close

ప్రధానాంశాలు

Updated : 04/03/2021 02:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కొడితే లార్డ్స్‌కే..

ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌పై భారత్‌ కన్ను

గెలిచినా.. డ్రా చేసుకున్నా ముందంజే
ఇంగ్లాండ్‌తో చివరి టెస్టు నేటి నుంచే
ఉదయం 9.30 నుంచి

అహ్మదాబాద్‌

పిచ్‌ చర్చలకు ఇక తెరదించాల్సిందే.. వాదోపవాదాలకు ఇక విరామం ఇవ్వాల్సిందే.. ఊహాగానాలకు ఇక సెలవివ్వాల్సిందే! ఎందుకంటే మొతేరాలో మళ్లీ ఆట మొదలు కాబోతోంది. రెండు రోజుల్లో మూడో టెస్టు ముగిసిపోయిన అదే వేదికలో గురువారం నుంచి భారత్‌, ఇంగ్లాండ్‌ చివరి టెస్టులో తలపడబోతున్నాయి. గత టెస్టులా ఇది డేనైట్‌ టెస్టు కాదు కాబట్టి మ్యాచ్‌ రెండు మూడు రోజుల్లో ముగిసిపోతుందన్న అంచనాలేమీ లేవు. కానీ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ బెర్తు ఊరిస్తున్న నేపథ్యంలో ఇంగ్లిష్‌ జట్టును భారత్‌ మరోసారి స్పిన్‌ పిచ్‌తో దెబ్బ కొట్టాలనే చూడొచ్చు. ఈ మ్యాచ్‌ను కోహ్లీసేన డ్రా చేసుకున్నా డబ్ల్యూటీసీ ఫైనల్‌ కోసం లార్డ్స్‌లో అడుగు పెడుతుంది.

భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య ఆఖరి టెస్టు సమరానికి రంగం సిద్ధమైంది. వారం కిందట స్పిన్నర్ల అసాధారణ ఆధిపత్యంతో రెండు రోజుల్లోనే మ్యాచ్‌ ముగిసిన మొతేరా మైదానంలోనే చివరిదైన నాలుగో టెస్టులో తలపడబోతున్నాయి ఈ రెండు జట్లూ. ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో ఉన్న భారత్‌.. ఈ మ్యాచ్‌ గెలిచినా, డ్రా చేసుకున్నా సిరీస్‌ సొంతమవుతంది. దాంతో పాటు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ బెర్తు బోనస్‌గా దక్కుతుంది. టీమ్‌ఇండియా ఓడితే ఆస్ట్రేలియా తుది పోరుకు అర్హత సాధిస్తుంది. ఒక బెర్తును న్యూజిలాండ్‌ ఇప్పటికే సొంతం చేసుకుంది. జూన్‌లో లార్డ్స్‌ వేదికగా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ జరగనుంది. అయితే ఇంగ్లాండ్‌తో చివరి మ్యాచ్‌ను గెలిచి ఛాంపియన్‌షిప్‌ పట్టికలో అగ్రస్థానంతో ఫైనల్‌లో అడుగు పెట్టాలని కోహ్లీసేన కోరుకుంటోంది. నాలుగో టెస్టుకూ స్పిన్‌ పిచ్‌నే సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కానీ పరుగులు చేయడం కష్టమేమీ కాదట.

ముగ్గురు స్పిన్నర్లతోనే..: సిరీస్‌లో ఆఖరి టెస్టుకు భారత్‌ ఒక మార్పుతో బరిలోకి దిగనుంది. బుమ్రా వ్యక్తిగత కారణాలతో తప్పుకోవడంతో అతడి స్థానంలోకి ఉమేశ్‌ను తీసుకునే అవకాశముంది. సిరాజ్‌ కూడా పోటీలో ఉన్నప్పటికీ.. అనుభవం రీత్యా ఉమేశ్‌కే అవకాశం దక్కొచ్చు. మరోసారి భారత్‌ ముగ్గురు స్పిన్నర్లతోనే బరిలోకి దిగడం ఖాయం. గత మ్యాచ్‌లో ఎక్కువగా బౌలింగ్‌ చేయకున్నా.. సుందర్‌ ఈ మ్యాచ్‌లోనూ కొనసాగనున్నాడు. పిచ్‌ స్పిన్‌కే అనుకూలమంటున్న నేపథ్యంలో అక్షర్‌, అశ్విన్‌లపై భారీ అంచనాలున్నాయి. బ్యాటింగ్‌ విషయానికొస్తే.. మూడో టెస్టులో భారత ఆటగాళ్లు సైతం బాగా ఇబ్బంది పడ్డారు. ఇంగ్లాండ్‌ ఇద్దరు నాణ్యమైన స్పిన్నర్లతో బరిలోకి దిగనున్న నేపథ్యంలో భారత బ్యాట్స్‌మెన్‌ జాగ్రత్తగా ఆడాల్సిందే. శతకం కోసం ఏడాదికి పైగా సాగుతున్న నిరీక్షణకు కోహ్లి ఈ మ్యాచ్‌లోనైనా తెరదించుతాడేమో చూడాలి. రోహిత్‌ జోరు కొనసాగించాలని జట్టు కోరుకుంటోంది. గిల్‌ పెద్ద ఇన్నింగ్స్‌ బాకీ పడ్డాడు. పుజారా, రహానె నిలకడ అందుకోవాల్సి ఉంది.

ఇంగ్లాండ్‌ లొంగుతుందా?: వరుసగా రెండు టెస్టుల్లో ఘోర పరాజయాలు చవిచూసిన ఇంగ్లాండ్‌.. సిరీస్‌ ఓటమి తప్పించుకునేందుకు చివరి టెస్టులో పట్టుదల ప్రదర్శించొచ్చు. మొతేరా పిచ్‌ ఈసారి మరీ కఠినంగా ఉండకపోవచ్చన్న అంచనాల నేపథ్యంలో ఇంగ్లిష్‌ బ్యాట్స్‌మెన్‌ ఓపిగ్గా క్రీజులో కుదురుకునేందుకు ప్రయత్నించొచ్చు. ఇక రూట్‌ స్పిన్‌ ఆడటంలో తన నైపుణ్యాన్ని ఈ మ్యాచ్‌లో చూపిస్తాడని, సహచరులకు దిశా నిర్దేశం చేస్తాడని జట్టు ఆశిస్తోంది. గత మ్యాచ్‌కు ఒకే స్పిన్నర్‌ను ఎంచుకుని తప్పు చేసిన ఇంగ్లాండ్‌.. ఈ మ్యాచ్‌లో లీచ్‌కు తోడుగా బెస్‌ను దించబోతోంది. బెయిర్‌స్టో, స్టోక్స్‌ లాంటి అనుభవజ్ఞుల నుంచి ఇంగ్లాండ్‌ పెద్ద ఇన్నింగ్స్‌లు ఆశిస్తోంది.

స్పిన్‌ పిచ్‌లపైనే ఎప్పుడూ చర్చలెందుకు? ఓ టెస్టు మ్యాచ్‌ను మేం నాలుగో రోజు లేదా అయిదో రోజు గెలిస్తే ఎవరూ ఏమీ అనరు. రెండు రోజుల్లో గెలిస్తే మాత్రం మళ్లీ స్పిన్‌ పిచ్‌ గురించి మాట్లాడతారు. న్యూజిలాండ్‌లో మేం మూడో రోజే ఓడిపోయాం. అప్పుడెవరూ పిచ్‌ గురించి మాట్లాడలేదు. అప్పుడు చర్చ భారత్‌ ఎంత పేలవంగా ఆడిందన్న దాని గురించే. పిచ్‌లను ఎవరూ విమర్శించలేదు. పిచ్‌పై ఎంత పచ్చిక ఉందో, పిచ్‌ ఎంత   విపరీతంగా స్వింగ్‌కు సహకరించిందో ఎవరూ  చెప్పలేదు. టెస్టుల్లో డిఫెన్స్‌ చాలా ముఖ్యం.   పరిమిత ఓవర్ల క్రికెట్‌ ప్రభావం వల్ల టెస్టుల్లో ఆటగాళ్ల డిఫెన్స్‌ దెబ్బతింటోంది. స్పిన్‌ పిచ్‌లపై ఆడాలంటే నైపుణ్యం ఉండాలి. స్వీప్‌ షాట్‌ ఆడడమొక్కటే సరిపోదు. ఎలా ఆడాలన్నది ప్రతి ఒక్కరూ సొంతంగా ఆలోచించుకోవాలి. డిఫెన్సివ్‌ షాటే నా దృష్టిలో ఉత్తమ పరిష్కారం. ఇప్పుడు లోపిస్తున్నది అదే.

- విరాట్‌ కోహ్లి

ఈ పిచ్‌ మూడో టెస్టు పిచ్‌లాగే ఉంది.  గత రెండు టెస్టుల్లో చాలా పాఠాలు నేర్చుకున్నాం. ఈసారి భారీ భాగస్వామ్యాలు   నెలకొల్పడంపై దృష్టిపెడతాం.

- జో రూట్‌

* భారత్‌కిది 550వ టెస్టు. ఇంగ్లాండ్‌ (1033), ఆస్ట్రేలియా (834), వెస్టిండీస్‌ (552) తర్వాత ఈ మార్కును అందుకోనున్న జట్టు భారతే.
6 టెస్టుల్లో ఇంగ్లాండ్‌పై అత్యధిక వికెట్లు సాధించిన భారత బౌలర్‌గా నిలవడానికి అశ్విన్‌కు అవసరమైన వికెట్లు. ప్రస్తుతం బిషన్‌ సింగ్‌ బేడి, కపిల్‌ దేవ్‌ తలో 85 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నారు.
17 టెస్టుల్లో 12వేల మైలురాయిని అందుకోడానికి విరాట్‌కు అవసరమైన పరుగులు.
60 ప్రస్తుత మ్యాచ్‌తో కలిపి కెప్టెన్‌గా కోహ్లి టెస్టుల సంఖ్య. భారత కెప్టెన్‌గా అత్యధిక మ్యాచ్‌లాడిన ధోనిని సమం చేయబోతున్నాడు.
603 అంతర్జాతీయ క్రికెట్లో ప్రస్తుతం అశ్విన్‌ వికెట్లు. మరో ఏడుగురిని ఔట్‌ చేస్తే.. అనిల్‌ కుంబ్లే (956), హర్భజన్‌ సింగ్‌ (711), కపిల్‌ దేవ్‌ (687)ల తర్వాత నాలుగో స్థానంలో ఉన్న జహీర్‌ ఖాన్‌ (610)ను సమం చేస్తాడు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన