close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రంగుల కారం రుచి చూస్తారా?!

భారతీయ వంటల్లో కారం లేని కూరల్ని అస్సలు ఊహించలేం. వెజ్‌, నాన్‌వెజ్‌తో సంబంధం లేకుండా వేపుడు, పులుసు, సాంబారు, నిల్వపచ్చడి... ఇలా వంటేదయినాగానీ అందులో కాస్తయినా కారం వేయాల్సిందే. లేకపోతే అది నోటికి ఎంతమాత్రం సహించదు. అంతగా మన ఆహారంలో కీలకంగా మారిన ఎర్రని కారం, ఇప్పుడు అనేక రంగుల్లో దొరుకుతోంది.

క్యాబేజీ కూరని అదే రంగులో ఉండేలా చేయాలి. సమయానికి ఇంట్లో పచ్చిమిర్చి ఉండకపోవచ్చు. అలాగని కారం వేస్తే అది ఆకుపచ్చగానూ ఎర్రగానూ కాకుండా ఉంటుంది. అదొక్కటే కాదు, ఆకుకూర, బెండ, బీర, పొట్ల, చిక్కుళ్లు, బీన్స్‌... ఆకుపచ్చని కూరలన్నీ ఆకుపచ్చగానే ఉండాలంటే... ఆకుపచ్చని కారమే కావాలి. అదేమాదిరిగా స్వీట్‌కార్న్‌, గుమ్మడి, దోస, వంగ, క్యారెట్‌... వంటి కూరలన్నీ కూడా ఆయా రంగుల్లోనే ఉండాలంటే అదే రంగు కారం వేయాలి. రంగు సంగతి అలా ఉంచితే చికెన్‌, మటన్‌ వంటి కూరలకి కారం వేస్తేనే రుచి వచ్చినట్లు, బీర, సొర కాయ వంటి కూరలకి పచ్చిమిర్చి తగిలితేనే వాటి రుచి పెరుగుతుంది. కానీ మనకి తెలిసినది ఒక్కటే... ఎర్రని ఎండు కారమే. అందులోనే మిర్చి రంగుని బట్టి రకరకాల ఛాయలు ఉంటాయి. అందుకే ఇప్పుడు పచ్చిమిర్చిని ఎండబెట్టి ఆకుపచ్చ రంగు కారాన్నీ కొడుతున్నారు. దీంతోబాటు పసుపు, ఊదా, తెలుపు, కోరా, గులాబీ, నలుపు, పీచ్‌... ఇలా రంగురంగుల్లో కారాన్ని పట్టించేస్తున్నారు.

ఎక్కడిదీ కారం?
మిర్చి స్వస్థలం దక్షిణ అమెరికా... ప్రపంచానికి పరిచయం చేసింది కొలంబస్‌ అయినప్పటికీ ప్రస్తుతం ప్రపంచంలో అందరికన్నా ఎక్కువగా దాన్ని పండించేదీ తినేదీ మనమే. మిరియాల కోసం మనదేశానికి వచ్చిన వాస్కొడిగామా వాటికి బదులుగా మనకి మిరపకాయల రుచి చూపించాడు. అప్పటి వరకూ మనకి కారం అంటే మిరియాలే. డచ్‌వాళ్లు తెచ్చిన చిల్లీ కూడా మిరియాల్లానే ఘాటుగా ఉండటంతో దీన్ని మనవాళ్లు మిరియంపుకాయలు అని పిలిచేవారట. అదే మిరపగా మారింది. పైగా వాటి రుచి మనకి మిరియాల్ని మరిపించేంతగా నచ్చడానికి కారణం లేకపోలేదు. మిరియాలతో పోలిస్తే మిర్చి విరివిగా పండటం, ధర వాటికన్నా బాగా తక్కువగా ఉండటంతో క్రమంగా మిర్చి వాడకానికే మనం అలవాటుపడిపోయాం. అందుకే దేశంలో ఏటా 11 లక్షల టన్నులకి పైగా మిర్చిని పండిస్తూ వాటిల్లో 90 శాతం మనమే తినేస్తున్నాం. అదీ కారం రూపంలోనే వాడకం ఎక్కువ. కొన్ని కూరలకోసం జీలకర్ర, వెల్లుల్లి, దనియాలు కలిపి కొట్టిన కారాలు వాడితే, మాంసాహార వంటకాల్లో ఇవేవీ కలపని కారాన్ని వాడుతుంటాం.

రంగురంగుల కారాలోచ్‌!
మిర్చిలో వేల రకాలున్నాయన్నది తెలిసిందే. కానీ అన్నింటితోనూ కారాలు కొట్టరు. మనదగ్గర ఎక్కువగా గుంటూరు సన్నం, సేలం గుండు, బెంగళూరు మిర్చి, కాశ్మీరీ రెడ్‌ చిల్లీ, శంకేశ్వరీ... వంటి రకాలనే కారానికి వాడతారు. హంగరీ వాసులయితే తియ్యగా ఉండే బెల్‌ పెప్పర్‌ రకాలతో కారాలు తయారుచేస్తారు. దీన్నే ప్యాప్రికా అంటారు. ఎర్రని రంగులోనూ కాస్త తియ్యని రుచితో ఉండే వీటిని సూపుల్లోనూ స్ట్యూల తయారీలోనూ వేస్తుంటారు. అలాగే కశ్మీర్‌లో పండే మిర్చి రంగు ఎంతో ప్రకాశవంతంగానూ తక్కువ కారంతో ఒకలాంటి ఘాటైన రుచితోనూ ఉంటుంది. అందుకే జాతీయ, అంతర్జాతీయ షెఫ్‌లందరూ రంగు కోసం కశ్మీరీ కారాన్నే వాడతారు. అయితే ఇటీవల తినే ఆహారంలో ఎన్ని రంగులు ఉంటే అంత మంచిది అంటుండడంతో రకరకాల రంగుల్లో కాసే అలెప్పో, ఆంచొ, చిపొట్లె, జాలపెనో, న్యూ మెక్సికో, పసియె, అల్డోనా, పిరిపిరి... వంటి మిర్చి రకాలతో రంగుల కారాల్ని తయారుచేస్తున్నారు. వీటిల్లోనూ కొన్ని రకాల మిర్చి మొదట్లో ఆకుపచ్చగా ఉండి తరవాత రకరకాల రంగుల్లోకి మారితే, మరికొన్ని పచ్చిగా ఉన్నప్పుడే రంగుల్లో ఉండి, పండాక ఎరుపు రంగులోకి మారుతుంటాయి. అందుకే నలుపు రంగుకోసం ఆంచె రకాన్ని వాడితే, బుట్‌జొలొకియానీ ట్రినిడాడ్‌ రకాల్నీ సంకరీకరించిన జేస్‌ రకంతో పీచ్‌ రంగు కారాన్ని కొడుతున్నారు. చాకొలెట్‌, తెలుపు రంగుల కారాలకోసం హెబనెరో రకాల్నీ; కెరొలినా రీపర్‌ రకాలతో నారింజా, పండెరుపు రంగుల కారాన్నీ చేస్తే; పింక్‌ టైగర్‌, చార్లెస్టన్‌ రకాలతో లేత గులాబీ; లెమన్‌ డ్రాప్‌, కెయన్‌ రకాలతో పసుపూ, ఎక్స్‌ప్లోజివ్‌ ఎంబర్‌తో ఊదారంగు కారాన్నీ తయారుచేస్తున్నారు.

కారం మంచిదేనా?
తగు మోతాదులో ఉన్నప్పుడు విషమైనా ఔషధమే, ఎక్కువయితే అమృతమైనా విషంగానే పరిణమిస్తుంది అంటారు ఆయుర్వేద నిపుణులు. ఇందుకు కారమూ మినహాయింపు కాదు. పచ్చిమిర్చిలో సి-విటమిన్‌ పుష్కలంగా ఉంటే, పండేకొద్దీ అది తగ్గి విటమిన్‌-ఎ శాతం పెరుగుతుంది. అందుకే అది పచ్చిమిర్చా పండుమిర్చా అన్నది కాసేపు పక్కనబెట్టి మిర్చి లేదా దాంతో చేసే కారంలో విటమిన్‌-సి, ఎ, బి6లతోబాటు పొటాషియం, మెగ్నీషియం, ఐరన్‌ వంటి ఖనిజాలూ సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా కారం రుచికి కారణమైన క్యాప్సైసిన్‌, అద్భుతమైన యాంటీఆక్సిడెంట్‌ కూడా. ఇది రోగనిరోధకశక్తిని పెంచడంతోబాటు మనిషికి ఉత్సాహాన్నిస్తుంది. జీవక్రియని పెంచడం ద్వారా కొవ్వుని కరిగిస్తుంది, బరువు పెరగకుండా చేస్తుంది.

రక్తనాళాల్లోని పూడికల్ని తొలగించడం ద్వారా గుండెజబ్బుల్నీ నిరోధిస్తుంది. ఊపిరితిత్తుల్నీ శుభ్రపరుస్తుంది. అందుకే కఫంతో జలుబుతో బాధపడేవాళ్లు కారం ఎక్కువగా ఉన్నవి తింటే ఆ ఘాటుకి ముక్కూ గొంతూ కూడా శుభ్రపడుతుంది. ఈ క్యాప్సైసిన్‌ డిప్రెషన్‌ని తగ్గించి, మెదడులో ఎండార్ఫిన్లు విడుదల చేయడం ద్వారా ఆనందాన్ని కలిగిస్తుంది. ఫ్లూ, హే ఫీవర్‌ వంటి వైరస్సుల్నీ అడ్డుకుంటుంది. పొట్టలో జీర్ణరసాలు స్రవించేలా చేయడంతో హానికర బ్యాక్టీరియా పెరగకుండా చూస్తుంది. అరుచినీ, అజీర్తినీ తగ్గిస్తుంది. అనాల్జెసిక్‌గా పనిచేస్తూ కీళ్లనొప్పుల్నీ తగ్గిస్తుంది. అందుకే క్యాప్సైసిన్‌ను నొప్పిని తగ్గించే ఆయింట్‌మెంట్లూ బామ్స్‌లో కూడా వాడుతుంటారు. వెనకటి రోజుల్లో ఎముకలు విరిగినప్పుడు కారంతోనే కట్టు వేసేవారట. మిర్చి వృద్ధాప్యాన్నీ ప్రొస్టేట్‌ క్యాన్సర్‌నూ అడ్డుకుంటుందని అనేక పరిశోధనల్లోనూ తేలింది.
ఊపిరితిత్తుల క్యాన్సర్‌ సోకిన వాళ్లలో ఆయా క్యాన్సర్‌ కణాలు విచ్చలవిడిగా పెరగకుండా నిరోధించే శక్తి మిర్చిలోని క్యాప్సైసిన్‌కి ఉందన్నది మార్షల్‌ విశ్వవిద్యాలయ నిపుణుల తాజా పరిశోధన. పైగా కారంలోని ఐరన్‌ వల్ల హీమోగ్లోబిన్‌ శాతం కూడా పెరుగుతుంది. కాబట్టి, ఇన్ని సుగుణాలు ఉన్న కారాన్ని తగు మోతాదులో నిశ్చింతగా వాడుకోవచ్చు. అందులోని రంగుల్నీ హాయిగా ఆస్వాదించవచ్చు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు