జైళ్ల శాఖలో పదోన్నతుల సందడి

ప్రధానాంశాలు

జైళ్ల శాఖలో పదోన్నతుల సందడి

ఈ నెలాఖరులోగా పూర్తి చేసేందుకు అధికారుల కసరత్తు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ జైళ్లశాఖలో పదోన్నతుల ప్రక్రియకు సంబంధించిన సందడి నెలకొంది. జైళ్లశాఖ డీజీ రాజీవ్‌ త్రివేది నెలాఖరులో పదవీ విరమణ పొందనుండడంతో ఆలోపే పదోన్నతులతో పాటు కీలక స్థానాల పోస్టింగ్‌లను కొలిక్కి తీసుకురావాలని ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. కీలకమైన జైళ్లశాఖ ఐజీ పోస్టు కోసం డీఐజీలు రాజేశ్‌, మురళీబాబు మధ్య పోటీ నెలకొనగా రాజేశ్‌కు ఖరారు చేస్తూ ఇటీవలే నిర్ణయం తీసుకున్నారు. మిగతావాటిపై శాఖాపరమైన పదోన్నతుల సంఘం(డీపీసీ) ఆమోదం కోసం బుధవారం సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం చంచల్‌గూడ కేంద్ర కారాగారం పర్యవేక్షకుడు శ్రీనివాస్‌కు డీఐజీగా, నల్గొండ జైలు డిప్యూటీ సూపరింటెండెంట్‌ కళాసాగర్‌కు సూపరింటెండెంట్‌గా పదోన్నతి కల్పిస్తూ డీపీసీ ఆమోదముద్ర వేసింది. ఇందుకు సంబంధించిన జీవోలు ఒకట్రెండు రోజుల్లో వెలువడనున్నాయి. ఈ క్రమంలో వీరిద్దరు ప్రస్తుత స్థానాల నుంచి మారాల్సి ఉంటుంది. శ్రీనివాస్‌ను వరంగల్‌ డీఐజీగా నియమించడం లాంఛనం కానుంది. ప్రస్తుతం డీఐజీ హోదాలో ఈ పోస్టు మాత్రమే ఖాళీగా ఉండటం ఇందుకు కారణం. ఇక జైళ్లశాఖలోనే కీలకమైన చంచల్‌గూడ కేంద్ర కారాగారం సూపరింటెండెంట్‌ స్థానంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇందుకోసం వరంగల్‌, చర్లపల్లి కేంద్ర కారాగారాల సూపరింటెండెంట్లు సంతోష్‌కుమార్‌రాయ్‌, శివకుమార్‌గౌడ్‌ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అలాగే కొత్తగా పదోన్నతి పొందిన కళాసాగర్‌కూ సూపరింటెండెంట్‌ స్థాయి పోస్టు ఇవ్వాల్సి ఉంది. పదోన్నతులకు సంబంధించిన జీవోలు వెలువడిన అనంతరం జైళ్లశాఖ డీజీ ఆయా పోస్టింగ్‌లకు సంబంధించిన ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపించనున్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని