యూఏఈలో.. అక్టోబరు17 నుంచి!
Array ( [0] => stdClass Object ( [video_type] => 1 [video_short_link] => 9AWpufoY8KY ) ) 1

ప్రధానాంశాలు

Updated : 27/06/2021 09:01 IST

యూఏఈలో.. అక్టోబరు17 నుంచి!

టీ20 ప్రపంచకప్‌పై స్పష్టత
తరలింపు తథ్యమన్న బీసీసీఐ కార్యదర్శి

ముంబయి: అనుకున్నట్లే టీ20 ప్రపంచకప్‌ భారత్‌ నుంచి తరలిపోనుంది. టోర్నీ జరగాల్సిన అక్టోబరు-నవంబరు నెలల్లో దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం ఎలా ఉంటుందో అంచనా వేయలేని స్థితిలో పొట్టి కప్పును యూఏఈకి తరలించడానికే బీసీసీఐ మొగ్గు చూపుతోంది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జై షా స్పష్టతనిచ్చాడు. ‘‘దేశంలో కరోనా దృష్ట్యా టీ20 ప్రపంచకప్‌ను యూఏఈకి తరలించాల్సి రావచ్చు. పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నాం. ఆటగాళ్ల భద్రత, ఆరోగ్యం అన్నింటికంటే ముఖ్యమైన అంశాలు. త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటాం’’ అని జై షా మీడియాకు తెలిపాడు.  కొందరు ఆటగాళ్లు కరోనా బారిన పడటంతో మే నెలలో ఐపీఎల్‌ అర్ధంతరంగా ఆగిపోయినపుడే టీ20 ప్రపంచకప్‌ భారత్‌లో జరగడంపై సందేహాలు మొదలయ్యాయి. కరోనా ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతూ పోవడంతో టోర్నీని యూఏఈకి తరలించడం తప్పని అనివార్యత నెలకొంది. గత కొన్ని వారాల్లో వైరస్‌ ప్రభావం తగ్గినప్పటికీ.. అక్టోబరు నాటికి పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేకపోతున్నారు. పైగా కరోనా మూడో దశపై హెచ్చరికలు జారీ అవుతున్నాయి. ఈ సందిగ్ధత కొనసాగుతుండగానే ప్రపంచకప్‌ నిర్వహణపై ఏదో ఒకటి తేల్చాలంటూ ఐసీసీ. బీసీసీఐకి ఇచ్చిన గడువు సమీపిస్తోంది. జూన్‌ నెలాఖరు లోపు బీసీసీఐ నిర్ణయం చెప్పాల్సి ఉండగా.. టోర్నీని తరలించడానికి అంగీకారం చెప్పడం మినహా భారత బోర్డుకు మరో ప్రత్యామ్నాయం కనిపించడం లేదు.
ఐపీఎల్‌ ముగిసిన రెండు రోజులకే..
టీ20 ప్రపంచకప్‌ను అక్టోబరు 17న ఆరంభించాలని ఐసీసీ భావిస్తున్నట్లు సమాచారం.ఈ మెగా టోర్నీ కంటే ముందు యూఏఈలోనే ఐపీఎల్‌ జరగబోతోంది. మధ్యలో ఆగిన ఐపీఎల్‌ను సెప్టెంబరు 19న పునఃప్రారంభించే అవకాశముంది. ఆ టోర్నీ అక్టోబరు 15న ముగుస్తుందని సమాచారం. అంటే ఐపీఎల్‌ ముగిసిన రెండు రోజులకే టీ20 ప్రపంచకప్‌ ఆరంభమవుతుందన్నమాట. టీ20 ప్రపంచకప్‌ తొలి రౌండ్‌లో టాప్‌-8 జట్లు పోటీ పడవు. అవి నేరుగా సూపర్‌-12 మ్యాచ్‌లు ఆడతాయి. టాప్‌-8లో లేని బంగ్లాదేశ్‌, శ్రీలంక, ఐర్లాండ్‌, నెదర్లాండ్స్‌, స్కాట్లాండ్‌, నమీబియా, ఒమన్‌, పపువా న్యూ గినియా తొలి రౌండ్లో తలపడతాయి. వీటిలో నాలుగు సూపర్‌-12 దశకు అర్హత సాధిస్తాయి. తొలి రౌండ్‌ మ్యాచ్‌లను యూఏఈతో పాటు ఒమన్‌లో నిర్వహిస్తారు. ఐపీఎల్‌ జరిగే దుబాయ్‌, అబుదాబి, షార్జా మైదానాల్లో పిచ్‌లకు మళ్లీ మెరుగులు దిద్ది వాటినే సూపర్‌-12 దశ నుంచి టీ20 ప్రపంచకప్‌ కోసం వినియోగిస్తారు. 12 జట్లు రెండు గ్రూప్‌లుగా విడిపోయి రౌండ్‌రాబిన్‌ లీగ్‌ మ్యాచ్‌లు ఆడతాయి. వీటి నుంచి నాలుగు  జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. అక్టోబరు 24న సూపర్‌-12 దశ ఆరంభమవుతుంది. ఫైనల్‌ నవంబరు 14న జరిగే అవకాశముంది.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన