close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఈ రికార్డులు ఎప్పటికీ...

డాన్‌ 99.4

రికార్డులున్నవే బద్దలయ్యేందుకు. కానీ క్రికెట్‌ చరిత్రలో మేటి బ్యాట్స్‌మన్‌ అయిన డాన్‌ బ్రాడ్‌మన్‌ను అందుకోవడం ఎవరివల్లా సాధ్యం కాదంటే అతిశయోక్తి కాదు.  టెస్టు క్రికెట్లో ఓ బ్యాట్స్‌మన్‌ సగటు 50 దాటితేనే గొప్ప విషయం. అలాంటిది 99.4 సగటుతో 6996 పరుగులు చేసి ఏకంగా 12 డబుల్‌ సెంచరీలు కొట్టాడు. డాన్‌ తన చివరి ఇన్నింగ్స్‌లో డకౌటయ్యాడు. కనీసం నాలుగు పరుగులు చేసినా 100 సగటు సాధించేవాడే. అత్యధిక సగటు కలిగిన బ్యాట్స్‌మెన్‌ (కనీసం 20 ఇన్నింగ్స్‌) జాబితాలో ఎక్కడో చాలా దూరంలో లబుషేన్‌ రెండో స్థానం (63.43)లో ఉన్నాడు.

జయహో భారత్‌
60 ఓవర్లు (1983), 50 ఓవర్లు(2011), 20 ఓవర్లు (2007)... మూడు ఫార్మాట్‌లలోనూ ప్రపంచ కప్‌ గెలిచిన రికార్డు భారత్‌ సొంతం.

సచిన్‌ 100
ఆధునిక క్రికెట్లో సాటిలేని బ్యాట్స్‌మన్‌ సచిన్‌ తెందుల్కర్‌. భారత క్రికెట్‌ను తన భుజాలపై మోస్తూ దేశానికి ఎన్నో అపురూపమైన విజయాలను అందించిన మాస్టర్‌బ్లాస్టర్‌ ఆ క్రమంలో ఎన్నో రికార్డులను పాదాక్రాంతం చేసుకున్నాడు. అందులో ముఖ్యమైంది అతడి శతక శతకాల రికార్డు. పాతికేళ్ల కెరీర్‌లో పరుగుల వరద పారించిన సచిన్‌.. సరిగ్గా వంద (టెస్టుల్లో 51, వన్డేల్లో 49) శతకాలతో రిటైరయ్యాడు. 71 శతకాలతో పాంటింగ్‌ రెండో స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం ఆడుతున్న క్రికెటర్లలో సచిన్‌ రికార్డును బద్దలు కొట్టే అవకాశాలు కాస్తయినా ఉన్నది ఒక్క విరాట్‌ కోహ్లి (70)కి మాత్రమే. ఇక సచిన్‌ అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌ల రికార్డు (664), అత్యధిక పరుగుల రికార్డు (34357)ను తుడిచిపెట్టడం దాదాపు అసాధ్యమే.

జిమ్‌లేకర్‌ 19
ఓ టెస్టు మ్యాచ్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌ జిమ్‌ లేకర్‌. ఈ ఇంగ్లాండ్‌ స్పిన్నర్‌ ఆస్ట్రేలియాపై ఏకంగా 19 వికెట్లు పడగొట్టాడు. 1956లో నెలకొల్పిన ఈ రికార్డు ఇప్పటికీ పదిలంగా ఉంది. జిమ్‌లేకర్‌ 10/10 (ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు) ఘనతను కుంబ్లే అందుకోగలిగాడు. కానీ.. అతడి 19 వికెట్ల రికార్డును ఇన్నేళ్లలో ఎవరూ బద్దలు కొట్టలేకపోయారు. బహుశా ఎప్పటికీ కొట్టలేరేమో..!

మురళీధరన్‌ 800
శ్రీలంక స్పిన్‌ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్‌ లేకపో
తే టెస్టు క్రికెట్లో 800 వికెట్లు పడగొట్టడం సాధ్యమంటే ఎవరూ నమ్మేవారు కాదేమో. తన గింగిరాలు తిరిగే బంతులతో ప్రపంచవ్యాప్తంగా బ్యాట్స్‌మన్‌తో డ్యాన్స్‌ చేయించిన మురళీధరన్‌.. 133 టెస్టుల్లో సరిగ్గా 800 వికెట్లు పడగొట్టి రిటైరయ్యాడు. వార్న్‌ (708), కుంబ్లే (619) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. ప్రస్తుతం క్రికెట్‌ ఆడుతున్న బౌలర్లలో ఇంగ్లాండ్‌ పేసర్‌ జేమ్స్‌ అండర్సన్‌ (600) మురళీధరన్‌కు 200 వికెట్ల దూరంలో ఉన్నాడు. టెస్టు క్రికెట్‌ ప్రాధాన్యం, ఆడడం రోజురోజుకీ తగ్గిపోతున్న నేపథ్యంలో మురళీ రికార్డు బద్దలు కావడం దాదాపు అసంభవమనే చెప్పాలి.

వాస్‌ 8/19
వన్డే క్రికెట్‌ మ్యాచ్‌లో ఎనిమిది వికెట్లు పడగొట్టిన ఏకైక బౌలర్‌.. శ్రీలంక పేసర్‌ చమిందా వాస్‌. అతడు 2001లో జింబాబ్వేపై 19 పరుగులిచ్చి 8 వికెట్లు పడగొట్టాడు. వన్డే క్రికెట్‌ చరిత్రలో ఇప్పటి వరకు మరే ఇతర బౌలర్‌ కూడా ఓ మ్యాచ్‌లో ఎనిమిది వికెట్లు చేజిక్కించుకోలేదు.
పరిమిత ఓవర్ల క్రికెట్‌ క్రమంగా బ్యాట్స్‌మెన్‌ గేమ్‌గా మారుతున్న నేపథ్యంలో వాస్‌ రికార్డును బద్దలు కొట్టడం కష్టమే. మురళీధరన్‌, వాస్‌ సహా 11 మంది బౌలర్లు ఏడేసి వికెట్లు పడగొట్టారు.

జాక్‌ హాబ్స్‌ 61,760
ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్లో (1905-1934) దిగ్గజ బ్యాట్స్‌మన్‌ జాక్‌ హాబ్స్‌ పరుగులివి. నమ్మశక్యంగా లేదు కదూ! ఇక అతను 199 సెంచరీలు చేశాడంటే నోరు వెళ్లబెట్టాల్సిందే. ఈ రికార్డులను ఎవరూ బద్దలు కొట్టే అవకాశమే లేదు. 61 టెస్టుల్లో ఇంగ్లాండ్‌కు ప్రాతినిధ్యం వహించిన సర్‌ జాక్‌ హాబ్స్‌.. 50 ఏళ్లు దాటిన తర్వాత కూడా ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ ఆడడం విశేషం.

గిలెస్పీ 201
నైట్‌వాచ్‌మన్‌ బాధ్యత వికెట్‌ కాపాడుకోవడమే. ఆస్ట్రేలియా పేస్‌ బౌలర జేసన్‌ గిలెస్పీ మాత్రం ఏకంగా డబుల్‌ సెంచరీ బాదేసి ఔరా అనిపించాడు. 2006లో బంగ్లాదేశ్‌పై 201 పరుగులతో అజేయంగా నిలిచాడు. టెస్టు క్రికెట్‌ చరిత్రలో డబుల్‌ సెంచరీ సాధించిన ఏకైక నైట్‌వాచ్‌మన్‌గా గిలెస్పీ ఎప్పటికీ నిలిచిపోతాడేమో.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.