
కొంతమంది తమకు అమ్మాయి పుడితే బాగుంటుంది అనుకుంటారు. కొంతమంది అబ్బాయే కావాలనుకుంటారు. పుట్టింది ఏ బిడ్డ అయినా ఒకరిద్దరితో ఆపేస్తారు. కానీ అమెరికాకు చెందిన కేట్రీ, జే దంపతులు మాత్రం అలాకాదు. ఆడపిల్ల పుట్టే వరకూ వరసగా 14 మంది మగపిల్లలకు జన్మనిచ్చారు! వీరికి 1993లో పెళ్లయ్యింది. అప్పటి నుంచీ ఆ ఇంట వరసగా మగపిల్లలే పుడుతున్నారు. వీరికేమో ఆడపిల్ల కావాలని కోరిక. అందుకే భార్యాభర్తలిద్దరికీ 45 ఏళ్లు వచ్చేసినా మళ్లీ బిడ్డ కోసం ప్రయత్నించగా, 15వ కాన్పులో పండంటి ఆడబిడ్డ జన్మించింది! దీంతో వీరి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఆ పాపకు ‘మ్యాగీ జేన్’ అని పేరుపెట్టారు. లింగనిర్ధారణ ఆ దేశంలో సమ్మతమే అయినా, ప్రసవం వరకూ ఏ బిడ్డో తెలుసుకోవడం వీరికి ఇష్టం ఉండేది కాదట. దీంతో ఇంతమంది కొడుకులు పుట్టారు. 16,384 జంటల్లో ఒక్కరికి మాత్రమే ఇలా జరిగే అవకాశం ఉంటుందట!
పచ్చ పప్పీని చూశారా!
అప్పుడే పుట్టిన ముద్దుముద్దు కుక్కపిల్లల్ని చూస్తే భలే ముచ్చటేస్తుంది కదా! ఇవి ఎక్కువగా తెలుపూ, నలుపూ, గోధుమ వర్ణంలోనే ఉంటాయి. కానీ ఈ పప్పీ మాత్రం వెరైటీగా పచ్చరంగులో పుట్టింది! నార్త్ అమెరికా కరోలినాలో షానా స్టామీ అనే మహిళ ఓ జర్మన్ షెపర్డ్ జాతి కుక్కను పెంచుకుంటోంది, దాని పేరు జిప్సీ. ఈమధ్యే జిప్సీకి ఎనిమిది పిల్లలు పుట్టాయి. అవన్నీ మామూలుగానే ఉన్నా, ఒకటి మాత్రం భిన్నంగా ఇలా పచ్చరంగులో కనిపిస్తోంది. దీంతో దాని ఫొటోలు తీసి షానా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయడంతో అవి కాస్తా వైరల్ అయ్యాయి. తల్లి గర్భంలో ఉన్నప్పుడు ప్లాసెంటా పిగ్మెంటెషేన్ వల్ల ఇలా అరుదుగా జరుగుతూ ఉంటుందట. ఆ పప్పీ పెద్దయ్యేకొద్దీ మెల్లగా ఈ రంగు తగ్గి సాధారణ స్థితికి వస్తుందట. ప్రస్తుతానికి మాత్రం ఇదిలా ఉండటంతో మార్వెల్ సినిమాల్లో పచ్చగా కనిపించే పాత్ర ‘హల్క్’ పేరునే దీనికీ పెట్టేశారు.
ఈ చిలకమ్మ... ఎంత తెలివైందో!
ఆ చిలుక అందమైనదే కాదు, తెలివైనది కూడా! అందుకే ఆపదలో ఉన్న తన యజమాని ప్రాణాలు కాపాడింది. ఆస్ట్రేలియాలో ఉండే ఆంటోన్ న్యూయెన్ అనే వ్యక్తి ఓ చిలుకను పెంచుకుంటున్నాడు. దాని పేరు ఎరిక్. చిన్నచిన్న మాటలు పలకగలదు. ఓరోజు రాత్రి ఆంటోన్ బెడ్రూంలో గాఢనిద్రలో ఉన్నాడు. హఠాత్తుగా ఎరిక్ గట్టిగట్టిగా అరవడం మొదలెట్టింది. ‘ఆంటోన్... ఆంటోన్’ అంటూ యజమానిని పిలుస్తూనే ఉంది. ఉలిక్కిపడి లేచిన ఆంటోన్ ఏం జరిగిందో అని చుట్టూ చూస్తే ఇంటికి ఒకవైపున మంటలు చెలరేగుతున్నాయి! స్మోక్ అలారం గుర్తుపట్టి మోగేలోపే చిలుక అరిచి అలెర్ట్ చేసేసిందన్నమాట. దీంతో ఆంటోన్ వెంటనే తన చిలుకనూ, కావాల్సిన చిన్నచిన్న వస్తువులనూ తీసుకుని ఇంటి నుంచి బయటపడ్డాడు. ఎంతైనా ఇంటెలిజెంట్ చిలుక కదూ!
జారిపోని జలపాతమట!
నిత్యం నీళ్లు పారుతూ ఉండే జలపాతాలు నాచుపట్టి ఎంత జారుగా ఉంటాయో మనకి తెలిసిందే. ఆ రాళ్ల మీద అడుగువేసి నిలబడటమే కష్టం. కానీ థాయిలాండ్‌లోని ‘బువా టాంగ్’ వాటర్‌ఫాల్స్ మాత్రం అలా కాదు. దీని రాళ్లు జారిపోవు సరికదా, వాటిని ఆసరాగా చేసుకుని బాహుబలిలో ప్రభాస్‌లా ఒట్టి చేతులతో పైపైకి ఎక్కేంత అనువుగా ఉంటాయి. సాధారణంగా కనిపించే కొండరాళ్లకు భిన్నంగా ఈ జలపాతం జాలువారే కొండంతా పూర్తిగా తెల్లగా కనిపిస్తుంది. ఆ రాళ్లలోని కొన్ని మినరల్స్ వల్ల ఇది గరుగ్గా ఉండటమే కాకుండా, ఎక్కేటప్పుడు చాలా గ్రిప్ కూడా ఉంటుందట. అందువల్ల దానిపై చకచకా ఎక్కేసి ఆడుకోవచ్చు. అందుకే ఇది ఇక్కడ చాలా ఫేమస్ అయిపోయింది.
సినిమా
ప్రముఖులు
సెంటర్ స్ప్రెడ్
ఆధ్యాత్మికం
స్ఫూర్తి
కథ
జనరల్
సేవ
కొత్తగా
పరిశోధన
కదంబం
ఫ్యాషన్
రుచి
వెరైటీ
అవీ.. ఇవీ
టిట్ బిట్స్