఆడుతుందో చూడాలి.

 

ఆస్ట్రేలియాపై ఒత్తిడి ఉన్నా...
సొంతగడ్డపై ఆడుతుండడంతో ఆస్ట్రేలియాపై అంచనాల ఒత్తిడి ఉంది. కానీ ఏకంగా అయిదు సార్లు ప్రపంచకప్‌ ఫైనల్‌ చేరిన కంగారూల జట్టు ఆ ఒత్తిడిని తట్టుకోగలదు. అన్ని రంగాల్లోనూ పటిష్టంగా ఉన్న ఆసీస్‌ స్పష్టమైన ఫేవరెట్‌గా పోరుకు సిద్ధమైంది. మాథ్యూ మాట్‌, ఎలిస్‌ పెర్రీ రూపంలో పదునైన పేస్‌ బౌలర్‌ ఆ జట్టులో ఉన్నారు. మెగాన్‌ స్కట్‌, జెస్‌ జొనాసెన్‌లు బ్యాట్‌తో విధ్వంసం సృష్టించగలరు. వాళ్లతో పాటు అలిసా హీలీ, బెత్‌మూనీ, లానింగ్‌లతో ఆసీస్‌ బ్యాటింగ్‌ బలంగా కనిపిస్తోంది. మంచి స్పిన్నర్లు కూడా ఆసీస్‌కు ఉన్నారు. ఎలిస్‌ పెర్రీ ఆల్‌రౌండ్‌ సామర్థ్యంలో ఆ జట్టుకు పెద్ద బలం.

జట్లు... భారత్‌: తానియా భాటియా, హర్లీన్‌ డియోల్‌, రాజేశ్వర్‌ గైక్వాడ్‌, రీచా ఘోశ్‌, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, వేద కృష్ణమూర్తి, స్మృతి మంధాన, శిఖ పాండే, అరుంధతి రెడ్డి, జెమిమా రోడ్రిగ్స్‌, దీప్తి శర్మ, పూజ వస్త్రాకర్‌, షెఫాలీ వర్మ, పూనమ్‌, రాధా యాదవ్‌.
ఆస్ట్రేలియా: ఎరిన్‌ బర్న్స్‌, నికోలా కేరీ, ఆష్లీ గాడ్నర్‌, రేచల్‌ హేన్స్‌, అలిసా హీలీ, జెస్‌ జొనాసెన్‌, డెలిసా కిమ్మిన్స్‌, మెగ్‌ లానింగ్‌, సోఫీ మొలినెక్స్‌, బెత్‌ మూనీ, ఎలిస్‌ పెర్రీ, మెగాన్‌ స్కట్‌, అనాబెల్‌ సదర్లాండ్‌, తాల్యా వ్లామ్నిక్‌, జార్జియా హరెహామ్‌.

ఇదీ ఫార్మాట్‌

మొత్తం 10 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్‌-ఎలో భారత్‌, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్‌, శ్రీలంక... గ్రూప్‌-బిలో ఇంగ్లాండ్‌, పాకిస్థాన్‌, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌ థాయ్‌లాండ్‌ జట్లు ఉన్నాయి. గ్రూపులో ప్రతి జట్టు.. మిగతా జట్లతో ఒక్కోసారి తలపడుతుంది. ఒక్కో గ్రూప్‌ నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన రెండేసి జట్లు సెమీఫైనల్‌కు చేరుకుంటాయి.


5-13

పొట్టి క్రికెట్లో భారత్‌పై ఆస్ట్రేలియాకే మెరుగైన రికార్డుంది. ఇప్పటివరకు రెండు జట్లు 18 సార్లు తలపడగా భారత్‌ కేవలం అయిదు మ్యాచ్‌ల్లో గెలిచింది. ఆస్ట్రేలియా 13 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.


ఫేవరెట్‌ఎవరు?

నాలుగుసార్లు ప్రపంచకప్‌ గెలిచిన ఆస్ట్రేలియా స్పష్టమైన ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఇటీవలే ముక్కోణపు సిరీస్‌ గెలిచి జోరు మీదుంది. 2019లో ఆడిన 14 టీ20ల్లో ఆసీస్‌ రెండు మాత్రమే ఓడిపోయింది. తన గత 31 టీ20ల్లో ఆ జట్టు 26 గెలిచింది. ఇంగ్లాండ్‌, భారత్‌, న్యూజిలాండ్‌ కూడా గట్టిగానే పోటీలో ఉన్నాయి. 


ఆస్ట్రేలియా

అత్యుత్తమ ప్రదర్శన: నాలుగు సార్లు విజేత (2010, 2012, 2014, 2018)
కీలక క్రికెటర్లు: ఎలీసా హీలీ, బెత్‌ మూనీ, మెగ్‌ లానింగ్‌, టేల వ్లామింక్‌, జెస్‌ జొనాసెన్‌, పెర్రీ
అంచనా: ఫైనల్‌
* టీ20 ప్రపంచకప్‌ల్లో ఇప్పటివరకూ ఆస్ట్రేలియా 32 మ్యాచ్‌ల్లో 24 విజయాలు సాధించింది.


ఇంగ్లాండ్‌

అత్యుత్తమ ప్రదర్శన: విజేత (2009)
కీలక క్రికెటర్లు: హీథర్‌ నైట్‌, డానీ వ్యాట్‌, సీవర్‌, లీసా, బ్రంట్‌
అంచనా: సెమీస్‌
* ప్రపంచకప్‌ల్లో 29 మ్యాచ్‌ల్లో 21 విజయాలు నమోదు చేసింది.


వెస్టిండీస్‌

అత్యుత్తమ ప్రదర్శన: విజేత (2016)
కీలక క్రికెటర్లు:  స్టెఫానీ టేలర్‌, డాటిన్‌, హేలీ మాథ్యూస్‌, ఎలీన్‌
అంచనా: సెమీస్‌
* ప్రపంచకప్‌ల్లో 27 మ్యాచ్‌లాడిన విండీస్‌ 17 సార్లు గెలిచింది.


శ్రీలంక

అత్యుత్తమ ప్రదర్శన:  తొలి రౌండ్‌
కీలక క్రికెటర్లు: చమరి ఆటపట్టు, శశికళ, హాసిని పెరీరా
అంచనా: గ్రూప్‌ దశ
* ప్రపంచకప్‌ల్లో 23 మ్యాచ్‌ల్లో 7 విజయాలు


బంగ్లాదేశ్‌

అత్యుత్తమ ప్రదర్శన:  తొలి రౌండ్‌
కీలక క్రికెటర్లు: నిగర్‌ సుల్తానా, రుమాన అహ్మద్‌, నహిద అక్తర్‌, రితు మోని
అంచనా: గ్రూప్‌ దశ
* ప్రపంచకప్‌ల్లో 13 మ్యాచ్‌ల్లో రెండు విజయాలు


భారత్‌

అత్యుత్తమ ప్రదర్శన: సెమీస్‌ (2009, 2010, 2018)
కీలక క్రికెటర్లు:  హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌, స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్‌, దీప్తిశర్మ
అంచనా: ఫైనల్‌
* టీ20 ప్రపంచకప్‌ల్లో 26 మ్యాచ్‌ల్లో భారత్‌ 13 విజయాలు సాధించింది.


న్యూజిలాండ్‌

అత్యుత్తమ ప్రదర్శన: రన్నరప్‌ (2009, 2010)
కీలక క్రికెటర్లు: సుజీ బేట్స్‌, సోఫీ డెవిన్‌, లీ తహుహు, ఎమీలియా కెర్‌
అంచనా: సెమీస్‌
* ప్రపంచకప్‌లో 28 మ్యాచ్‌లాడిన కివీస్‌ 20 విజయాలు సాధించింది.


దక్షిణాఫ్రికా

అత్యుత్తమ ప్రదర్శన:  సెమీస్‌ (2014)
కీలక క్రికెటర్లు: డేన్‌ వాన్‌ నికెర్క్‌, షబ్నీమ్‌ ఇస్మాయిల్‌, మరిజానె, సునె లుస్‌
అంచనా: గ్రూప్‌ దశ
* ప్రపంచకప్‌ల్లో 23 మ్యాచ్‌ల్లో సఫారీ జట్టు 8 విజయాలే సాధించింది.


పాకిస్థాన్‌

అత్యుత్తమ ప్రదర్శన: తొలి రౌండ్‌
కీలక క్రికెటర్లు: జవేరియా ఖాన్‌, అయేషా నసీమ్‌, అరూబా షా
అంచనా: గ్రూప్‌ దశ
* ప్రపంచకప్‌లో 24 మ్యాచ్‌ల్లో 6 విజయాలు


థాయ్‌లాండ్‌

కీలక క్రికెటర్లు: సోర్‌నరిన్‌ టిపోచ్‌, నటాయా, నత్తాకన్‌
అంచనా:  గ్రూప్‌ దశ
థాయ్‌లాండ్‌ తొలిసారి ఈ ప్రపంచకప్‌ బరిలో దిగుతోంది.


1

‘‘జట్టు మెరుగ్గా రాణించాలంటే అందరూ మెరుగైన ప్రదర్శన చేయాలి. మ్యాచ్‌లు గెలవడానికి ఒకరు లేదా ఇద్దరి మీద ఆధారపడొద్దని గత టోర్నీల ద్వారా తెలుసుకున్నాం. ప్రపంచకప్‌ లాంటి పెద్ద టోర్నీలు గెలవాలంటే జట్టు సమష్టిగా రాణించాలి’’

- హర్మన్‌ప్రీత్‌ కౌర్‌

 


‘‘ఆస్ట్రేలియానే ఫేవరెట్‌. కానీ భారత్‌ను తేలిగ్గా తీసేయలేం. భారత జట్టులో ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉన్నారు. మ్యాచ్‌ రోజు ఎవరు బాగా ఆడితే వాళ్లు గెలుస్తారు. అయితే టీ20లో ఆసీస్‌కు మెరుగైన రికార్డు ఉంది. తొలి మ్యాచ్‌లో ఆ జట్టుకే గెలిచే అవకాశాలెక్కువ’’

- మిథాలీరాజ్‌

 


ఇప్పటి వరకూ ట్రోఫీ గెలిచిన జట్లు
ఇంగ్లాండ్‌ (2009)
ఆస్ట్రేలియా (2010, 2012, 2014, 2018)
వెస్టిండీస్‌ (2016)


ప్రపంచకప్‌ల్లో అత్యధికం
సుజీ బేట్స్‌ (న్యూజిలాండ్‌)- 28 మ్యాచ్‌ల్లో 881 పరుగులు
పెర్రీ (ఆస్ట్రేలియా)- 32 మ్యాచ్‌ల్లో 36 వికెట్లు


 

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.