అహో టోక్యో
Array ( ) 1

ప్రధానాంశాలు

Updated : 24/07/2021 02:42 IST

అహో టోక్యో

హృదయాలనంటిన సంబరం

నేటి నుంచి పతకాల వేట

అనుమానాలను పటాపంచలు చేస్తూ.. భయాలను పక్కకుతోస్తూ.. ఆటంకాలను దాటేస్తూ.. ఆశలకు కొత్త దారి వేస్తూ.. ప్రపంచానికి సరికొత్త మార్గం చూపిస్తూ.. అథ్లెట్లకు భరోసా కల్పిస్తూ.. మహమ్మారిపై విజయం సాధించగలమనే నమ్మకాన్నిస్తూ.. టోక్యో ఒలింపిక్స్‌ అట్టహాసంగా ఆరంభమయ్యాయి. కరోనా కారణంగా అసలు జరుగుతాయో లేదో అనే సందిగ్ధ స్థితిని దాటి క్రీడలు ఘనంగా మొదలయ్యాయి. వైరస్‌ పరిస్థితుల మధ్య ఏడో నిరాడంబరంగా సాగుతాయనుకున్న వేడుకలను జపాన్‌ ప్రభుత్వం గొప్పగా నిర్వహించి తన సందేశాన్ని బలంగా వినిపించింది. ప్రతికూల సమయంలోనూ విశ్వ క్రీడలను పకడ్బంధీగా నిర్వహిస్తామనే స్ఫూర్తిని ఎలుగెత్తి చాటింది.

టోక్యో

శుక్రవారం రంగురంగుల బాణాసంచా వెలుగుల్లో జపాన్‌ జాతీయ స్టేడియం మెరిసిపోయింది. కరోనా నిబంధనలను పాటిస్తూనే అన్ని జాగ్రత్తల నడమ.. జపాన్‌ వైభవం, సంస్కృతి, వారసత్వాన్ని తెలిపేలా నిర్వాహకులు టోక్యో ఒలింపిక్స్‌ ఆరంభోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభోత్సవ సంబరం మొదలైంది. విత్తనం చెట్టుగా మారుతున్నట్లు చూపించిన ప్రదర్శన తర్వాత బాణాసంచా మెరుపులతోనే క్రీడల వేడకకు తెరలేచింది. కరోనా కారణంగా చాలా కాలం పాటు ఒలింపిక్స్‌ కోసం అథ్లెట్లు ఎవరి ప్రాంతంలో వాళ్లు ఒంటరిగా సాధన చేసిన సంగతి తెలిసిందే. అలా ప్రాక్టీస్‌ చేసిన అథ్లెట్ల వీడియోను ప్రదర్శించిన తర్వాత.. అథ్లెట్లు ఒంటరి వాళ్లు కాదని వాళ్ల వెనక ప్రపంచం ఉందనే అర్థం వచ్చేలా రూపొందించిన నృత్యరూపకాన్ని కళ్లకు కట్టారు. ‘‘భావోద్వేగాలతో కలిసికట్టుగా (యునైటెడ్‌ బై ఎమోషన్స్‌)’’ అనే టోక్యో ఒలింపిక్స్‌ క్రీడల నినాదాన్ని చాటేలా ఈ ప్రదర్శన సాగింది. అనంతరం జపాన్‌ చక్రవర్తి నారుహితో, అంతర్జాతీయ ఒలంపిక్‌ కమిటీ (ఐఓసీ) అధ్యక్షుడు థామస్‌ బాక్‌ పరిచయ కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత జపాన్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆ పతకాన్ని వేదికపైకి తీసుకొచ్చిన వాళ్లలో యూత్‌, సీనియర్‌ ఒలింపిక్స్‌ ఛాంపియన్లతో పాటు ఆరోగ్య సిబ్బంది కూడా ఉన్నారు. కఠిన సమయాల్లో వాళ్లు చేస్తున్న సేవలకు గాను ఇలా గుర్తింపు దక్కింది. జపాన్‌ ప్రముఖ గాయని మిసియా జాతీయ గీతాన్ని ఆలపించగా ఆ దేశ ఆత్మరక్షణ దళ సభ్యులు జెండాను ఎగరేశారు. భిన్నత్వంలో ఏకత్వం, శాంతి, సంఘీభావాన్ని చాటేలా ఆద్యంతం ఈ వేడుక సాగింది. అథ్లెట్లు, ప్రతినిధులు, కోచ్‌లు ఒలింపిక్‌ ప్రతిజ్ఞ చేసిన తర్వాత చక్రవర్తి నారుహితో క్రీడలు ఆరంభమైనట్లు అధికారికంగా ప్రకటించారు. గత ఒలింపిక్స్‌తో పోలిస్తే ఈ ఆరంభ వేడుకలు సాధారణంగానే సాగినప్పటికీ.. ప్రస్తుత పరిస్థితుల్లో విశ్వ క్రీడల స్ఫూర్తిని మాత్రం చాటాయి.


ఒసాక చేతుల మీదుగా..

జపాన్‌ అగ్రశ్రేణి టెన్నిస్‌ క్రీడాకారిణి ఒసాకా.. ఒలింపిక్స్‌ ఆరంభ  వేడుకలో జ్యోతిని వెలిగించింది. 121 రోజుల పాటు దేశవ్యాప్తంగా ప్రయాణించి టోక్యో చేరుకున్న జ్యోతిని అందుకున్న ఒసాక దాని సాయంతో భారీ జ్వాలను వెలిగించింది. అష్టభుజి పర్వతం ఆకారంలో రెక్కలు విప్పుకున్నట్లున్న జ్యోతి ఆకర్షణగా నిలిచింది. తొలిసారిగా ఈ జ్యోతి హైడ్రోజన్‌తో వెలుగుతోంది. ఇది మండినపుడు కార్బన్‌ డై ఆక్సైడ్‌ విడుదలవదు. 1928 ఆమ్‌స్టర్‌డామ్‌ క్రీడల్లో జ్యోతిని ప్రవేశపెట్టినప్పటి నుంచి దాన్ని మండించేందుకు ప్రొపేన్‌, మెగ్నీషియం, గన్‌పౌడర్‌, ఆలివ్‌ నూనె లాంటివి వాడుతూ వచ్చారు.  


19 మందితో..

ఒలింపిక్స్‌ ఆరంభ వేడుకల కవాతులో భారత బృందంలో 19 మంది అథ్లెట్లు, ఆరుగురు ప్రతినిధులు పాల్గొన్నారు. బాక్సింగ్‌ దిగ్గజం మేరీకోమ్‌, పురుషుల హాకీ కెప్టెన్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌ కలిసి త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని బృందాన్ని ముందుండి నడిపించారు. ఈ ఒలింపిక్స్‌ నుంచే పురుషుల్లో, మహిళల్లో ఒకరి చొప్పున పతాకాధారిగా వ్యవహరించే అవకాశం ఐఓసీ కల్పించింది. ప్రఖ్యాత జపాన్‌ వీడియో గేమ్స్‌ నేపథ్య సంగీతం వినపడుతుండగా వివిధ దేశాల అథ్లెట్ల బృందాలు ఒక్కొక్కటిగా వేదికపైకి వచ్చాయి. ఒలింపిక్స్‌ పుట్టిన గడ్డ అయిన గ్రీస్‌ మొదట వచ్చింది. అనంతరం శరణార్థుల బృందం కవాతులో పాల్గొంది. ఆ తర్వాత జపనీస్‌ అక్షరమాల ప్రకారం దేశాల బృందాలు వరుస క్రమాన్ని అనుసరించాయి. చివరగా ఆతిథ్య దేశం జపాన్‌ అథ్లెట్లు వేదికపైకి వచ్చారు.


అప్పటి చెట్ల నుంచి..

ఆరంభోత్సవ వేడుకలో ప్రదర్శించిన ఒలింపిక్స్‌ రింగులకు ఓ ప్రత్యేకత ఉంది. 1964లో జపాన్‌ తొలిసారిగా ఆతిథ్యమిచ్చిన టోక్యో ఒలింపిక్స్‌ సందర్భంగా అప్పటి క్రీడల్లో పాల్గొన్న అథ్లెట్లు నాటిన వృక్షాల కలప నుంచి ఈ రింగులను తయారు చేయడం విశేషం.

వాళ్లను స్మరించుకుంటూ..: కరోనా మృతులకు వారికి ఆరంభోత్సవం సందర్భంగా నివాళులు అర్పించారు. 1972 మ్యూనిచ్‌ క్రీడల్లో జరిగిన నరమేధంలో బలైన ఇజ్రాయెల్‌ ప్రతినిధులు, 2011 భూకంపం, సునామీ, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో మరణించిన వారికి సంతాపంగా మౌనం పాటించారు.


1824 డ్రోన్లు

ఒలింపిక్స్‌ ఆరంభోత్సవ వేడుక అంటే రంగురంగుల కాంతులు విరజిమ్మడం మామూలే. అయితే టోక్యో క్రీడల్లో మాత్రం డ్రోన్లు అదనపు ఆకర్షణగా నిలిచాయి. 1824 డ్రోన్ల సముదాయం కలిసి ఒలింపిక్‌ స్టేడియంపైనా టోక్యో 2020 లోగోతో పాటు గ్లోబ్‌ 3డీ ఆకారాలను ఆవిష్కరించడం అబ్బురపరిచింది. మరోవైపు పిక్టోగ్రామ్‌ ప్రదర్శనకారులు 50 ఒలింపిక్స్‌ క్రీడాంశాల లోగోలను ప్రదర్శించి ఆకట్టుకున్నారు.


తుపాను తెచ్చింది ఆనందం

తుపాను వస్తుందంటే ఎవరైనా ఆందోళన చెందుతారు కానీ టోక్యోలో సర్ఫింగ్‌లో బరిలో దిగుతున్న క్రీడాకారులు మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు. స్థానిక సురిగాసాకి బీచ్‌లో అలలు తక్కువగా ఉండడంతో తమ ప్రాక్టీస్‌కు కుదరడం లేదని.. అదే తుపాను సమయంలో వచ్చే అలల్లో ప్రాక్టీస్‌ చేస్తే మజా వస్తుందని వాళ్లు అంటున్నారు. వచ్చే వారంలో ఓ టైఫూన్‌ రానుందని వాతావరణ శాఖ వెల్లడించింది. సర్ఫింగ్‌ పోటీలు తొలిసారి జరుగుతున్న సురిగాసాకి బీచ్‌లో అలలు పెద్దగా రావడం లేదని మొదటి నుంచి సర్ఫింగ్‌ క్రీడాకారులు ఆందోళనగా ఉన్నారు. కానీ తుపాను వార్తతో అందరూ హుషారుగా సాధన చేస్తున్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో తొలిసారి సర్ఫింగ్‌ ఆటను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.


మరోసారి అలాగే..

టోంగా దేశ అథ్లెట్‌ పిటా తౌఫాతోఫువా మరోసారి ఒలింపిక్స్‌లో ఆకర్షణగా నిలిచాడు. దుస్తులు లేకుండా శరీరంపై నూనె రాసుకుని తమ సంప్రదాయ వస్త్రాన్ని ధరించిన అతను జాతీయ పతకం చేతపట్టి కవాతులో పాల్గొన్నాడు. 2016 రియో ఒలింపిక్స్‌లోనూ అతడు అలాగే కనిపించాడు. అతి చిన్న దేశమైన టువాలు పతాకధారులు కూడా తమ సంప్రదాయ దుస్తుల్లో ఆకట్టుకున్నారు.


రష్యా కాదు ఆర్‌వోసీ

ఒలింపిక్స్‌ అంటే పతకాల పట్టికలో తొలి మూడు స్థానాల్లో కచ్చితంగా ఉండే దేశం రష్యా. కానీ రష్యా అథ్లెటిక్‌ సంఘంపై డోపింగ్‌ నిషేధం ఉండడంతో రియో ఒలింపిక్స్‌ నుంచి ఆ దేశం సొంత జెండాపై బరిలో దిగలేకపోతోంది. ఈసారి టోక్యో ఒలింపిక్స్‌లోనూ ఆ దేశానిది అదే పరిస్థితి. రష్యా ఒలింపిక్‌ కమిటీ (ఆర్‌వోసీ) పేరుతో పోటీలో నిలిచింది. టోక్యో ఒలింపిక్స్‌లో 328 మంది అథ్లెట్లు ఆర్‌వోసీ పేరిట పోటీపడుతున్నారు.

నిరసనలు..

కరోనా కారణంగా జపాన్‌లో మొదటి నుంచీ ఒలింపిక్స్‌ నిర్వహణను వ్యతిరేకిస్తున్నవారు ఉన్నారు. శుక్రవారం ఆరంభోత్సవం రోజు కూడా నిరసనలు కొనసాగించారు. ఒలింపిక్‌ స్టేడియం బయట వందల మంది గుమిగూడగా.. అందులో కొందరు క్రీడల నిర్వహణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.


చిన్న వయసులోనే..

12 ఏళ్లకే టోక్యో ఒలింపిక్స్‌లో బరిలో దిగుతున్న సిరియా టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి హెండ్‌ జాజా మరో ఘనతను సొంతం చేసుకుంది. అహ్మద్‌తో కలిసి సిరియన్‌ అరబ్‌ రిపబ్లిక్‌ అథ్లెట్ల బృందానికి పతాకధారిగా ఆమె వ్యవహరించింది. అతి పిన్న వయసులోనే ఈ ఘనత సాధించిన అథ్లెట్‌గా నిలిచింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన