విగ్రహాల తొలగింపుపై వివరాలివ్వండి
close

ప్రధానాంశాలు

విగ్రహాల తొలగింపుపై వివరాలివ్వండి

ఈనాడు, హైదరాబాద్‌: అనుమతుల్లేకుండా రోడ్ల పక్కన, కూడళ్లలో ఏర్పాటు చేసిన నేతల విగ్రహాల తొలగింపు వివరాలను సమర్పించాలంటూ ఇటీవల ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఫుట్‌పాత్‌ల వంటి ప్రాంతాల్లో విగ్రహాలు ఏర్పాటు చేయరాదంటూ సుప్రీం కోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చినా అమలవుతున్న దాఖలాలు లేవంది. విగ్రహాలను తొలగించాలని జీవో ఇచ్చి పట్టించుకోకపోవడం వల్ల ప్రయోజనం ఉండదని, దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తీర్పు, ప్రభుత్వ ఉత్తర్వుల అనంతరం ఎన్ని అనధికార విగ్రహాలను తొలగించారో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఇకపై దీన్ని సుమోటో ప్రజాప్రయోజన వ్యాజ్యంగా పరిగణనలోకి తీసుకుంటున్నామంది. ఇందులో రోడ్లు భవనాల శాఖ, పురపాలకశాఖల ముఖ్యకార్యదర్శులతో పాటు జీహెచ్‌ఎంసీని ప్రతివాదులుగా చేర్చుతూ నోటీసులు జారీ చేసింది. రోడ్లపై విగ్రహాల ఏర్పాటుతో ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడుతోందని, వాటిని తొలగించాలంటూ ఆదేశాలివ్వాలంటూ న్యాయవాది ఎం.ఎ.కె.ముఖీద్‌ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లి, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఓ మోస్తరు నాయకుడైతే విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారని, ఇది సరి కాదని వ్యాఖ్యానించిన ధర్మాసనం 2013 నుంచి జీహెచ్‌ఎంసీలో ఎన్ని విగ్రహాలు ఏర్పాటు చేశారు, ఎన్నింటిని తొలగించారో చెప్పాలని ఆదేశిస్తూ సెప్టెంబరు 27వ తేదీకి విచారణను వాయిదా వేసింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని